ప్రాణాలు కాపాడుతున్న ప్లాస్మా అంబులెన్స్‌‌లు

ప్రాణాలు కాపాడుతున్న ప్లాస్మా అంబులెన్స్‌‌లు

వాట్సాప్‌‌, ఫేస్‌‌బుక్‌‌, ఇన్‌‌స్టాగ్రామ్‌‌ ఏది చూసినా ఒకటే స్టేటస్‌‌. ‘నీడ్‌‌ ప్లాస్మా. అర్జంట్‌‌’. ఇచ్చేవాళ్లు తక్కువైపోయారు. ఇవ్వాలనుకున్నా ‘వెహికల్స్‌‌ అందుబాటులో లేవు’, ‘అంతదూరం ఎలా రావాలా?’ అనే ప్రశ్నలు. ‘ఇప్పుడే కరోనా నుంచి బయటపడ్డాం. బయటికి వెళ్లడం సేఫ్‌‌ కాదు బాబోయ్‌‌’ అనే భయాలు మరికొందరిలో. అందుకే, ప్లాస్మా ఇచ్చేవారి కోసం ప్రత్యేకంగా వెహికల్స్‌‌ ఏర్పాటు చేస్తున్నారు హైదరాబాద్‌‌ సిటీలోని కొందరు.ప్లాస్మా ఇచ్చేందుకు రెడీగా ఉన్నవారికి ఫ్రీ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ను ఏర్పాటు చేస్తున్నారు. 

మాదాపూర్‌‌‌‌లోని ఒక ప్రైవేటు హాస్పిటల్‌‌లో ఉన్న వ్యక్తికి అర్జెంట్‌‌గా ప్లాస్మా కావాలని మెసేజ్‌‌ వచ్చింది. డోనర్‌‌‌‌ ఎల్‌‌బీనగర్‌‌‌‌లో ఉన్నాడు. నైట్‌‌కర్ఫ్యూ వల్ల అతను వెళ్లలేని పరిస్థితి. కట్‌‌ చేస్తే ఆ డోనరే ప్లాస్మా ఇచ్చాడు. పేషెంట్‌‌కు ట్రీట్మెంట్‌‌ జరిగింది. ‘ప్లాస్మా అంబులెన్స్‌‌’లో సేఫ్‌‌గా వెళ్లి డొనేట్‌‌ చేసి..సేఫ్‌‌గా ఇంటికి చేరుకున్నాడు ఆ వ్యక్తి. ఇది మచ్చుకకు మాత్రమే. ఇలాంటి సంఘటనలు ఎన్నో.

పోయిన ఏడాది కరోనా కాలంలో వలసకూలీలు, పేదవారి  కోసం రైస్‌‌ ఏటీఎం స్టార్ట్​ చేసిన రాము దోసపాటి ఈసారి ప్లాస్మా అంబులెన్స్‌‌లు నడుపుతున్నాడు. ప్లాస్మా డొనేట్‌‌ చేయండి అని అవగాహన కల్పించడమే కాకుండా డోనర్స్‌‌ను వెహికల్స్‌‌లో సేఫ్‌‌గా తీసుకెళ్లి మళ్లీ ఇంట్లో వదిలిపెడుతుంది వాళ్ల టీం. ఆ సంఘటన కదిలించింది..

“ ఎల్‌‌బీనగర్‌‌‌‌లోని ఒక ప్రైవేటు హాస్పిటల్‌‌లో ఏడునెలల గర్భిణి కొవిడ్‌‌ వల్ల చనిపోయింది. ‘ప్లాస్మా దొరికుంటే ఆమె బతికేది’ అని ఆ హాస్పిటల్‌‌లో నర్సు చెప్పినప్పుడు చాలా బాధేసింది. అప్పటి నుంచి ప్లాస్మా డొనేషన్‌‌పైన అవగాహన ఇవ్వడం మొదలుపెట్టాను. గతంలో బ్లడ్‌‌ డొనేషన్‌‌ చేసేందుకు, ఇప్పుడు ప్లాస్మా ఇవ్వడానికి జనాలు చెప్తున్న రీజన్స్​ ఒక్కటే ‘అంతదూరం ఎలా రావాలి’?, ‘ఇప్పుడే కరోనా వచ్చి తగ్గిపోయింది. బయటికి వెళ్లడం సేఫ్‌‌ కాదు’ అనే రీజన్స్‌‌. అందుకే, ఫ్రీగా ట్రాన్స్‌‌పోర్టేషన్‌‌ సర్వీస్ మొదలుపెట్టాం. నా ఆలోచన చెప్పగానే నా ఫ్రెండ్స్‌‌ యూనస్‌‌, వెంకట్‌‌, అనిల్‌‌, సతీశ్‌‌ ముందుకు వచ్చి వాళ్ల కార్లు ఇచ్చారు. అలానే కూకట్‌‌పల్లికి చెందిన శిరీష అనే ఆవిడ మియాపూర్‌‌‌‌, కూకట్‌‌పల్లి, చందానగర్‌‌‌‌ ఏరియాల్లో ఉండే వాళ్లకోసం తన కారు ఇస్తానని చెప్పారు.

