బిత్తిరి సత్తి తీన్మార్ జర్నీ

బిత్తిరి సత్తి తీన్మార్ జర్నీ

పదిహేనేండ్లు సిన్మాలల్ల ఎవరన్న ఆఫర్‌‌ ఇయ్యరా అని తిరిగిన. పదేండ్లు డబ్బింగ్ ఆర్టిస్ట్‌‌గా పనిచేసిన. ఈ పదేండ్లల్లనే వందల సినిమాలకు డబ్బింగ్‌‌ చెప్పిన. పది సిన్మాలల్ల ఎనకాల నిలబడుతరు కదా ఆర్టిస్టులు.. అదే బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్‌‌లు. అట్ల చేసిన. ఇట్ల అవి ఇవీ ఎన్నో చేసినంక ఒకరోజు వీ6 న్యూస్ చానల్ ఒయాసిస్‌‌లా కన్పించింది.

నేను సిన్మాల ప్రయత్నించినంత కాలం ఇబ్బందిపడ్డ. బాధపడ్డ. తెలంగాణ యాస గుర్తుకొచ్చేది. ‘అరె, మన యాసకు పట్టం కట్టేటోళ్లే లేరా ఈడ’ అన్పిచ్చేది. అయితే విలన్లకు వాడుతరు. లేదంటే కమెడియన్లను ఎక్కిరిస్తానికి వాడుతరు. అంతే తప్ప అచ్చమైన తెలంగాణ వినపడదు. ఇంకొందరైతే భాష గురించి తెల్వకుండనే ఏది పడితే అది తెలంగాణ అన్నట్టు మాట్లాడతరు. అప్పుడు వాళ్లను తిట్టాలనిపించేది. అట్లని తిట్టినమనుకో.. ఊరుకుంటరా? తన్ని తరిమేస్తరు. ఇవేం పట్టించుకోనట్టే బతకాలి. ఆత్మవంచన చేసుకొనే అన్నేళ్లు బతికిన.

అట్ల బతికినప్పుడల్లా నాకు వీ6 గుర్తొచ్చేది. అరె, ఇందుల ఎంత మంచి తెలంగాణ వినిపిస్తున్నరు అనుకునేటోడ్ని. వీ6 చానల్‌‌ పెట్టిన ఏడాదే నా ప్రొఫైల్‌‌ ఇచ్చి పోయిన. కానీ నా ఫోన్‌‌ నంబర్‌‌ లేకపోవడంతో నాకు రావాల్సిన ఆఫర్‌‌ నాలుగేండ్లు ఆలస్యమైంది. అప్పటికే ఏదో చేసుకోవాలి కాబట్టి ఒక చిన్న చానల్‌‌ల చేస్తుండె. వ్యవసాయం చేసుకుంటనే పార్ట్‌‌ టైమ్‌‌ జాబ్‌‌ కింద యాంకరింగ్‌‌ కూడా చేసిన.

అప్పుడే వీ6 సీఈఓ అంకం రవి సార్‌‌ నన్ను పిలిపించిన్రు. రావడానికి మస్తు భయపడ్డ. అప్పటికే వీ6ల తీన్మార్‌‌ ఒక బ్రాండ్‌‌. ట్రెండింగ్‌‌ల ఉంది అది. అలాంటి ప్రోగ్రామ్‌‌ల వాళ్లతోటి పోటీ పడి నేను నిలబడతనా అని భయం ఉండె. జాబ్‌‌ మారి మల్లా కొత్త రిస్కా అని కూడా భయపడ్డ. సరే, పిలిచిన్రు కదా అని వెళ్లి రవి గారిని కలిసిన. ‘తీన్మార్‌‌ల నువ్వేం చెయ్యగలవు?’ అని అడిగిన్రు. తెలంగాణ యాసల మూడు క్యారెక్టర్లు చెప్పిన. అందుల బిత్తిరి సత్తి ఒకటి.

‘సరే, మల్ల చెప్తా, తర్వాత కలుద్దాం’ అన్నరు. వాళ్లకు నచ్చలేదేమో అని నేను ఎప్పట్లెక్కనే వ్యవసాయమే చేసుకుంటున్న. మూడు నెలలకి వీ6 నుంచి కాలొచ్చింది. నా క్యారెక్టర్‌‌ గురించి చర్చించిన్రు. ‘సరే, రేపట్నించి జాయిన్‌‌ అవ్వు’ అన్నరు. ఐదు వేల జీతం కోసం నెల రోజులు జాయిన్‌‌ కాకుండా ఆగిన. నా టాలెంట్‌‌ ఏంటో ప్రూవ్‌‌ చేసుకుంటే వాళ్లే ఇస్తరని జాయిన్‌‌ అయిన. నెల తిరగకుండనే ఐదు కాదు, నేను ఊహించనంత జీతం పెంచిన్రు. ఏ సిన్మాలో అయినా ఒక క్యారెక్టర్‌‌ ఆ ఒక్క సిన్మా వరకే. కానీ బిత్తిరి సత్తి మాత్రం రోజుకో సినిమా చూపిచ్చుకుంట నాలుగేళ్లు దాటింది. ఈ జర్నీ ఇట్ల నడిచిందంటే, ముమ్మాటికీ మా చైర్మన్‌‌ వివేక్‌‌ గారు,  డైరెక్టర్‌‌ వైష్ణవి మేడమ్‌‌, సీఈఓ అంకం రవి గారే కారణం.  వీరందరికీ ధన్యవాదాలు చెప్పుకోవాలి. – బిత్తిరి సత్తి