సీఎం ఇలాకాలో రాజీనామాల ‘పంచాయితీ’

సీఎం ఇలాకాలో రాజీనామాల ‘పంచాయితీ’

సిద్దిపేట/ గజ్వేల్, వెలుగు: సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తి రాజుకుంటోంది. నిధులు, బిల్లుల కోసం సర్పంచ్​లు, ఎంపీటీసీలు నిరసన గళం వినిపిస్తున్నారు. రాజీనామాలతో ప్రభుత్వం, టీఆర్​ఎస్​ హైకమాండ్​పై ఒత్తిడి పెంచేందుకు వ్యూహం రచిస్తున్నారు. వివిధ కారణాలతో ఇప్పటికే కొందరు ఎంపీటీసీలు సోషల్​ మీడియా వేదికగా గళమెత్తగా.. మరికొందరు సర్పంచ్ లు ఏకంగా రాజీనామాలకు సిద్ధమైనట్లు సమాచారం. గ్రామపంచాయతీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న తమకు నిధులు అందక అలంకారప్రాయంగా మారామని వారు వాపోతున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, కొండపాక, జగదేవ్ పూర్, ములుగు, మర్కుక్, వర్గల్ మండలాల పరిధిలో మొత్తం 148 గ్రామపంచాయతీలు ఉండగా వీటిలో అధికార పార్టీకి చెందిన మెజార్టీ సర్పంచ్ లు రాజీనామాలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవలే జగదేవ్​పూర్​కు చెందిన 12 మంది సర్పంచ్ లు, మర్కుక్ మండలానికి చెందిన 16 మంది సర్పంచ్ లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకుని నిధుల విడుదల, బిల్లుల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ రాజీనామాలకు సిద్ధమయ్యారు. వర్గల్ మండలానికి చెందిన సర్పంచ్ లు ఇటీవల నిర్వహించుకున్న మీటింగ్​లో రాజీనామాలు చేయాలనే ప్రతిపాదనను ముందుకు తెచ్చి.. కొద్ది రోజులు వేచి చూద్దామని ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. సీఎం నియోజకవర్గంలో అధికార పార్టీ సర్పంచ్ లు రాజీనామాలకు రెడీ అవుతుండడం సర్వత్రా చర్చానీయాంశంగా మారుతోంది.

బుజ్జగింపుల్లో ముఖ్య నేతలు..

గజ్వేల్ నియోజకవర్గంలోని  సర్పంచ్ లు రాజీనామాలకు సిద్ధం కావడంతో అప్రమత్తమైన ముఖ్య నేతలు బుజ్జగింపుల పర్వానికి తెరలేపారు. జగదేవ్​పూర్ మండలానికి చెందిన సర్పంచ్ లు రాజీనామాకు సిద్ధపడడంతో వెంటనే నియోజకవర్గ ముఖ్య నేత ఒకరు వారితో సమావేశమై బిల్లులు మంజూరయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. గడా(గజ్వేల్ ఏరియా డెవలప్ మ్మెంట్ అథారిటీ) నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తామని సంబంధిత ఆఫీసర్లతో మాట్లాడించారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ ఉన్న మర్కుక్ మండల సర్పంచ్ లు సైతం ఇటీవల రహస్య మీటింగ్​ నిర్వహించి రాజీనామాలకు సిద్ధమవుతున్నట్లు మీడియాకు సమాచారం ఇచ్చారు. ఈ విషయంపై వార్తలు రావడంతో అధికార పార్టీ లీడర్లు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఇటీవల వర్గల్ మండల సర్పంచ్​లు సైతం సమావేశాన్ని నిర్వహించుకుని రాజీనామాలపై తర్జనభర్జన పడ్డారు. చివరకు మరి కొద్ది రోజులు వేచి చూడాలని నిర్ణయించుకున్నారు. నియోజకవర్గంలోని కొండపాక, ములుగు మండలాల్లోని సర్పంచ్ లు సైతం ఇదే అంశంపై చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.

బిల్లుల చెల్లింపులు మస్తు లేట్​..

గజ్వేల్ నియోజకవర్గంలోని గ్రామపంచాయతీలకు సంబంధించి బిల్లుల చెల్లింపుల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుండడం సర్పంచుల్లో అసంతృప్తిని పెంచుతోంది. పంచాయతీల్లో వివిధ పనుల్లో పాల్గొనే మల్టి పర్పస్ వర్కర్ల వేతనాల బిల్లులు ట్రెజరీల్లో నెలల కొద్దీ పెండింగ్ లో ఉండటం సర్పంచ్ లను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రతి పంచాయతీలో నాలుగు నుంచి పది మంది మల్టీపర్పస్ వర్కర్లు అనేక పనులు నిర్వహిస్తున్నా సకాలంలో వారికి శాలరీలు ఇవ్వలేకపోతున్నామని సర్పంచ్ లు వాపోతున్నారు. దీనికి తోడు వివిధ అభివృద్ధి పనులు నిర్వహిస్తే వాటి బిల్లులు సైతం నెలల తరబడి ట్రెజరీల్లో మూలగడం, పని నిర్వహించకుంటే గ్రామ కార్యదర్శులకు మెమోలు ఇవ్వడం వల్ల అప్పులు చేసి పనులు చేస్తున్నారు. అయినా బిల్లులు మంజూరు కాకపోవడం వారిని విస్మయానికి గురిచేస్తోంది. సీఎం కేసీఆర్ నియోజకవర్గం కాబట్టి తొందరగా నిధులు వస్తాయని పనులు చేసినా ఫలితం ఉండడం లేదని సర్పంచ్ లు అంటున్నారు.

హైకమాండ్​పై ఒత్తిడి తెచ్చేందుకే..

పంచాయతీలకు సంబంధించిన బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడం, అభివృద్ధి పనులకు నిధులు లేకపోవడంతో టీఆర్​ఎస్​ హైకమాండ్​పై ఒత్తిడి తెచ్చేందుకు ఆ పార్టీకి చెందిన సర్పంచ్​లు రాజీనామాల వ్యూహానికి తెరలేపారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచి గెలిచిన మొదటి దఫాలో పంచాయతీలకు భారీగా ఫండ్స్  మంజూరు కావడంతో పలు అభివృద్ధి పనులను నిర్వహించారు. అడిగినన్ని నిధులు ఇవ్వడంతో చాలా పనులు నిర్వహించారు. కానీ రెండో దఫా కొత్త గ్రామపంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున నిధులు విడుదల కాగా.. మిగిలిన జీపీలకు ఎలాంటి నిధులు విడుదల కాలేదు. మరోవైపు పంచాయతీ బిల్లులు నెలల తరబడి పెండింగ్ లో ఉన్నాయి. రెండున్నర సంవత్సరాలుగా నిధులు విడుదల కాకపోవడంతో పాటు అప్పులు చేసి చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు ఇవ్వలేదు. దీంతో సర్పంచ్​లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాజీనామాలతో ఒత్తిడి తెస్తే నిధులు మంజూరవుతాయని వారు భావిస్తున్నారు. 

అదే బాటలో ఎంపీటీసీలు..

సర్పంచ్ ల తరహాలోనే గజ్వేల్​ నియోజకవర్గంలో ఎంపీటీసీలు కూడా గళం విప్పుతున్నారు. ఇటీవల జగదేవ్ పూర్ మండలానికి చెందిన ఇద్దరు ఎంపీటీసీలు తాము ఎలా నిర్లక్ష్యానికి గురవుతున్నారో వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అధికార పార్టీకి చెందినప్పటికీ ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయి ప్రజల్లో చులకన అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొండపాక మండలం ఎర్రవెల్లి ఎంపీటీసీ తమను మంత్రులు అవమానించేలా మాట్లాడుతున్నారని సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వైరల్ గా మారింది. సీఎం ఇలాకాలో అధికార పార్టీకి చెందిన సర్పంచ్​, ఎంపీటీసీలు నిరసన గళం వినిపిస్తుండడంతో టీఆర్​ఎస్​కు తలనొప్పిగా మారింది.

రాయిపోల్​లో సీక్రెట్​ మీటింగ్​

దుబ్బాక, వెలుగు: అధికార పార్టీలో తమను గుర్తించడం లేదంటూ కొందరు ప్రజాప్రతినిధులు వేరే పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. టీఆర్​ఎస్​కు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు శుక్రవారం రాయపోల్​ మండలంలోని ఓ ప్రైవేట్​ ఫంక్షన్​ హాల్​లో రహస్య మీటింగ్​ నిర్వహించి బీజేపీలో చేరాలని నిర్ణయించినట్లు తెలిసింది. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేసిన నాయకులకు గుర్తింపు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.