IND vs ENG: తొలి టెస్టులోనే అరుదైన ఘనత.. గవాస్కర్ సరసన సర్ఫరాజ్ ఖాన్

IND vs ENG: తొలి టెస్టులోనే అరుదైన ఘనత.. గవాస్కర్ సరసన సర్ఫరాజ్ ఖాన్

టీమిండియా అరంగేట్రం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూసిన సర్ఫరాజ్ ఖాన్.. తొలి టెస్టులోనే సత్తా చాటాడు. ఇంగ్లాండ్ పై రాజ్ కోట్ లో జరుగుతున్న మూడో టెస్టులో వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 62 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో తొలి టెస్ట్ మ్యాచ్ లోనే దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సరసన చేరి అరుదైన ఘనత అందుకున్నాడు. 

26 ఏళ్ల సర్ఫరాజ్.. డెబ్యూ టెస్టులోనే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించిన నాలుగో భారతీయుడిగా నిలిచాడు. సర్ఫరాజ్ కు ముందు దిలావర్ హుస్సేన్, సునీల్ గవాస్కర్, శ్రేయాస్ అయ్యర్ మాత్రమే ఈ ఘనత సాధించారు. దిలావర్ 1934లో ఇంగ్లండ్‌పై అర్ధసెంచరీలు చేసి ఈ ఘనత సాధించిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. 1971లో సునీల్ గవాస్కర్ వెస్టిండీస్‌పై..2021లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో శ్రేయాస్ అయ్యర్ తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ.. సెకండ్ ఇన్నింగ్స్ లో సెంచరీ చేశాడు. 

టెస్టు అరంగేట్రంలో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు చేసిన భారతీయులు

1. దిలావర్ హుస్సేన్: 59,57 vs ఇంగ్లండ్ 1934

2. సునీల్ గవాస్కర్: 65,67 vs వెస్టిండీస్ 1971

3. శ్రేయాస్ అయ్యర్: 105,65 vs న్యూజిలాండ్ 2021

4. సర్ఫరాజ్ ఖాన్: 62,68 vs ఇంగ్లాండ్ 2024