పూజిత ధైర్యానికి మెచ్చి పుస్తకాలు అందజేసిన సరూర్ నగర్ కార్పొరేటర్

పూజిత ధైర్యానికి మెచ్చి పుస్తకాలు అందజేసిన సరూర్ నగర్  కార్పొరేటర్

మధ్యాహ్న భోజనంలో పురుగులొస్తున్నాయని పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లయింట్ చేసిన నాలుగో తరగతి చదువుతున్న పూజితను సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అభినందించారు. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సొంత నియోజకవర్గంలో విద్యనభ్యసిస్తున్న పూజిత ధైర్యానికి మెచ్చి, ఆమెకు పుస్తకాలు అందజేశారు. ఉద్యమకారులు పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో విద్యార్థులు రోడ్లపైకి వచ్చి  వసతులు, మధ్యాహ్న భోజనాలు సరిగా లేవని పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆకుల శ్రీవాణి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి అభివృద్ధి అనే నెపంతో మంత్రి పదవి తీసుకున్నారని ఆరోపించారు. 

ఈ ఘటనపై అధికారులు ఇంకా స్పందించకపోవడం చాలా బాధాకరమని ఆకుల శ్రీవాణి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఇంకెన్ని ఇబ్బందులకు గురవుతున్నారోనని విమర్శించారు. మీర్ పేట్ స్కూల్లో ఉదయం పూట స్కూలు, మధ్యాహ్నం  జూనియర్ కాలేజీ తరగతులు నిర్వహిస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు, భవంతులు కట్టుకోవడానికి బడ్జెట్ ఉంటుంది గానీ ప్రభుత్వ పాఠశాలలు కాలేజీలో నిర్మించడానికి మాత్రం నిధులు లేవని  ఆరోపించారు.