పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి : మందకృష్ణ

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి : మందకృష్ణ

ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఎమ్మార్పీఎస్ జాతీయాధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ కోసం కార్యాచరణ చేపడుతామన్నారు. ఓవైపు ఎస్సీ వర్గకరణకు బీజేపీ మద్దతు ఇస్తూనే.. మరోవైపు పరిష్కరించే దిశగా పని చేయడంలేదన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వర్గీకరణ బిల్లును పెట్టేవిధంగా అన్ని పక్షాలపై ఒత్తిడి తెస్తామని చెప్పారు.

తెలంగాణలో విద్యార్థుల సమావేశం, ఏపీలో ఉద్యోగుల సమావేశం, కర్ణాటకలో మాదిగ పోరాట సమితి సమావేశం నిర్వహిస్తామని మంద కృష్ణ తెలిపారు. కర్ణాటకలో జరిగే ప్రభుత్వ వ్యతిరేక పోరాటానికి అన్ని పక్షాల మద్దతును కోరుతామన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ఉద్యమం చేపడుతామని తెలిపారు. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడం సిగ్గుచేటన్నారు.

అదానీ, అంబానీలకు దేశసంపదను దోచిపెట్టడానికే  కేంద్రం పనిచేస్తోందని మంద కృష్ణ మండిపడ్డారు. ప్రభుత్వరంగాలను కాపాడుకున్నప్పుడే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలలో విద్య, వైద్య రంగం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని.. కానీ దేశంలో మాత్రం విద్యా, వైద్యరంగాన్ని ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు.