గద్వాల జిల్లా సర్పంచులు కలెక్టరేట్​ ముట్టడి

గద్వాల జిల్లా సర్పంచులు కలెక్టరేట్​ ముట్టడి

సర్పంచులను భయపెట్టి పనులు చేయించిన సర్కార్​ బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నదని బుధవారం గద్వాల జిల్లాలోని సర్పంచులు కలెక్టరేట్​ను ముట్టడించారు. ఒక్కో సర్పంచ్​కు 20 లక్షల నుంచి 50 లక్షల వరకు బిల్లులు పెండింగ్​లో ఉన్నాయన్నారు. కనీసం బ్లీచింగ్ పౌడర్​ బిల్లులు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ట్రాక్టర్ల కిస్తీలకు, డీజిల్​​కు డబ్బుల్లేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

  • సస్పెన్షన్లు, షోకాజ్​ల పేరుతో బెదిరిస్తున్నరన్న సర్పంచ్​లు 

  • గద్వాల కలెక్టరేట్ ముట్టడి

గద్వాల, వెలుగు: సస్పెండ్ చేస్తం.. షోకాజ్ నోటీసులు ఇస్తం.. అని భయపెట్టి పనులు చేయించిన అధికారులు బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారని జోగులాంబ గద్వాల జిల్లా సర్పంచులు బుధవారం కలెక్టరేట్ ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసి నెలలు గడుస్తున్న బిల్లులు ఇవ్వడం లేదన్నారు. ‘‘ఒక్కొక్క సర్పంచ్ కు రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు బిల్లులు పెండింగ్ ఉన్నాయి. మాకు మిగిలింది ఇంకా ఒక్క ఏడాదే, గ్రామాల్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నయి.

కానీ ఇప్పటి వరకు చేసిన వాటికే బిల్లులు ఇయ్యకపోతే ఎట్ల’’ అని ప్రశ్నించారు.‘‘క్రీడాప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు ఇలా చాలా పనులను మా మెడపై కత్తి పెట్టి అధికారులు చేయించిన్రు. బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నం. కనీసం బ్లీచింగ్ పౌడర్ బిల్లులు కూడా ఇస్తలేరు. నెలనెలా గ్రామ పంచాయతి ట్రాక్టర్ ఈఎంఐ, డీజిల్ కు కూడా పైసలు సర్దుబాటు చేయలేని పరిస్థితి నెలకొంది” అని కొందరు సర్పంచ్​లు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బిల్లులు చెల్లించి ట్రాక్టర్ల ఈఎంఐ, డీజిల్ కు ప్రత్యేక ఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తర్వాత కలెక్టర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.