
- అధికారులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశం
న్యూఢిల్లీ, వెలుగు: భారీ వర్షాలతో కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగు యాత్రికులను రక్షించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం కేంద్ర మంత్రి ఆఫీస్ అధికారులు రుద్రప్రయాగ్ కలెక్టర్ కు లేఖ రాశారు. తెలుగు యాత్రికులు సురక్షితంగా తిరిగి స్వస్థలానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇటీవలి వర్షాలకు అక్కడి నడక మార్గం దెబ్బతినడంతో ఏపీ, తెలంగాణకు చెందిన 8 మంది యాత్రికులు అక్కడే చిక్కుకుపోయారు. తిరిగి వచ్చేందుకు కూడా ఎలాంటి సౌకర్యాలు లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే తమను ఆదుకోవాలని అడపా సత్యనారాయణ అనే వ్యక్తి కేంద్ర మంత్రి బండి సంజయ్ కు మెసేజ్ చేశారు. తామంతా స్వర్గ రోహిణి కాటేజ్ లోని రూమ్ నెంబర్ 14లో చిక్కుకుపోయామని తెలిపారు. రెండ్రోజుల నుంచి సరైన భోజనం లేదని వివరించారు. ఆయన అభ్యర్థనపై స్పందించిన బండి సంజయ్ తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.