బీఆర్‌‌ఎస్‌ను ఇంటికి పంపాలె: సంకినేని వెంకటేశ్వరరావు

బీఆర్‌‌ఎస్‌ను ఇంటికి పంపాలె: సంకినేని వెంకటేశ్వరరావు

సూర్యాపేట , వెలుగు : ఇచ్చిన హామీలు అమలు చేయని బీఆర్‌‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం కేసారం, తాళ్ల ఖమ్మంపాడు, కాసరబాధ గ్రామాలకు చెందిన 50 కుటుంబాలు బీజేపీలో చేరాయి.  ఈ సందర్భంగా సంకినేని మాట్లాడుతూ.. కేసీఆర్‌‌ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లైనా పేదలకు  డబుల్ బెడ్‌రూం ఇండ్లు కలగానే మిగిలి పోయాయని విమర్శించారు. ఓట్ల కోసమే లాస్ట్‌ టైం దళితులకు మూడెకరాల భూమి, ఈ సారి దళితబంధు తీసుకొచ్చారని ఆరోపించారు.  

రూ. లక్ష రుణమాఫీ అమలు చేసే లోపు అసలు కన్నా వడ్డీ రెట్టింపు అయ్యిందని మండిపడ్డారు.   కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోడంతో ప్రజలు ఉజ్వల గ్యాస్, ఆయుష్మాన్ భారత్ పథకాలకు అర్హత కోల్పోయారని వాపోయారు.   మంత్రి జగదీశ్‌ రెడ్డి అభివృద్ధి ముసుగులో అవినీతికి పాల్పడుతున్నారని , ఆయన అనుచరుల కబ్జాలతో ప్రజలు విసిగిపోయారన్నారు. కేసారం గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి కాకుండానే లబ్ధిదారుల జాబితా డ్రా తీశారని మండిపడ్డారు.

వచ్చే ఎన్నికల్లో మంత్రికి డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదని విమర్శించారు.  తనకు ఈ ఎన్నికలే చివరివని, సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు.  నేతలు కర్నాటి కిషన్, వెన్న శశిధర్ రెడ్డి, వెన్న చంద్రారెడ్డి, ఉప్పు శ్రీనివాస్, సలిగంటి వీరేంద్ర, బోర రమేశ్ యాదవ్, మొండికత్తి శివాజీ, మామిడి వెంకన్న , సలిగంటి నరేశ్, పచ్చిపాల సైదులు, జానీ గౌడ్, నాగరాజు, రాచకొండ రామకృష్ణ, సాలయ్య, మర్రి వెంకన్న పాల్గొన్నారు.