Saraswati Pushkaralu: సరస్వతి పుష్కరాలకు వెళుతున్నారా..? బయల్దేరే ముందు ఇవి తెలుసుకోండి..

Saraswati Pushkaralu: సరస్వతి పుష్కరాలకు వెళుతున్నారా..? బయల్దేరే ముందు ఇవి తెలుసుకోండి..

కాళేశ్వరం: భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో నేటి నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. 12 ఏండ్ల తర్వాత జరగనున్న పుష్కరాలకు రాష్ట్ర సర్కారు ఘనంగా ఏర్పాట్లు చేసింది.

గురువారం ఉదయం 5.44 గంటలకు తోగుట ఆశ్రమం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవనంద సరస్వతి స్వామీజీ పుష్కర స్నానాలను ప్రారంభించారు. సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి పుష్కరస్నానం ఆచరిస్తారు. 

కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన ఏకశిల సరస్వతి మాత విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సరస్వతి పుష్కర ఘాట్ వద్ద ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

భక్తులకు సకల సౌకర్యాలు..

* సరస్వతి పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సరస్వతి విగ్రహం పైన, పక్కన సినిమా స్టైల్‌‌‌‌లో దేవాలయం సెట్‌‌‌‌ వేశారు. దాదాపు ఎకరం భూమిలో ఈ సెట్‌‌ను రూపొందించారు. భక్తులను ఆకట్టుకునేలా దీన్ని తీర్చిదిద్దారు.

* భక్తుల వసతి కోసం దేవస్థానం వద్ద 100 రూముల వసతి గృహం, డార్మేటరీ అందుబాటులోకి తీసుకొచ్చారు. సరస్వతి ఘాట్ వద్ద 100 గదులతో టెంట్ సిటీని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏసీ, కూలర్ల సౌకర్యం కల్పించారు. భక్తులకు వీటిని రెంట్‌‌‌‌ పద్ధతిలో ఇస్తారు.

* భక్తుల స్నానాల కోసం షవర్లు, బట్టలు మార్చుకొనే గదులు ఏర్పాటు చేశారు, దేవాలయం చుట్టూ, పుష్కర ఘాట్ల వద్ద చలువ పందిళ్లు వేశారు. కొత్తగా ఓవర్​ హెడ్​ ట్యాంకులు నిర్మించి, తాగునీటి సౌకర్యం కల్పించారు.

* దేవాలయం చుట్టూ సీసీ రోడ్ల నిర్మాణం, పిండ ప్రదాన మండపం, శాశ్వత మరుగుదొడ్లు, స్నానాల గదులు నిర్మించారు.

* శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద లడ్డు, పులిహోర ప్రసాదాలు అందుబాటులో ఉంచారు. భక్తులకు ఉచిత అన్నదానం, ఉచిత ప్రసాదం పంపిణీ చేయనున్నారు.