ఎస్సీ,ఎస్టీ నిధుల్లో రూ.16 వేల కోట్ల కోత

ఎస్సీ,ఎస్టీ నిధుల్లో రూ.16 వేల కోట్ల కోత

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్ర బడ్జెట్‌‌‌‌లో ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి నిధులను భారీగా తగ్గించారు. గతేడాదితో పోలిస్తే ఏకంగా రూ.16,119.92 కోట్లు కోత పెట్టారు. ఎస్సీ అభివృద్ధికి 2018–-19 బడ్జెట్‌‌‌‌లో  రూ.12,709 కోట్లు కేటాయిస్తే ఈసారి రూ.2,753.88 కోట్లే ఇచ్చారు. రూ.9,955.12 కోట్లు తగ్గించారు. ఈసారి నిధుల్లో నిర్వహణ పద్దు కింద రూ.257.98 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.2,495 కోట్లు కేటాయించారు. గురుకుల పాఠశాలల సంస్థకు రూ.799.84 కోట్లు, పోస్టు మెట్రిక్‌‌‌‌ స్కాలర్‌‌‌‌షిప్‌‌‌‌లకు రూ.110 కోట్లు, ప్రీ మెట్రిక్‌‌‌‌ స్కాలర్‌‌‌‌షిప్‌‌‌‌కు రూ.111 కోట్లు ప్రతిపాదించారు.

గిరిజన సంక్షేమానికి రూ.6,164.8 కోట్ల కోత

గిరిజిన సంక్షేమానికీ బడ్జెట్‌‌‌‌లో భారీగానే కోత పెట్టారు. గతేడాదితో పోలిస్తే రూ. 6,164.8 కోట్లు తగ్గించేశారు. 2018–19 బడ్జెట్‌‌‌‌లో  రూ. 8,063.48 కోట్లు కేటాయించి నిర్వహణ పద్దు కింద రూ. 373.32 కోట్లు, ప్రగతి పద్దు కింద 7,690.32 కోట్లు ఇచ్చారు. ఈ సారి రూ. 1,898.68 కోట్లే కేటాయించి నిర్వహణ పద్దు కింద 366.18 కోట్లు, ప్రగతి పద్దు కింద 1,532.51 కోట్లు ప్రతిపాదించారు.

ప్రత్యేక అభివృద్ధి నిధుల్లోనూ..

ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన ప్రత్యేక అభివృద్ధి నిధుల్లోనూ కోత పెట్టారు. ఎస్సీల అభివృద్ధి నిధులను గత బడ్జెట్‌‌‌‌తో పోలిస్తే రూ. 4,052.59 కోట్లు తగ్గించారు. 2018–19లో  రూ. 16,452.79 కోట్లు ఇస్తే ఈసారి రూ.12,400 కోట్లే ఇచ్చారు. ఎస్టీ అభివృద్ధి నిధికి గతేడాది రూ.9,693 కోట్లు కేటాయిస్తే ఈసారి రూ. 7,184 కోట్లే ప్రతిపాదించారు. గత బడ్జెట్‌‌‌‌తో పోలిస్తే రూ.2,508 కోట్లు తగ్గించారు.