సిటీలో సంక్రాంతి జోష్

సిటీలో సంక్రాంతి జోష్

నగరవాసులకు కనువిందు చేస్తున్న పల్లె అందాలు                

నేడు నటరాజ్​ లాన్​లో భోగి

మాదాపూర్​/ హైదరాబాద్​, వెలుగు: హైటెక్​ సిటీ పక్కనే పల్లె అందాలు సింగారించుకున్న శిల్పారామం సంక్రాంతి సంబురాలతో సందడిగా మారింది. పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లలేకపోయిన నగరవాసులు కుటుంబ సమేతంగా వచ్చి పల్లె అందాలను ఎంజాయ్​ చేస్తున్నారు. గంగిరెద్దుల ఆటలు, గుస్సాడి డ్యాన్స్​లతో సంక్రాంతి సంబురాలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజే అనేకమంది సందర్శకులు విలేజ్ మ్యూజియంలో ఏర్పాటుచేసిన సంక్రాంతి ఆటపాటలను చూడటానికి వచ్చారు. సోదీ చెప్పేవారు, పిట్టలదొర, తుపాకీరాముడి హడావిడితో సందడిగా గడిపారు. గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలు, ఆదిలాబాద్ నుంచి వచ్చిన గుస్సాడి కళాకారుల ప్రదర్శనలు, బుడబుక్కలు, జంగమదేవరులు, పిట్టలదొర, కొమ్మదాసరుల ప్రదర్శనలతో శిల్పారామం కళకళలాడుతోంది.

ఆంఫీ థియేటర్​లో నిర్వహించిన కార్యక్రమంలో కాలిఫోర్నియా నుంచి వచ్చిన శరణ్య భరతనాట్యంతో చూపులను కట్టిపడేసింది. ముసునూరి ఇందిర శిష్య బృందం కుండపై నిలబడి దీపాలతో చేసిన నృత్యం హైలేట్​గా నిలిచింది. నాగ్​పూర్​ కళాకారుల జానపద నృత్యాలు ఆకర్షణగా నిలిచాయి. సంక్రాంతి సంబురాల్లో భాగంగా ఏట భోగిపళ్ల పండుగ నిర్వహిస్తారు. శిల్పారామంలోని నటరాజ్ లాన్ లో మంగళవారం ఈ వేడుక నిర్వహించనున్నారు. రంగు రంగుల ముగ్గులు, బంతిపూల అలంకరణలతో శిల్పారామం పరిసరాలు కలర్​ఫుల్​గా మారాయి. సంక్రాంతి సందర్భంగా ఎడ్లబండిపై  తిరిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆకట్టుకుంటున్న గుస్సాడి

ఒళ్లంతా రంగులు.. జంతువుల చర్మం.. తలమీద పెద్ద పెద్ద నెమలీకల తలపాగాలతో గిరిజన కళాకారులు చేసే గుస్సాడి డాన్స్​ అందరినీ ఆకట్టుకుంటోంది. కొలామ్ కళాకారుల ప్రత్యేకత ఆట ఇది. 15మంది కలిసి ఒకేసారి కాళ్లు కదుపుతూ డాన్స్​ చేస్తారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆదిలాబాద్ నుంచి శిల్పారామం వచ్చారు. ఏటా శిల్పారామంలో జరిగే సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటున్నట్టు తెలిపారు. తాత ముత్తాల నుంచి ఈ కళను కొనసాగిస్తున్నట్టు చెప్పారు.