
జగిత్యాల, వెలుగు: కేసీఆర్ సర్కార్ ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పురాణీపేట, జామా మసీద్‌ల వద్ద ఎమ్మెల్యే శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం మైనార్టీ ముస్లిం పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ గురుకుల స్కూళ్లు ప్రారంభించారన్నారు.
యువతుల వివాహానికి షాదీముబారక్పథకం ద్వారా రూ.లక్ష అందిస్తున్నామన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక జగిత్యాలలోని అన్ని మసీదులకు నిధులు కేటాయించానని, సదర్ మౌజన్ లకు ప్రభుత్వం ద్వారా వేతనాలు మంజూరు చేయించానని, కబరస్థాన్ లను అభివృద్ది చేశానన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు గట్టు సతీశ్, లీడర్లు ముజ్జు తదితరులు పాల్గొన్నారు.