నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ హాస్టల్లో ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల చారుతో భోజనం పెడుతున్నారని విద్యార్థినులు వాపోయారు. శుక్రవారం పది మంది కలెక్టర్ ఉదయ్ కుమార్‌ను కలిసి గోడు వెల్లబోసుకున్నారు. స్పందించిన కలెక్టర్ ఉదయ్ కుమార్ వెంటనే హాస్టల్ విజిట్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని అడిషనల్ కలెక్టర్ మోతీలాల్‌ను ఆదేశించారు. దీంతో ఆయన హాస్టల్‌కు వెళ్లి కిచెన్, వంటలను పరిశీలించారు. ఆయన సమక్షంలో మళ్లీ అన్నం వండగా.. అందులోనూ రాళ్లు వచ్చాయి. దీంతో వంట సిబ్బంది, వార్డెన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
భోజనం విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని, తీరు మారకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం స్టూడెంట్లతో మాట్లాడి వసతుల గురించి ఆరా తీయగా.. పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని చెప్పగా.. వార్డెన్‌ను మందలించారు. అలాగే టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉండడంతో సిబ్బందిపై మండిపడ్డారు. కార్యక్రమంలో ఏఎస్‌డబ్ల్యూ సుదర్శన్, పర్యవేక్షకులు రాంజీ, వార్డెన్ రాధ ఉన్నారు.
