శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు

శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు

మాదాపూర్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు మొదలుకానున్నాయి. ఈ నెల 13 నుంచి ముక్కనుమ పండుగ వరకు (జనవరి 13వ తేదీ నుండి 17 వరకు) సంక్రాంతి పండుగను నిర్వహించడం జరుగుతుందని శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ జి.కిషన్ రావు స్పష్టం చేశారు. పండుగ సందర్భంగా గంగిరెద్దులు, హరిదాసులు, బుడబుక్కలు, జంగమదేవరులు, పిట్టలదొరలు, ఎరుకలసాని..మొదలైన కళాకారులు ఇక్కడ సందడి చేస్తారని తెలిపారు. 14వ తేదీన  భోగి పండుగ పురస్కరించుకొని 11 సంవత్సరంలోపు ఉన్న చిన్న పిల్లలకి "భోగి పళ్ళ " ఉత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. సందర్శకులు పిల్లలను తీసుకొచ్చి భోగి పళ్ళును శాస్త్రోక్తంగా పోయించుకోవలసిందిగా జి కిషన్ రావు కోరారు.  

సంక్రాంతి పండుగకి బొమ్మల కొలువు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని కిషన్ రావు వెల్లడించారు. ప్రతి రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. ఇందులో భాగంగా కళామండలం ప్రసాద్ తో కథాకళి ప్రదర్శన, బాల త్రిపురసుందరి శిష్య బృందంతో కూచిపూడి నృత్య ప్రదర్శనలు, చంద్ర శేఖర్ శిష్య బృందంతో "శ్రీ గోదా కళ్యాణం" నృత్య రూపకం, కృష్ణ కుమార్ కాకినాడ శిష్య బృందంతో కూచిపూడి నృత్యాలు,  డాక్టర్ సాగర్, తుంకూర్, కర్ణాటక శిష్య బృందం, చిత్ర నారాయణన్ శిష్య బృందంతో భరతనాట్య ప్రదర్శనలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఎడ్లబండి, బ్యాటరీ కార్ సవారీ, బోటింగ్, పిల్లల ఆటస్థలం  నేషనల్ హ్యాండీ క్రాఫ్ట్స్ ఫెయిర్ సందర్బంగా హస్తకళా యూథపతుల స్టాల్ల్స్ ఎన్నో మరెన్నో  సందర్శకులకు అందుబాటులో ఉన్నాయని కిషన్ రావు పేర్కొన్నారు.