
ఒడెన్స్: ఇండియా డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి.. డెన్మార్క్ ఓపెన్‌లో సెమీఫైనల్‌తోనే సరిపెట్టుకున్నారు. శనివారం జరిగిన మెన్స్ డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్ 21–23, 21–18, 16–21తో టాకురో హోకీ–యుగో కొబయాషి (జపాన్) చేతిలో ఓడారు. హాంకాంగ్, చైనా మాస్టర్స్ ఫైనల్లో నిరాశపర్చిన ఇండియన్ ద్వయం కనీసం డెన్మార్క్‌లోనైనా టైటిల్ సాధిస్తుందని ఆశించినా అది నెరవేరలేదు. 68 నిమిషాల పోరాటంలో రెండు జంటలు షార్ప్ ర్యాలీస్, క్రాస్ కోర్టు స్మాష్‌లతో చెలరేగాయి.
గత మూడు మ్యాచ్‌ల్లో జపాన్ ప్లేయర్లపైనే నెగ్గిన సాత్విక్–చిరాగ్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. అనుకున్నట్లుగానే 4–1తో తొలి గేమ్‌ను మొదలుపెట్టింది. కానీ అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్‌తో జపాన్‌కు పుంజుకునే చాన్స్ ఇచ్చింది. ముఖ్యంగా కొబయాషి కొట్టిన యాంగిల్ స్మాష్‌లు తీయలేకపోయారు. అయితే రెండో గేమ్‌లో వ్యూహాత్మకంగా ఆడిన సాత్విక్ ద్వయం నెట్ వద్ద మంచి ప్లేస్‌మెంట్స్ వేస్తూ 9–7, 16–14తో వెనుదిరిగి చూసుకోలేదు. డిసైడర్ ఆరంభంలో ఇరు జంటలు నాలుగు షాట్ల ర్యాలీస్‌తో ఆకట్టుకున్నాయి. దీంతో 5–5తో స్కోరు సమమైంది. కానీ సర్వీస్ ఎర్రర్స్, బేస్ లైన్ జడ్జిమెంట్‌తో ఇండియన్ జోడీ 7–10తో వెనకబడింది. అయినప్పటికీ పట్టువదలకుండా పోరాడి 11–10 లీడ్‌లోకి వచ్చినా జపాన్ ప్లేయర్ల దూకుడు ముందు నిలవలేకపోయారు. 13–11, 17–13, 19–16తో ఈజీగా గేమ్, మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు.