- 2019లో చీటీ పద్ధతిలో సర్పంచ్ ఎన్నిక వివాదాస్పదం..
- నాటి ఎన్నికను రద్దు చేసిన ఎలక్షన్ కమిషన్
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మేజర్గ్రామపంచాయతీకి ఏడేళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. 2019లో జరిగిన సర్పంచ్ ఎన్నికలు వివాదాస్పదం కావడంతో ఎలక్షన్ కమిషన్ ఆ ఎన్నికను రద్దు చేసింది. అప్పటి నుంచి జీపీలో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతూ వచ్చింది. తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తమ గ్రామంలో అభివృద్ధి పనులు పరుగులు పెడతాయని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
2019లో సర్పంచ్ ఎన్నికపై వివాదం
మల్లాపూర్ జీపీలో దాదాపు 8 వేల జనాభా ఉంది. 2019లో జరిగిన సర్పంచ్ ఎన్నిక వివాదస్పదంగా మారింది. ఇద్దరు అభ్యర్థులు కుమ్మక్కై చీటీ పద్ధతిలో పదవిని నిర్ణయించుకోవడంతో పెద్ద వివాదం రేగింది. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు అనంతరం ఆ ఎన్నికను రద్దు చేస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆ తర్వాత ఎన్నికలు జరగకపోవడంతో మల్లాపూర్‌లో స్పెషల్ ఆఫీసర్ల పాలనలోనే కొనసాగింది. దీంతో జీపీ అభివృద్ధిని అధికారులు పట్టించుకోకపోవడంతోపాటు నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిపై ఓ ఆఫీసర్‌పై చర్యలు కూడా తీసుకున్నారు.
పెండింగ్‌లో ఉన్న సమస్యలు
మల్లాపూర్ గ్రామంలోని ఒడ్డెర కాలనీ, గ్రామ శివారు ప్రాంతాల్లో డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉంది. వర్షాకాలంలో పాత బస్టాండ్ పరిసరాల్లో నిలిచిపోయే నీరు లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి చేరి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోంది. పలుమార్లు అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్తులు చెబుతున్నారు.
మల్లాపూర్ మేజర్ జీపీలో అంత్యక్రియలకు ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా చనిపోతే అంత్యక్రియల కోసం వెళ్లిన వారికి స్నానం చేసేందుకు నీరు, విద్యుత్ సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నారు.
మండలకేంద్రంలోని మోడల్ స్కూల్‌కి వెళ్లేందుకు హైలెవెల్ బ్రిడ్జి లేకపోవడంతో రోడ్డు దాటేందుకు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
