ఖరీదైన సొంతింటి కలలు: వడ్డీ రేట్లు పెంచుతున్న SBI, యూనియన్ బ్యాంక్..!!

ఖరీదైన సొంతింటి కలలు: వడ్డీ రేట్లు పెంచుతున్న SBI, యూనియన్ బ్యాంక్..!!

SBI Home Loans: ఉద్యోగాలు చేసే ప్రజలు ఎక్కువగా తమ సొంతింటి కలలను నెరవేర్చుకునేందుకు బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుంచి హోమ్ లోన్స్ తీసుకుంటారు. అయితే ఇటీవల రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ మానిటరీ సమీక్షా సమావేశంలో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు తీసుకురానప్పటికీ ప్రముఖ బ్యాంకులు మాత్రం తమ రుణ రేట్లను పెంచేస్తున్నాయి. 

తాజాగా ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన హోమ్ లోన్ వడ్డీ రేట్లను పెంచింది. కొత్త నిర్ణయం కింద ఆఫర్ చేస్తున్న లోన్స్ గతంలో కంటే 25 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీకి రుణాలను అందించనుంది. కొత్తగా గృహ రుణం కోసం చూస్తున్న వ్యక్తులపై ఇది భారాన్ని మోపనుందని తెలుస్తోంది. ప్రధానంగా తక్కువ సిబిల్ స్కోర్ ఉన్న కస్టమర్లకు రుణాలు ఖరీదుగా మారతాయి.

ఎస్బీఐతో పాటు మరో ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా హోమ్ లోన్స్ వడ్డీ రేట్లను పెంచేసింది. జూలైలో స్టేట్ బ్యాంక్ హోమ్ లోన్స్ 7.5 శాతం నుంచి 8.45 శాతం మధ్య వడ్డీకి ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే.. కానీ ప్రస్తుతం రేట్ల పెంపుతో 7.5 శాతం నుంచి 8.70 శాతం మధ్య రుణాల వడ్డీ రేటు ఉంటుందని బ్యాంక్ స్పష్టం చేసింది. పెంచిన రేట్లు ఇప్పటికే హోమ్ లోన్స్ తీసుకున్న కష్టమర్లపై ఎలాంటి ప్రభావాన్ని కలిగి ఉండదని తెలుస్తోంది. 

ఇక యూనియన్ బ్యాంక్ విషయానికి వస్తే గతంలో 7.35 శాతం వడ్డీ రేటుకు లోన్స్ అందించిన బ్యాంక్ ప్రస్తుతం దానిని 10 బేసిస్ పాయింట్లు పెంచి 7.45 శాతంగా చేసింది. త్వరలోనే ఈ పెరుగుదలకు సంబంధించి రెండు బ్యాంకులు ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.  ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే.. ప్రభుత్వ బ్యాంకులు హోమ్ లోన్స్ విభాగంలో మంచి పనితీరును కనబరిచాయి. SBI గృహ రుణ పోర్ట్‌ఫోలియో 14 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా హోమ్ లోన్ పోర్ట్‌ఫోలియో 18 శాతం పెరుగుదలను నమోదు చేశాయి.