బక్రీద్‌కు కరోనా సడలింపులపై సుప్రీంలో పిటిషన్

బక్రీద్‌కు కరోనా సడలింపులపై సుప్రీంలో పిటిషన్

న్యూఢిల్లీ: బక్రీద్ (ఈద్ అల్ అదా) పండుగ కోసం కేరళ ప్రభుత్వం కరోనా నిబంధనలను సడలించడం వివాదాస్పదం అవుతోంది. బక్రీద్ కోసం మూడ్రోజుల పాటు కొవిడ్ నిబంధనలను సడలించడంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు.. దీనికి కౌంటర్ ఫైల్‌ చేయాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేరళ ప్రభుత్వం తరఫు న్యాయవాది మంగళవారం అఫిడవిట్ వేస్తామని చెప్పారు. దీంతో రేపు ఉదయం తొలి కేసుగా దీన్నే విచారిస్తామని సుప్రీం తెలిపింది. ఈనెల 21న బక్రీద్ పండుగ నేపథ్యంలో టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్ షాపులు, జ్యువెల్లరీ, ఫ్యాన్సీ స్టోర్లు, హోం అప్లయెన్స్, ఎలక్ట్రానిక్స్‌ దుకాణాలతోపాటు సరుకులు, కిరాణా షాపులను మూడ్రోజుల పాటు కరోనా ఆంక్షల నుంచి మినహాయించాలని పినరయ్ విజయన్ సర్కార్ నిర్ణయించింది. 

కేరళలో కరోనా కేసులు పెరుగుతుండటం, థర్డ్ వేవ్ భయం పొంచి ఉన్న తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదంటూ కేరళ ప్రభుత్వంపై పలు విమర్శలు వస్తున్నాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కూడా కరోనా రూల్స్‌ను సడలించడంపై సీరియస్ అయ్యింది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న తరుణంలో కరోనా రూల్స్‌ను ఎలా సడలిస్తారంటూ ఐఎంఏ కేరళ సర్కారును ప్రశ్నించింది. కేరళ ప్రభుత్వం తమ ఉత్తర్వులను వెనక్కి తీసుకోకపోతే సుప్రీం కోర్డుకు వెళ్తామని ఐఎంఏ హెచ్చరించింది. కేరళలో కరోనా కేసులు పెరుగుతున్న టైమ్‌లో కొవిడ్ రూల్స్‌ను సడలించాలన్న సర్కారు నిర్ణయం దురదృష్టకరమని మండిపడింది.