మ‌ద్యం అమ్మ‌కాల‌కు సుప్రీం గ్రీన్ సిగ్న‌ల్.. మ‌ద్రాస్ హైకోర్టు ఆర్డ‌ర్ పై స్టే

మ‌ద్యం అమ్మ‌కాల‌కు సుప్రీం గ్రీన్ సిగ్న‌ల్.. మ‌ద్రాస్ హైకోర్టు ఆర్డ‌ర్ పై స్టే

త‌మిళ‌నాడులో మ‌ద్యం అమ్మ‌కాల‌కు అడ్డంకులు తొల‌గిస్తూ సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఆ రాష్ట్రంలో లిక్క‌ర్ షాపుల‌న్నీ మే 17న లాక్ డౌన్ ముగిసే వ‌ర‌కు క్లోజ్ చేయ‌యాల‌ని, కేవ‌లం ఆన్ లైన్ లోనే సేల్స్ చేసుకోవాల‌ని మ‌ద్రాస్ హైకోర్టు మే 8న ఇచ్చిన ఆర్డ‌ర్ పై సుప్రీం ధ‌ర్మాస‌నం స్టే విధించింది. లిక్క‌ర్ షాపుల‌ను తెరిచి సేల్స్ చేసుకోవ‌చ్చ‌ని, అయితే మ‌ద్యం కొనేందుకు వ‌చ్చే వాళ్లు సోష‌ల్ డిస్టెన్స్ పాటించేలా చూడాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. ప్ర‌తి ఒక్క‌రూ మాస్క్ ధ‌రించి.. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణకు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించింది.

త‌మిళ‌నాడులో ప్ర‌భుత్వ‌మే మ‌ద్యం షాపుల‌ను నిర్వ‌హిస్తుంది. త‌మిళ‌నాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేష‌న్ (ట‌స్మాక్) ఆధ్వ‌ర్యంలో లిక్క‌ర్ షాపులు న‌డుస్తాయి. లాక్ డౌన్ కార‌ణంగా దాదాపు నెల‌న్న‌ర రోజులుగా మూత‌ప‌డిన వైన్ షాపులను మే 4 నుంచి ఓపెన్ చేసేందుకు కేంద్రం ఆంక్ష‌ల స‌డ‌లింపు ప్ర‌క‌టించింది. అయితే త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం మే 7 నుంచి షాపులను తెరుస్తామ‌ని 4వ తేదీన జీవో జారీ చేసింది. 15 శాతం లిక్క‌ర్ రేట్ల‌ను కూడా పెంచింది.

అయితే రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేప‌థ్యంలో మ‌ద్యం దుకాణాల‌ను తెరిస్తే వైర‌స్ విజృంభ‌ణ ఇంకా ఎక్కువ‌య్యే ప్ర‌మాదం ఉందంటూ మ‌ద్రాస్ హైకోర్టులో ఓ వ్య‌క్తి ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లు చేశారు. దీంతో మే 6న విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్థానం… ఐదుగురికి మించి రాకుండా, సోష‌ల్ డిస్టెన్స్ పాటించేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో పాటు మ‌రికొన్ని కండిష‌న్స్ పెడుతూ లిక్క‌ర్ షాపులు తెరిచేందుకు ప్ర‌భుత్వానికి అనుమ‌తి ఇచ్చింది. అయితే కోర్టు ప‌ర్య‌వేక్ష‌ణ కొన‌సాగుతుంద‌ని, సోష‌ల్ డిస్టెన్స్ నిబంధ‌న‌ల‌ను పాటించ‌కుంటే నిర్ణ‌యంపై స‌మీక్ష చేప‌డుతామ‌ని స్ప‌ష్టం చేసింది. అయితే మే 7న‌ ఓపెన్ అయిన మ‌ద్యం దుకాణాల ద‌గ్గ‌ర జ‌నాలు గుంపులుగా చేర‌డంతో దీనిని పిటిష‌న‌ర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో మే 8న‌ మ‌రోసారి విచార‌ణ చేపట్టిన హైకోర్టు.. లాక్ డౌన్ ముగిసే వ‌ర‌కు లిక్క‌ర్ షాపుల‌ను మూసేయాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. ఆన్ లైన్ సేల్స్ మాత్ర‌మే చేయొచ్చ‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో హైకోర్టు ఆదేశాల‌ను స‌వాలు చేస్తూ త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం సుప్రీం కోర్టులో పిటిష‌న్ వేసింది. దీనిపై శుక్ర‌వారం విచార‌ణ చేప‌ట్టిన సుప్రీం ధ‌ర్మాస‌నం లిక్క‌ర్ షాపులు తెరిచేందుకు అనుమ‌తి ఇచ్చింది. మ‌ద్రాస్ హైకోర్టు ఆదేశాల‌ను నిలుపుద‌ల చేస్తూ స్టే ఇచ్చింది.