పీఎం కేర్స్ ఫండ్ పై రేపు సుప్రీంలో విచారణ

పీఎం కేర్స్ ఫండ్ పై రేపు సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్స్ ఫండ్ ను ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్ ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. కరోనా వల్ల తలెత్తే పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రజల నుంచి విరాళాలు సేకరించేందుకు గత నెల 28న కేంద్రం ఈ ఫండ్ ను ఏర్పాటు చేసిందని లాయర్ ఎంల్ శర్మ పిల్ లో పేర్కొన్నారు. ప్రధాని ఎక్స్ అఫీషియో చైర్మన్ గా, డిఫెన్స్, హోమ్, ఫైనాన్స్ మినిస్టర్లు ఎక్స్ అఫీషియో ట్రస్టీలుగా ఉంటారని, ఈ ట్రస్టుకు రాజ్యాంగబద్ధత లేదన్నారు. పార్లమెంటు లేదా రాష్ట్రపతి ఆమోదించలేదని, ఆర్డినెన్స్, నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదని, దీనిపై కోర్టు పర్యవేక్షణలో సిట్ తో విచారణ జరిపించాలని కోరారు. ప్రజల నుంచి సేకరించిన విరాళాలను కన్సాలిడేటెడ్ ఫండ్ కు జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ ఎం.ఎం. శాంతనగౌడర్ లతో కూడిన బెంచ్ ఈ పిల్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించనుంది.