
రంగారెడ్డి జిల్లా, వెలుగు:పంచాయతీ అభివృద్ధి చేయాలని అధికారమిస్తే అందినకాడికి నొక్కేసి అవినీతి మరకలు అంటించుకున్నారు కొందరు సర్పంచ్‌లు. మళ్లీ అవకాశం వస్తుందో రాదోనని చేతివాటం ప్రదర్శించారు. అధికారాన్ని అడ్డుపెట్టకుని చేతికందింది దోచేద్దాం అన్న ధోరణిలో 31 మంది సర్పంచ్‌లు అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో 560 గ్రామ పంచాయలు ఉండగా, వాటిల్లో 31 మంది సర్పంచ్‌లు అవినీతి ఆరోపణలతో మొదటి స్థానంలో నిలిచారు. అక్రమాలపై ఫిర్యాదులు వచ్చిన సర్పంచ్‌లపైనే వేటు పడింది. అసలు ఫిర్యాదులే రాకుండా జాగ్రత్తపడి పబ్బం గడుపుకున్న సర్పంచ్‌లు ఎక్కువ మందే ఉన్నారు.
కొందరైతే తాము మునిగిందే కాక గ్రామ కార్యదర్శులనూ కూడా ముంచారు. జిల్లాలోని 31 మంది సర్పంచ్‌లు రూ.4,38,26,465ల నిధులను దుర్వినియోగానికి పాల్పడ్డారు. వాటిలో రూ.42,79,277లను మాత్రమేఅధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా రూ.3,95,47,188లను స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు 31 మందిలో 16 మంది సర్పంచ్‌ల నుంచి పూర్తి స్థాయిలో పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం స్వాధీనం చేసుకున్నారు. మరో 15 మందిలో హయత్‌నగర్ మండలంలోని కుత్బల్లాపూర్, రాగన్నగూడ, అమన్‌గల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు మాత్రం ఉన్న నగదు మొత్తంలో 25శాతం మాత్రమే చెల్లించారు.
చేతివాటం ఈపనుల్లో…
సర్పంచ్ కాగానే కొందరు వెంటనే అక్రమాలకు నడుంబిగించారు. మరికొందరు వ్యవస్థను అర్థం చేసుకొన్న తర్వాత తమదైన శైలిలో అక్రమాలకు పాల్పడ్డారు. ప్రధానంగా గ్రామాల్లో సీసీ రోడ్డు, మురుగు కాల్వల నిర్మాణం, వీధిలైట్లు, నల్లా కనెక్షన్లకు అనుమతులు, పారిశుద్ధ్య పనులు చేపట్టడం వంటి వాటిల్లో అక్రమాలకు పాల్పడ్డారు. ప్రతి గ్రామానికి జనాభాను బట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తాయి. వచ్చే నిధుల ఆధారంగా ప్రాధాన్య క్రమంలో అభివృద్ధి పనులు చేపడతారు. ఇక్కడే సర్పంచ్‌లు చేతివాటాన్ని ప్రదర్శించారు. సీసీ రోడ్ల నిర్మాణంలో నిధులు కాజేసిన ఘటనలే ఎక్కువగా ఉండడం గమనార్హం. రోడ్లు, కాల్వలు, వీధి లైట్ల ఏర్పాటులో తప్పుడు బిల్లులు సృష్టించి నిధులు నొక్కేస్తున్నారు.
వాస్తవానికి, గ్రామాభివృద్ధికి సంబంధించిన ఏవైనా పనులు నిర్వహించాలంటే మెజర్‌మెంట్ బుక్(ఎంబీ)లో రికార్డు చేయాలి. కానీ, ఎంబీ రికార్డులు లేకుండానే కొందరు సర్పంచ్‌లు డబ్బులు డ్రా చేసేశారు. చివరికి, మరుగు దొడ్ల బిల్లులను కూడా వదిలిపెట్టలేదు. వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకున్న వారికి ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు లంచాలు వసూలు చేసి సస్పెండైన సర్పంచ్ లు ఉన్నారు. ఇక పంచాయతీల పరిధిలో అక్రమ లే అవుట్లకు అనుమతి ఇచ్చి కమీషన్లు తీసుకున్న ఘనాపాటి సర్పంచ్‌లు లేకపోలేదు. అలాగే, అసైన్డ్ భూముల్లో ఇండ్ల నిర్మాణాలకు అనుమతినిచ్చిన ఆమ్యామ్యాలు తీసుకుని సస్పెండైన సర్పంచ్ లుకొందరు ఉన్నారు.
పరపతితో స్టే వెకెట్…
జిల్లాలో కొన్ని గ్రామాలను మినహాయిస్తే ప్రతి గ్రామంలో అవినీతి అక్రమాలు, నిధుల గోల్‌మాల్ భారీగా చోటుచేసుకున్నాయి. పంచాయతీరాజ్ శాఖ ఆడిట్ లో సరియైన బిల్లులను చూపించకపోవడం, ఎంబీ రికార్డుల నిర్వహణ సక్రమంగా నిర్వహించకపోవడంతో పంచాయతీ నిధుల దుర్వినియోగం అయినట్లుగా అధికారికంగా గుర్తించారు. ఆవిధంగా జిల్లాలో 31 మంది సర్పంచ్‌లు నిబంధనలకు వ్యతిరేకంగా నిధులు తీసుకొని సక్రమంగా ఖర్చు చేయకపోవడంతోనే నిధుల లెక్కింపుల్లో తేడా వచ్చాయి. ఈవిధంగా గుర్తించిన సర్పంచ్‌లను సస్పెండైతే, మరికొన్నిచోట్ల చెక్‌పవర్ రద్దు చేశారు. జిల్లాలోని రాజేంద్రనగర్ మండల పరిధిలోని పుప్పల్‌గూడ, నార్సింగ్, బండ్లగూడ జాగీర్, మహేశ్వరం మండలం రావిర్యాల, తలకొండపల్లి మండలం పడ్కాల్ గ్రామ సర్పంచ్‌లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఒక్క పుప్పల్‌గూడ సర్పంచ్‌కిస్టే ఎత్తివేయలేకపోయారు. మిగిలిన సర్పంచ్‌లు కోర్టు స్టే ఉత్తర్వులను వెకెట్ చేసుకున్నారు. తన పలుకుబడిని ఉపయోగించి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ద్వారా సస్పెండ్‌ను ఎత్తివేయించుకున్నట్లు సమాచారం. సర్పంచ్‌లు అవినీతికి పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడి అవుతున్నాయి. దీనిపై జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. ఇక్కడే టిస్ట్ మొదలైయింది. సర్పంచ్‌లు తమ స్టేటస్ చూపిస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులను పట్టుకుని సస్పెన్షన్లను ఎత్తి వేయించుకుంటున్నారు. ఆస్థాయిలో కాకపోతే కోర్టులను ఆశ్రయించి అక్కడి నుంచి స్టే ఆదేశాలు తెచ్చుకుంని సర్పంచ్‌లుగా కొనసాగుతున్నారు.