
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా మరో ముగ్గురు జడ్జిలను కేటాయిస్తూ, ఒకరిని మరో హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ మేరకు మంగళవారం దేశవ్యాప్తంగా 11 హైకోర్టులకు చెందిన 21 మంది జడ్జిల ట్రాన్స్ ఫర్లను సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం ప్రతిపాదించింది. కర్నాటక హైకోర్టు జడ్జీలు జస్టిస్ సుమలత, జస్టిస్ లలిత కన్నెగంటి, పాట్నా హైకోర్టు జడ్జి జస్టిస్ అభిషేక్‌రెడ్డిని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు చేసింది.
తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ సుజయ్ పాల్‌ను కలకత్తా హైకోర్టుకు ట్రాన్స్ ఫర్ చేయాలని సూచించింది. అలాగే మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం ప్రతిపాదించింది. కాగా, కర్నాటక హైకోర్టు జడ్జి జస్టిస్ వి. కామేశ్వరరావును ఢిల్లీ హైకోర్టుకు, గౌహతి హైకోర్టు జడ్జిలు జస్టిస్ జమీర్, జస్టిస్ మనాష్ రంజన్ పాఠక్, జస్టిస్ సుమన్ శ్యామ్‌ను వరుసగా కలకత్తా, ఒడిశా, బాంబే హైకోర్టులకు ట్రాన్స్ ఫర్ చేయాలని సూచించింది.
బాంబే హైకోర్టు జడ్జి జస్టిస్ నితిన్ వాసుదేవ్ సాంబ్రేను ఢిల్లీ హైకోర్టుకు, అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ అశ్వనీ కుమార్ మిశ్రాను పంజాబ్–హర్యానా హైకోర్టుకు, పంజాబ్–హర్యానా హైకోర్టు జడ్జి జస్టిస్ సంజీవ్ ప్రకాశ్ శర్మను రాజస్థాన్ హైకోర్టుకు, ఇక్కడి మరో జడ్జి జస్టిస్ అనిల్ క్షేత్రపాల్ ను ఢిల్లీ హైకోర్టుకు, అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ వివేక్ చౌదరిని ఢిల్లీ హైకోర్టుకు, కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్ దినేష్ కుమార్ సింగ్‌ను కర్నాటక హైకోర్టుకు బదిలీ చేయాలని పేర్కొంది.
అలాగే మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ ను మధ్యప్రదేశ్ హైకోర్టుకు, అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఓం ప్రకాశ్ శుక్లాను ఢిల్లీ హైకోర్టుకు, రాజస్థాన్ హైకోర్టు జడ్జి జస్టిస్ చంద్రశేఖర్‌ను బాంబే హైకోర్టుకు, పంజాబ్–-హర్యానా హైకోర్టు న్యాయమూర్తి సుధీర్ సింగ్‌ను పాట్నా హైకోర్టుకు, రాజస్థాన్ హైకోర్టుకు చెందిన జస్టిస్ అరుణ్ కుమార్‌ను ఢిల్లీ హైకోర్టుకు, అలహాబాద్ హైకోర్టు జడ్జి జయంత్ బెనర్జీని కర్నాటక హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సిఫారసు చేసింది.