కామన్వెల్త్ గేమ్స్ లో ఇండియా బోణీ కొట్టింది. మన దేశానికి తొలి మెడల్ ను మహారాష్ట్రకు చెందిన 21 ఏళ్ల వెయిట్ లిఫ్టర్ సంకేత్ మహదేవ్ సర్గర్ సాధించిపెట్టారు. 55 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఆయన రజత పతకం (సిల్వర్ మెడల్) కైవసం చేసుకున్నారు. ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆయన రెండు రౌండ్లలో మొత్తం 248 కేజీల (113 కేజీలు + 135 కేజీలు) బరువును ఎత్తి రజత పతకాన్ని చేజిక్కించుకున్నారు. వాస్తవానికి సంకేత్ బంగారు పతకాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు వెలువడ్డాయి. అయితే రెండో రౌండ్ లో 138 కేజీల బరువును ఎత్తే క్రమంలో సంకేత్ కుడి మోచేయికి గాయమైంది. దీంతో ఆయన 138 కేజీలకుగానూ 135 కేజీల బరువునే ఎత్తగలిగారు.
"Great start for India," PM Modi congratulates weightlifter Sanket Sargar for winning silver at CWG 2022
— ANI Digital (@ani_digital) July 30, 2022
Read @ANI Story | https://t.co/fcfTPBMxur#PMModi #SanketSargar #CWG2022 #CWG2022India pic.twitter.com/iENJN4Kxni
మలేషియాకు స్వర్ణం
మరోవైపు ఇదే ఫైనల్ మ్యాచ్ రెండో రౌండ్ లో మలేషియాకు చెందిన బిన్ కస్దన్ మహ్మద్ అనీఖ్ 142 కేజీల బరువు ఎత్తి బంగారు పతకాన్ని సాధించారు. శ్రీలంకకు చెందిన దిలాంక ఇసురు కుమార 225 కేజీల బరువు ఎత్తి (105 కేజీలు + 120 కేజీలు) కాంస్య పతకం సాధించారు.
ప్రధాని మోడీ శుభాకాంక్షలు
రజత విజేత సంకేత్ మహదేవ్ సర్గర్ కు ప్రధాని మోడీ, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తృటిలో బంగారు పతకం చేజారినందుకు బాధగా ఉంది. కుడి మోచేయికి గాయం కావడం వల్ల నేను రెండో రౌండ్ లో ఆశాజనక ఫలితం సాధించలేకపోయాను. దేశానికి తొలి పతకం అందించినందుకు సంతోషంగా ఉంది ’’ అని సంకేత్ మహదేవ్ సర్గర్ చెప్పారు.
