కొత్త ప్రొడక్ట్స్‌‌కు ఇండియానే బెటర్: సుందర్ పిచాయ్

కొత్త ప్రొడక్ట్స్‌‌కు ఇండియానే బెటర్: సుందర్ పిచాయ్

వాషింగ్టన్ : కొత్త ప్రొడక్ట్స్‌‌ను అభివృద్ధి చేయడానికి ఇండియానే బెటర్‌‌ అని, ఇక్కడ ఉత్పత్తి చేసిన ప్రొడక్ట్‌‌లను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తున్నామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. గత మూడు లేదా నాలుగేళ్ల నుంచి ఈ ట్రెండ్ నమోదవుతుందని సంతోషం వ్యక్తం చేశారు. అమెరికా ఇండియా బిజినెస్ కౌన్సిల్(యూఎస్‌‌ఐబీసీ) ఇండియా ఐడియాస్ సమిట్‌‌లో ఆయన ప్రసంగించారు.  డిజిటల్‌‌ ప్రపంచంలో అమెరికా, ఇండియాలు ముందడుగు వేస్తున్నాయని, ప్రజలకు ఉపయోగపడేలా ఈ రెండు దేశాలు విధానాలు తేవాలని సుందర్‌‌ పిచాయ్‌‌ అభిప్రాయపడ్డారు.

డిజిటల్ ట్రేడ్‌‌కు సమాచారం ఫ్రీగా ఫ్లో అవడం అవసరమని, ఇలా ఫ్రీ ఫ్లో ఉంటే ప్రయోజనాలను తాము చూడగలమని అన్నారు. గత నెలలోనే పిచాయ్ న్యూయార్క్ టైమ్స్‌‌కు రాసిన ఓప్-ఎడ్‌‌లో ప్రైవసీ అనేది లగ్జరీగా ఉండకూడదని నొక్కి చెప్పారు. ఇండియాలో చాలా కాలం క్రితం నుంచే గూగుల్ ఉందని పిచాయ్ తెలిపారు. టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు ఇండియన్ ప్రభుత్వం చాలా మంచిగా పనిచేస్తోందని, గవర్నెన్స్, సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచాలని ప్రభుత్వానికి సూచించారు.  టెక్నాలజీపరంగా ఇండియా ముందుకెళ్లడంలో  తాము భాగమైనందుకు చాలా గర్వంగా భావిస్తున్నట్టు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సదస్సు అనంతరం సుందర్ పిచాయ్, గ్లోబల్ లీడర్‌‌‌‌షిప్ అవార్డును అందుకున్నారు.

పిచాయ్‌‌తో పాటు నాస్‌‌డాక్ ప్రెసిడెంట్, సీఈవో అడెనా ఫ్రైడ్‌‌మ్యాన్‌‌కు కూడా ఈ అవార్డు దక్కింది. మరింత మందికి స్మార్ట్‌‌ఫోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు వీటి ధరను ప్రతేడాది తగ్గించుకుంటూ వెళ్తున్నామని చెప్పారు. 2004లో మేడిన్ ఇండియన్ డివైజ్‌‌లను రూపొందించేందుకు కేవలం రెండు  ఇండియన్ మానుఫాక్చర్స్ మాత్రమే ఉండేవని, ఈ సంఖ్య ఇప్పటికి 200కి పైగా పెరిగిందని పేర్కొన్నారు.

పేమెంట్​ ప్రొడక్ట్స్​కు కూడా..

ఇండియా డిజిటల్ పేమెంట్స్‌‌లోకి మారుతోన్న క్రమంలో.. భవిష్యత్‌‌లో పేమెంట్లను ప్రోత్సహించేందుకు తమ పేమెంట్స్ ప్రొడక్ట్‌‌కు ఇండియా బెస్ట్ మార్కెటని భావిస్తున్నామని పిచాయ్ అన్నారు. డిజిటల్‌‌ చెల్లింపుల్లో దూసుకెళ్తున్న ఇండియా మార్కెట్లో  కష్టపడి తమ గుగుల్‌‌ పే పేమెంట్స్‌‌ ప్రొడక్ట్‌‌ను తీసుకొచ్చామని, దీన్ని ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌‌కు తీసుకెళ్లనున్నామని చెప్పారు.  ఇండియాలోనే కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేస్తూ.. అవి ప్రపంచమంతా పనిచేసేలా చూస్తున్నామని పిచాయ్ వివరించారు. ఇది చాలా ఉత్తేజ పూర్వక సమయమని అన్నారు. సుందర్ పిచాయ్ భారతీయ సంతతికి చెందిన వ్యక్తి.