మిషన్ భగీరథ పైపులు అమ్ముకున్నరు

మిషన్ భగీరథ పైపులు అమ్ముకున్నరు

దొంగిలించిన వారే పోలీస్ స్టేషన్లో కేసు

బయటకి పొక్కడంతో కాపాడేందుకు రంగంలోకి దిగిన నేతలు

వాచ్ మెన్ ను బలి చేసేందుకు యత్నాలు!

మిషన్ భగీరథ పథకంలో భాగంగా గ్రామాలకు అందించిన పైపులను కూడా వదలకుండా అవినీతి చేశారు. మండల పరిధిలోని లట్టుపల్లి గ్రామంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పథకం ప్రకారం పైపులు అమ్మి, రూ.లక్షల సొమ్ము కాజేశారని ఆరోపణలు వస్తున్నాయి. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ ఇద్దరు కలిసి, ఆ శాఖకు సంబంధించిన ఉద్యోగితో కుమ్మక్కై గ్రామానికి వచ్చిన దాదాపు 280 పైగా మిషన్ భగీరథ పైపులను అదే గ్రామంలోని రైతులకు అమ్మేశారు. ఆ గ్రామం నుంచి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కాలువ వెళ్తుండడంతో కాలువ నుంచి తమ పొలాలకు నీటిని మళ్లించుకునేందుకు మిషన్ భగీరథ పైపులు నాణ్యతగా ఉండడంతో పాటు ఎక్కువ కాలం మన్నిక వస్తాయన్న ఉద్దేశంతో రైతులు కూడా వాటిని ఎగబడి కొనుగోలు చేశారు. ఒక్కో పైపు రూ.500 చొప్పున కొన్నామని ఆ గ్రామ రైతులే చెబుతున్నారు. గత డిసెంబర్​లోనే తమకేమీ తెలియదన్నట్టు ఆ ముగ్గురు కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ లో మిషన్ భగీరథ పైపులను ఎవరో ఎత్తకెళ్లారంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరించడంతో ఆ వ్యవహారం అక్కడితో సద్దుమణిగింది. అయితే మూడు రోజుల క్రితం గ్రామానికి చెందిన కొంతమంది నాయకులు మిషన్ భగీరథ పైపులను మాజీ సర్పంచ్ కుమారుడు, మాజీ ఎంపీటీసీ భర్త తో పాటు మిషన్ భగీరథలో పని చేస్తున్న ఓ ఉద్యోగి ముగ్గురు కలిసి రైతులకు విక్రయించారని ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ గ్రామానికి వచ్చి విచారణ చేశారు. అక్కడి రైతులు కూడా వీరు ముగ్గురు విక్రయించారని చెప్పడంతో అసలు విషయం బయటపడింది.

రంగంలోకి దిగిన నేత
ఈ కేసు నుంచి ఎలాగైనా బయపడేందుకు వారు అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ స్థాయిలో కీలక నేత వద్ద మొరపెట్టుకున్నారు. దీంతో ఆయన రంగంలోకి దిగారు. తమ పార్టీకి చెందిన నేతలే దొంగతనం చేశారని బయటకు తెలిస్తే పార్టీ పరువు పోతుందన్న ఉద్దేశంతో సంబంధిత పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి ఎలాగైనా ఈ కేసు త్వరగా ముగించాలని పురమాయించట్లు గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో పోలీసులు కూడా ఎవరిపై కేసు నమోదు చేయాలనే అయోమయంలో పడ్డారు. ఓ వైపు గ్రామంలో బహిరంగ విచారణలో ఇద్దరు ప్రజా ప్రతినిధుల వారసులు, ప్రభుత్వ ఉద్యోగి కలిసి పైపులను అమ్ముకున్నారని రైతులు సాక్ష్యం చెప్పడం, వీటిని ఆ గ్రామంలోని పలువురు యువకులు వీడియోలు తీయడంతో ప్రస్తుతం ఈ కేసు ఎలా మలుపు తీరుతుందోనని  గ్రామంలో చర్చానీయంగా మారింది .

వాచ్ మెన్ బలి చేసేందుకు యత్నం..
ముగ్గురూ కలిసి మిషన్ భగీరథ పైపులు నిల్వ చేసిన చోట వాటికి రక్షణగా ఉంచిన వాచ్​మెన్ ను ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తునట్లు మండలంలో చర్చానీయంగా మారింది. ఇందుకు అతనికి పెద్ద మొత్తంలో డబ్బుతో పాటు, కేసు నుంచి రెండు, మూడు రోజుల్లో బయటపడే విధంగా చూస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదీ కాకుండా పైపులు కొనుగోలు చేసిన రైతులకు కూడా డబ్బులు ఇస్తామని చెబుతున్నారు. దీంతో పలువురు గ్రామస్తులు అవినీతి కి పాల్పడిన వారికి శిక్ష పడాలంటూ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ సొమ్మును కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు కలిసి ఇలా దోచుకోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

పోలీసు విచారణ జరుగుతోంది
లట్టు పల్లి లో మిషన్ భగీరథ పైపులదొంగతనం విషయం తెలిసిన వెంటనేపోలీసులకు ఫిర్యాద్ చేశాం . పోలీసులతోగ్రామంలో విచారణ జరిపినప్పుడు రైతుపొలాల్లో పైపులు దొరికాయి. ఇందులోఎవరు ఉన్నారనేది పోలీసుల విచారణలోతెలుస్తుంది. ఎవరైనా విడిచిపెట్టెదిలేదు.- శ్రీధర్ రావు, ఈఈ

తవ్వితే ఇంకా బయటికి వస్తాయి
మాజీ ఎంపీటీసీ భర్త చందర్ గౌడ్పలువురి రైతులకు ఒక్కో పైపు రూ.500చొప్పున అమ్మారు. రాజకీయనాయకులతో పాటు, ఆ శాఖ ఉద్యోగికూడా ఈ భాగోతంలో ఉన్నాడు. కేసునుగ్రామంలో బహిరంగంగా విచారిస్తే ఇంకారూ.లక్షలు విలువ చేసే పైపులు బయటపడతాయి.- వెంకట్ రెడ్డి, గ్రామస్తుడు