Sharwanand : ‘నారీ నారీ నడుమ మురారి’ బంపర్ ఆఫర్.. MRP ధరలకే మూవీ టికెట్స్!

Sharwanand : ‘నారీ నారీ నడుమ మురారి’ బంపర్ ఆఫర్.. MRP ధరలకే మూవీ టికెట్స్!

ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద యుద్ధం గట్టిగానే సాగుతోంది.  ఇప్పటికే ప్రభాస్ ‘ది రాజాసాబ్’, మెగాస్టార్ చిరంజీవి 'మనశంకర వరప్రసాద్ గారు' చిత్రాలు విడుదలై థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఇదే వరుసగా రవితేజ, శర్వానంద్, నవీన్ పొలిశెట్టి సినిమాలు క్యూ కట్టాయి. అయితే, అందరి చూపు ఇప్పుడు జనవరి 14న విడుదల కానున్న శర్వానంద్ 37వ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’ పై పడింది. 

టికెట్ ధరలపై షాకింగ్ నిర్ణయం

సాధారణంగా సంక్రాంతి సీజన్లలో సినిమా టికెట్ల రేట్లను పెంచేస్తారు.  పెంచిన ధరలతో సామాన్య ప్రేక్షకుడు థియేటర్‌కు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి. కానీ, శర్వానంద్ టీమ్ అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎలాంటి అదనపు ఛార్జీలు లేవు.. కేవలం MRP ధరలకే టికెట్లు అంటూ అదిరిపోయే పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. శర్వానంద్ కోడిపుంజును పట్టుకున్న మాస్ లుక్ ఉన్న ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నిర్ణయం మధ్యతరగతి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో కీలకం మారుతోందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

నవ్వుల విందు గ్యారెంటీ!

ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. బీటెక్ చదివి ఆర్కిటెక్ట్‌గా పనిచేసే యువకుడిగా శర్వానంద్ కనిపిస్తుండగా, అతని జీవితంలోకి సంయుక్తా మీనన్, సాక్షి వైద్య ప్రవేశిస్తారు. ఇద్దరు భామల మధ్య మురారి పడే పాట్లు, ఆ ముగింపు లేని సమస్యను దర్శకుడు రామ్ అబ్బరాజు చాలా ఫన్నీగా చూపించారు. ముఖ్యంగా కమెడియన్ సత్య ఆటో డ్రైవర్‌గా చేసే కామెడీ, ప్రెగ్నెన్సీ సీన్ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది. ‘సామజవరగమన’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. 

►ALSO READ | Nikhil : బాక్సాఫీస్ రికార్డులపై గురిపెట్టిన 'స్వయంభు'.. ఇంటర్వెల్ సీన్‌తో థియేటర్లలో పూనకాలే!

ఈ చిత్రంలో టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు ఒక పవర్‌ఫుల్ అతిథి పాత్రలో మెరవనున్నారు. ‘సీతారామం’ ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్న సంగీతం ఇప్పటికే శ్రోతలను అలరిస్తోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ సినిమాను రూపొందించారు.  ఒకవైపు భారీ బడ్జెట్ సినిమాలు పోటీలో ఉన్నా, లో-బడ్జెట్ టికెట్ ఆఫర్, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో ‘నారీ నారీ నడుమ మురారి’ సంక్రాంతి విజేతగా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి ఇద్దరు భామల నడుమ ఈ మురారి చేసే హంగామా ఎలా ఉండబోతుందో తెలియాలంటే జనవరి 14 వరకు ఆగాల్సిందే!