సుప్రీం ఆర్డర్ : ఇంకొక్క చెట్టు కూడా కొట్టద్దు

సుప్రీం ఆర్డర్ : ఇంకొక్క చెట్టు కూడా కొట్టద్దు

న్యూఢిల్లీ: ముంబైలోని ఆరే కాలనీలో ఇంకొక్క చెట్టును కూడా కొట్టొద్దని సోమవారం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్కడ యథాతథ స్థితి(స్టేటస్​ కో)ను కొనసాగించాలని మహారాష్ట్ర సర్కారును ఆదేశించింది. మెట్రో కార్​ పార్కింగ్​ షెడ్​ కోసం అధికారులు ఆరే కాలనీలోని చెట్లను నేలకూల్చేందుకు సిద్ధపడగా పర్యావరణ ఉద్యమకారులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ విషయంలో కలగజేసుకోలేమంటూ శుక్రవారం హైకోర్టు వాటిని తిరస్కరించింది. దీంతో అదే రాత్రి మెట్రో అధికారులు ఆరే కాలనీలోని 2141 చెట్లను తొలగించారు. అధికారుల తీరుపై అంతటా విమర్శలు వ్యక్తమయ్యాయి.

చెట్ల నరికివేతతో ఆరే కాలనీలో హై టెన్షన్ నెలకొంది. ఆందోళన చేస్తున్న స్థానికులు, ఉద్యమకారులు 29 మందిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక కోర్టు బెయిల్​ మంజూరు చేయడంతో వారంతా సోమవారం ఉదయం బయటికి వచ్చారు. ఈ గొడవపై రిషవ్​ రంజన్​ అనే లా స్టూడెంట్​సుప్రీంకోర్టు చీఫ్​ జస్టిస్ రంజన్​ గొగొయ్​కు లెటర్​ రాశారు. దీనిని సుమోటోగా స్వీకరించి, చెట్ల నరికివేతపై విచారించనున్నట్లు చీఫ్​ జస్టిస్  పేర్కొన్నారు. మంగళవారం నుంచి కోర్టుకు దసరా సెలవులు కావడంతో సెలవులు ముగిసాక విచారిస్తామని చెప్పారు. అప్పటి వరకు ఆరే కాలనీలో చెట్ల నరికివేతను ఆపేయాలని, యథాతథ స్థితిని కొనసాగించాలని మెట్రో అధికారులను ఆదేశించారు.