డీప్ ఫేక్ టెక్నాలజీతో.. 207 కోట్లు కొట్టేసిన్రు

డీప్ ఫేక్ టెక్నాలజీతో.. 207 కోట్లు కొట్టేసిన్రు

న్యూఢిల్లీ: డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి సైబర్ నేరగాళ్లు ఓ మల్టీనేషనల్ కంపెనీ నుంచి రూ.207 కోట్లు కొట్టేశారు. ఆ కంపెనీకి చెందిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ముఖాన్నే డీప్ ఫేక్ చేశారు. ఆపై వీడియో కాల్ చేసి ఓ సీక్రెట్ ఆపరేషన్ కోసం డబ్బు ట్రాన్స్ ఫర్ చేయాలంటూ అకౌంట్స్ డిపార్ట్ మెంట్ ఉద్యోగులను ఆదేశించారు. దీంతో సిబ్బంది ఆయన చెప్పిన అకౌంట్లకు క్యాష్ ట్రాన్స్​ఫర్ చేశారు. పక్కా ప్లాన్​ చేసిన నేరగాళ్లు, వారం రోజుల్లో ఈ దోపిడీ ఎపిసోడ్​ను ముగించారు. ఆపై తేరుకున్న కంపెనీ సిబ్బంది, తాము మోసపోయామంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అతిపెద్ద డీప్ ఫేక్ మోసం కంపెనీకి చెందిన హాంకాంగ్​ బ్రాంచ్​లో ఇటీవలే జరిగిందని ఇంటర్​నేషనల్ మీడియా తెలిపింది.

వీడియో కాల్ చేసి నమ్మించారు.. 

స్కామర్లు పక్కాగా స్కెచ్ వేశారు. కంపెనీకి చెందిన మెయిన్ బ్రాంచ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్​తో పాటు, కీలక సిబ్బంది ముఖాలను డీప్ ఫేక్ చేశారు. వాళ్ల మాట తీరును మక్కీకి మక్కీ కాపీ కొట్టారు. ఆపై క్యాష్ వ్యవహారాలు చూసుకునే హాంకాంగ్ బ్రాంచ్​లోని అకౌంటెంట్​కు వీడియో కాన్ఫరెన్స్ కలిపారు. అంతకుముందే, సీక్రెట్ ఆపరేషన్​ కోసం డబ్బు ట్రాన్స్ ఫర్ చేయాల్సి ఉంటుందని మెయిల్ ద్వారా అతడిని అలర్ట్ చేశారు.

గ్రూప్ వీడియో కాల్​లో మాట్లాడుతున్న బాస్​తో సహా మిగతా టీమ్​ అంతా తమ కంపెనీవాళ్లే కావడంతో అకౌంటెంట్​కు ఏమాత్రం అనుమానం రాలేదు. వీడియోకాల్​లో వాళ్లు చెప్పినట్లే ఐదు అకౌంట్లకు రూ.207 కోట్లు ట్రాన్స్​ఫర్ చేశాడు. కంపెనీ హెడ్డాఫీస్​కు వెళ్లగా తనను మోసం చేశారని తేరుకుని పోలీసులను ఆశ్రయించారు. అయితే, ఆ కంపెనీ పేరేంటో కూడా వెల్లడించని పోలీసులు.. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ పట్టుకోలేకపోయారని మీడియా రిపోర్టు పేర్కొంది.