కిడ్నీలు పాడై..చావు బతుకుల మధ్య..పేద యువతి

కిడ్నీలు పాడై..చావు బతుకుల మధ్య..పేద యువతి

పెద్దపల్లి, వెలుగు: రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఓ నిరుపేద యువతి.. చావు బతుకుల నడుమ కొట్టుమిట్టాడుతోంది. ఆపరేషన్ చేయించుకునే స్థోమత లేక.. మెడిసిన్​పైనే జీవనం సాగిస్తోంది. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా సమీపంలోని రాఘవాపూర్​లో స్వప్న, ఆమె కూతురు సాత్విక(23) నివాసం ఉంటున్నారు. స్వప్న భర్త 17 ఏండ్ల కింద చనిపోవడంతో పుట్టింటికి వచ్చి జీవిస్తున్నారు. స్వప్న కూలి పనులు చేసుకుంటూ కూతురిని పోషిస్తోంది. ఈక్రమంలో సాత్వికకు రెండు కిడ్నీలు చెడిపోవడంతో మంచానికే పరిమితం అయింది. ఏండ్లుగా ఆసుపత్రుల చుట్టూ తిరగగా... కిడ్నీలు దొరికితేనే ఆపరేషన్ చేయగలమని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో మందుల పైనే ప్రస్తుతం బతుకుతోంది. కిడ్నీ మార్పిడికి రూ.15లక్షల వరకు ఖర్చు అవుతాయని తెలుసుకుని, దాతల కోసం ఎదురుచూస్తున్నారు. సాత్విక తాత రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి, తన మనువరాలి గోస చెప్పినా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. సాయం చేయదల్చుకునేవారు 96408 39692 నంబరుకు ఫోన్ చేయాలని కోరుతున్నారు. 

ఇంటర్ స్టూడెంట్ కు మోకాళ్ల వాపు
 వైద్యం కోసం దాతలు
 సహకరించాలని వేడుకోలు

కోనరావుపేట, వెలుగు: చిన్నపాటి హోటల్ నడిపిస్తూ.. ముగ్గురు కూతుర్లను చదివిస్తున్న ఆ తల్లిదండ్రులకు పెద్ద కష్టం వచ్చి పడింది. పెద్ద కూతురికి ఉన్నటుండి మోకాళ్ల వాపు రావడంతో నడవలేని స్థితికి చేరింది. దీంతో వైద్యం కోసం దాతల సాయం కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే... రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్తనపేట గ్రామానికి చెందిన కుక్కట్ల శ్రీనివాస్, పద్మ దంపతుల పెద్ద కూతురు నాగరాణి ఇంటర్ చదువుతోంది. ఆరు నెలల కింద మోకాళ్ల వాపు రావడంతో మంచానికే పరిమితమైంది. వేములవాడలోని ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పలు ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకున్నా ఫలితం దక్కలేదు. మెరుగైన వైద్యం కోసం డబ్బులు ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పారు. దీంతో డబ్బులు లేక కూతురికి వైద్యం చేయించలేక ఆ కుటుంబం కన్నీటిపర్యంతం అవుతోంది. దాతలు సహకరించి, తన బిడ్డకు వైద్యం చేయించాలని కోరుతున్నారు. పూర్తి వివరాలకు 96522 73484 ఫోన్ చేయాలని వేడుకుంటున్నారు. కాగా, బుధవారం బీజేపీ జిల్లా కార్యదర్శి గోపాడి సురేందర్ రావు బాధిత కుటుంబాన్ని పరామర్శించి,సాయం చేస్తానని హామీ ఇచ్చారు.