
న్యూఢిల్లీ: తీహార్ జైల్లో కేజ్రీవాల్‌ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆమ్ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆందోళన వ్యక్తంచేశారు. జైలులో కేజ్రీవాల్‌కు ఏ క్షణమైనా, ఏమైనా జరగవచ్చని అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్ అనారోగ్య సమస్యను ఎగతాళి చేస్తూ, అతనికి సంబంధించిన తప్పుడు వార్తలను బీజేపీ నేతలు మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఖైదీల ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవడానికి జైలు నిబంధనలు అనుమతించవని.. అలాంటిది కేజ్రీవాల్‌కు సంబంధించిన నకిలీ డైట్ చార్ట్‌ను ఈడీ గురువారం మీడియాలో ఎందుకు ప్రచారం చేసిందని ఆయన ప్రశ్నించారు. సంజయ్ సింగ్ఆరోపణలపై ఇటు బీజేపీ నేతలు గానీ, ఈడీ అధికారులు గానీ స్పందించలేదు. కాగా, ఇన్సులిన్ ఇవ్వకుండా కేజ్రీవాల్‌ను చంపడానికి కుట్ర చేస్తున్నారని ఢిల్లీ మంత్రి ఆతిశీ ఆరోపించారు. అయితే, ఆమె ఆరోపణలను జైలు అధికారులు కొట్టిపారేశారు.