అలా అందరి దగ్గర నుంచి రెస్పాన్స్‌‌ రావడం హ్యాపీగా అనిపిస్తోంది. డోనర్‌‌‌‌ ఎక్కేముందు కారు‌‌ను పూర్తిగా శానిటైజ్‌‌ చేసి సీట్‌‌కు టవల్‌‌ వేస్తాం. ఎక్కగానే గ్లోవ్స్​, మాస్క్‌‌, శానిటైజర్‌‌ ఉన్న ఒక కిట్‌‌ ఇస్తాం. హాస్పిటల్‌‌కు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేటైంలో పెట్టుకునేందుకు మళ్లీ ఇంకో ఫ్రెష్‌‌ కిట్‌‌ ఇస్తాం. అలా సేఫ్‌‌గా వాళ్లను తీసుకెళ్లి, మళ్లీ తీసుకొచ్చి దింపుతున్నాం” అని చెప్పుకొచ్చారు రాము. “కరోనా వచ్చి తగ్గిపోయినవాళ్లు ‘Friends2Support’ యాప్‌‌లో రిజిస్టర్‌‌‌‌ చేసుకోవాలి. దాని ద్వారా ఎవరికైనా ప్లాస్మా అవసరం ఉంటే వాళ్లను కాంటాక్ట్‌‌ చేస్తాం. అంతేకాకుండా ప్రతి అపార్ట్‌‌మెంట్‌‌, గేటెడ్‌‌ కమ్యూనిటీ, ఆఫీసుల్లో ఒక డేటాబేస్‌‌ క్రియేట్‌‌ చేసుకుంటే ప్లాస్మా డోనర్లను వెతుక్కునే అవసరం ఉండదు. పేషెంట్‌‌కు ట్రీట్మెంట్‌‌ ఇవ్వొచ్చు”  అని చెబుతున్నాడు రాము. ప్లాస్మా డొనేట్‌‌ చేయాలనుకునేవారు 9000998877 నంబర్‌‌‌‌కు కాల్‌‌ చేయొచ్చు. 

సొంతకారునే అంబులెన్స్‌‌గా..
దాదాపు 20 ఏండ్లుగా బ్లడ్‌‌ డొనేషన్‌‌పై అవగాహన కల్పిస్తూ ఇప్పటివరకు 85సార్లు రక్తదానం చేశాడు హైదరాబాద్‌‌కు చెందిన సంపత్‌‌కుమార్‌‌‌‌. పోయిన ఏడాది ఆయనకు కొవిడ్‌‌ వచ్చి తగ్గిపోయిన తర్వాత దాదాపు 22 సార్లు ప్లాస్మా డొనేట్‌‌ చేశాడు. ఇతరులతో చేయిస్తున్నాడు. దాంట్లో భాగంగానే ప్లాస్మా డొనేట్‌‌ చేసేవాళ్ల కోసం తన సొంతకారునే ప్లాస్మా అంబులెన్స్‌‌గా మార్చాడు. డొనేట్‌‌ చేయాలనుకునేవారు లొకేషన్‌‌ షేర్‌‌‌‌ చేస్తే తనే స్వయంగా వెళ్లి పిక్‌‌ చేసుకుని హాస్పిటల్‌‌ వరకు తీసుకెళ్తాడు. మళ్లీ ఇంటి దగ్గర దింపుతాడు. “ ఒకసారి ప్లాస్మా ఇస్తే వెంటనే 2 గంటల్లో యాంటీ బాడీస్‌‌ వచ్చేస్తాయి. ఒకరి ప్లాస్మా ఇద్దరు పేషెంట్లకు ఉపయోగపడుతుంది. అందుకు, కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరు ప్లాస్మా ఇవ్వాలని ఎడ్యుకేట్‌‌ చేస్తున్నాను.  ఇప్పుడు లాక్‌‌డౌన్‌‌ కారణంగా డోనర్స్‌‌కు వెహికల్స్‌‌ దొరికే పరిస్థితి లేదు అందుకే, నా వెహికల్‌‌ను దీనికోసం ఉపయోగిస్తున్నాను. హైదరాబాద్‌‌ సి.పి. సజ్జనార్‌‌‌‌ ఏర్పాటు చేసిన కొవిడ్‌‌సెల్‌‌లో వలంటీర్‌‌‌‌గా పనిచేస్తూ ప్లాస్మా డొనేషన్‌‌పై అవగాహన కల్పిస్తున్నా. ప్లాస్మా డొనేట్‌‌ చేయాలను కునేవారు 9346334455 నెంబర్‌‌‌‌కు కాల్‌‌ చేయొచ్చు” అంటున్నాడు సంపత్‌‌ కుమార్‌‌‌‌. 

ప్లాస్మా ఎవరు ఇవ్వొచ్చు

  • కరోనా పాజిటివ్‌‌ వచ్చిన 28 రోజుల తర్వాత ఎప్పుడైనా ఇవ్వొచ్చు. 
  • ప్లాస్మా డొనేట్‌‌ చేసేముందు ఒకసారి యాంటీ బాడీస్‌‌ చెక్‌‌చేయించుకోవాలి. 
  • 18 – 50 ఏండ్ల వయసు పురుషులు ఎవరైనా ప్లాస్మా ఇవ్వొచ్చు. 
  • పెళ్లికాని ఆడవాళ్లు, పెళ్లై పిల్లలు లేనివారు మాత్రమే ప్లాస్మా డొనేట్‌‌ చేయాలి.

తేజ తిమ్మిశెట్టి