చక్రం తిప్పిన స‌త్య నాదెళ్ల.. మైక్రోసాఫ్ట్‌లోకి ఓపెన్ ఏఐ మాజీ CEO ఆల్ట‌మ‌న్‌

చక్రం తిప్పిన స‌త్య నాదెళ్ల.. మైక్రోసాఫ్ట్‌లోకి ఓపెన్ ఏఐ మాజీ CEO ఆల్ట‌మ‌న్‌

టెక్నాల‌జీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన చాట్‌జీపీటీ(ChatGPT) రూప‌క‌ర్త, ఓపెన్ ఏఐ (Open AI) మాజీ సీఈఓ శామ్ ఆల్ట‌మ‌న్ మైక్రోసాఫ్ట్‌లో చేరనున్నారు. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సోమవారం ప్రకటన చేశారు.

"ఆల్ట్‌మాన్ మరియు గ్రెగ్ బ్రాక్‌మన్‌లు సహోద్యోగులతో కలిసి మైక్రోసాఫ్ట్ ఆద్వర్యంలోని న్యూ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ టీంకు నాయకత్వం వహించనున్నారనే వార్తను పంచుకోవడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. వారి విజయానికి అవసరమైన వనరులను అందించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధమే.." అని సత్య నాదెళ్ల ట్వీట్ చేశారు.

కాగా, బోర్డుతో జరుగుతున్న అంతర్గత చర్చల్లో ఆల్ట్‌మెన్‌ నిజాయతీ పాటించడం లేదని, సమాచారం పంచుకోవడం లేదని ఓపెన్‌ఏఐ వెల్లడించిన విషయం తెలిసిందే. అలాగే, అతడు బోర్డు తీసుకునే నిర్ణయాలకు అడ్డుపడుతున్నారని, ఓపెన్‌ఏఐకి నాయకత్వం వహించే సామర్థ్యంపై తమకు ఏమాత్రం నమ్మకం లేదని తెలిపింది. అందుకే ఉద్వాసన పలికినట్లు ప్రకటించింది. కాగా, ఆల్ట్‌మన్‌ను పదవి నుంచి తొలగించిన గంట వ్యవధిలోనే సంస్థ కో-ఫౌండర్, ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు వీరిద్దరూ మైక్రోసాఫ్ట్ గూటికి చేరనున్నారు.

ఓపెన్ ఏఐ కొత్త బాస్‌గా ఎమ్మెట్ షియర్

ఇదిలావుంటే, ట్విచ్ సహ వ్యవస్థాపకుడు ఎమ్మెట్ షియర్‌ను ఓపెన్ ఏఐ కొత్త సీఈఓగా ప్రకటించింది. మాజీ సీఈఓ సామ్ ఆల్ట్ మన్ ను తిరిగి తీసుకురావాలని ఇన్వెస్టర్లు కోరినా కంపెనీ అందుకు నిరాకరించింది. అమెజాన్ గేమ్ స్ట్రీమింగ్ సైట్ ట్విచ్ సీఈఓగా పనిచేసిన ఎమ్మెట్ షియర్ కొద్ది నెలల క్రితమే ఆ కంపెనీకి రాజీనామా చేశారు.