స్కీజోఫ్రీనియా..  భ్రమల్లోకి నెట్టేస్తది

స్కీజోఫ్రీనియా..  భ్రమల్లోకి నెట్టేస్తది

ప్రస్తుతం ప్రపంచంలో శర వేగంగా మార్పులు జరిగిపోతున్నాయి. ఈ పోటీ ప్రపంచంలో మనుగడ సాగించడానికి మనిషి లైఫ్‌‌‌‌ స్టైల్‌‌ కూడా పూర్తిగా మారిపోయింది. కానీ ఈ స్పీడ్‌‌ను అందుకోవడంలో కొంత మంది ఇబ్బందిపడుతుంటారు. కాంపిటీషన్, స్ట్రెస్‌‌ను తట్టుకోలేకపోతారు. తీవ్రమైన యాంగ్జైటీకి గురై శారీరక, మానసిక రుగ్మతల బారినపడతారు. దీంతో తమ బతుకింతే అన్న ఒక రకమైన భావనలోకి మైండ్ వెళ్లిపోతుంది. దీంతో తమదైన ఒక ప్రపంచాన్ని ఊహించుకుని, వింత ప్రవర్తనలతో బతికేస్తుంటారు. ఈ స్థితిని స్కిజోఫ్రీనియా అని పిలుస్తారు. కొంత మంది ఆ మానసిక పరిస్థితి నుంచి బయటకు రావడానికి ఏం చేయాలో అర్థం కాక, తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. ఆ స్ట్రెస్‌‌ను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం కూడా ఉంది. అందుకే దీనిపై అవగాహన పెంచేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా మే 24న స్కిజోఫ్రీనియా డేగా నిర్వహిస్తున్నారు.

ప్రతి దేశ జనాభాలోనూ 1% బాధితులు

ప్రపంచంలో కొన్నేండ్లుగా మానసిక సమస్యలు తీవ్రమవుతున్నాయి. గత దశాబ్దంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో ఇవి రెట్టింపయ్యాయి. ముఖ్యంగా డిప్రెషన్, సైకోసిస్ లాంటి తీవ్రమైన మానసిక వ్యాధులకు చిన్నా, పెద్దా, స్త్రీ, పురుషులన్న భేదం లేకుండా బలైపోతున్నారు. అలాంటి తీవ్రమైన మానసిక వ్యాధుల్లో స్కిజోఫ్రీనియా ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశంలోనూ సుమారు ఒక్క శాతానికి పైగా జనాభా ఈ వ్యాధితో బాధపడుతున్నారని ఒక అంచనా. దీని బారిన పడిన వ్యక్తుల విపరీత, వింత ప్రవర్తనను చూసి, వారిని మతిభ్రమించిన వ్యక్తులుగా తోటి వారు ముద్ర వేస్తారు. దీంతో వాళ్లు అభద్రతా భావానికి లోనవుతారు. 

18–30 ఏండ్ల వయసులో..

స్కిజోఫ్రీనియా అనే పదానికి ‘వేరు పడడం’ అని అర్థం ఉంది. ఈ వ్యాధి బారిన పడిన రోగి కూడా వాస్తవ ప్రపంచానికి, యదార్థ పరిస్థితులకు దూరంగా బతుకుతుంటారు. యువకులు, వృద్ధులు, ధనవంతులు, పేదవారు, సిటీ, పల్లెవాసులు, డాక్టర్లు, లాయర్లు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద ఆఫీసర్లు.. ఇలా ఎవరైనా సరే ఈ రోగం బారినపడే అవకాశం లేకపోలేదు. అయితే సాధారంణంగా 18 నుంచి 30 ఏండ్ల మధ్య వయసులో ఈ వ్యాధి బారినపడితే, అది జీవితాంతం పీడించే ప్రమాదం ఉంది.

స్కిజోఫ్రీనియా లక్షణాలు

  •   ఈ రోగం బారినపడిన వారిలో నిద్రలేమి, ఒంటరితనం, భయం వంటి ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి.
  • వాళ్లు బంధువులు, పొరుగువారు, మిత్రులు తనను రహస్యంగా పరిశీలిస్తున్నారన్న తప్పుడు అభిప్రాయంతో.. వారిని నమ్మలేక అనుమానం, అభధ్రతతో బతుకుతుంటారు.
  • ఎవరో కొందరు తనను వెంబడిస్తున్నారని, విష ప్రయోగం చేయబోతున్నారని, చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఏదో తెలియని భయంలో ఉంటారు.
  • ఎవరో తనకు కీడు చేయాలన్న ఆలోచనతో మంత్రాలు, చేతబడులు, క్షుద్ర శక్తులను ప్రయోగం చేస్తున్నారని భ్రమ పడుతుంటారు.
  • రోగి తనలో తాను నవ్వుకుంటూ, తను ఊహించుకున్న వ్యక్తులతో సంభాషణలు చేస్తుంటారు.
  • టీవీ/రేడియో ప్రోగ్రామ్స్ లేదా చుట్టుపక్కల వాళ్ల మాటలు తన గురించేనని అనుకుంటుంటారు.
  • ఒక్కోసారి గ్యాప్ ఇవ్వకుండా ఏవో అర్థంలేని, సంబంధం లేని విషయాల గురించి మాట్లాడుతారు. ఒక విషయానికీ, మరో విషయానికీ పొంతన లేకుండా మాట్లాడుతూ తమకు భయం లేదన్నట్టు కనిపిస్తారు.
  • వ్యాధి తీవ్రత పెరిగితే కొన్ని సందర్భాలలో స్నానం చేయడం మానేసి మురికిగా కనిపించడం, బట్టలు కూడా సరిగా వేసుకోకుండా తిరగడం, సమాజం ఆమోదించలేని విధంగా ప్రవర్తించడం చేస్తుంటారు. 
  • ఒకే భంగిమలో గంటల పాటు కూర్చొని ఉండటం, ఒక్కోసారి కొన్ని రోజుల పాటు అలానే కూర్చుండి పోవడం చేస్తారు.
  • తాను వంద శాతం ఆరోగ్యంతో ఉన్నానని అనుకోవడమే కాకుండా,  కొన్ని సందర్భాలలో ఇతరులపై దాడి చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం. లేదా తనను తానే     గాయపరుచుకునే  ప్రమాదం ఉంది.

ఈ వ్యాధి రావడానికి కారణాలు ఏమిటి?

  • స్కిజోఫ్రీనియా రావడానికి నిర్ధిష్టమైన కారణమేమిటో ఇప్పటి వరకూ తెలియదు. అయితే జెనిటిక్‌‌గా, బ్రెయిన్ కెమిస్ట్రీలో మార్పులు, పరిస్థితుల ప్రభావం వల్ల ఈ వ్యాధి రావొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 
  • మెదడులో ఉండే డోపమైన్, గ్లూటమేట్, సెరటోనిన్ లాంటి న్యూరో కెమికల్స్ ఇంబ్యాలెన్స్‌‌ వల్ల మనిషి సాధారణ ఆలోచనా విధానంలో తీవ్రమైన మార్పులు వస్తాయి.
  • టీనేజ్‌‌, యవ్వనంలో సైకోయాక్టివ్, సైకోట్రోపిక్ మందులు తీసుకోవడం వల్ల కూడా బ్రెయిన్‌‌ కెమికల్స్‌‌లో మార్పులు రావొచ్చు.
  • విపరీతమైన మానసిక ఒత్తిడికి గురి చేసే కొన్ని సంఘటనలు కూడా ఈ వ్యాధి బారినపడడానికి కారణం కావచ్చు. ఉదాహరణకు కుటుంబ సభ్యుల మరణం, పరీక్షల్లో వరుస ఫెయిల్యూర్స్, తీవ్రమైన ఆర్థిక నష్టాలు, ఉద్యోగం కోల్పోవడం, పదే పదే అబార్షన్లు (మిస్‌‌ క్యారేజ్‌‌), విడాకులు వంటివి కూడా స్కిజోఫ్రెనియాకు దారి తీస్తాయి.
  •   వంశపారం పర్యంగా కూడా పెద్దల నుంచి సంతానానికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
  •   పోషకాహార లోపం, మెదడు ఎదుగుదలను ప్రభావితం చేసే టాక్సిన్స్, వైరస్‌‌లకు గురికావడం, గర్భంలో ఉన్నప్పుడు బ్రెయిన్ గ్రోత్ సరిగా లేకపోవడం లాంటి సమస్యలు కూడా స్కిజోఫ్రీనియాకు ఒక కారణమే.

ట్రీట్‌‌మెంట్‌‌ ఉందా? 

స్కీజోఫ్రీనియాను గుర్తించేందుకు ఎలాంటి టెస్టులూ లేవు. తమంతట తాముగా లేదా సన్నిహితులు గానీ గుర్తిస్తే, ట్రీట్‌‌మెంట్ ద్వారా మళ్లీ మామూలుగా చేయొచ్చు. అనుభవమున్న మానసిక వైద్య నిపుణుల పర్యవేక్షణలో ట్రీట్‌‌మెంట్ తీసుకోవాలి. అయితే లక్షణాలు తగ్గిపోగానే చాలా మంది  మందుల వాడకం నిలిపేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. అలా చేస్తే రోగ లక్షణాలు  మళ్లీ వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే డాక్టర్ చెప్పినన్ని రోజులు, కోర్స్ పూర్తయ్యే వరకూ మందులు వాడాలి. అయితే ఈ మందులకు అడిక్ట్ అవుతారని, జీవితాంతం వాడాల్సి ఉంటుందని కొంత మంది అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా అవాస్తవం. దుష్ట శక్తులు, మంత్రాలు, భూతాలు,  దైవదూషణ, చేతబడులు, తయాత్తులు, పాపం, జాతకరీత్యా ఉండే సమస్యల వల్ల స్కీజోఫ్రీనియా వస్తుందన్న భ్రమ కొందరిలో ఉంది. అది వాస్తవం కాదు. ఇది ఒక అనారోగ్య సమస్య మాత్రమే. క్షుద్ర పూజలు చేసేవాళ్లు, దెయ్యం వదిలించేవాళ్లు, జాతకాలు చెప్పేవాళ్ల దగ్గరకు కాకుండా మంచి డాక్టర్‌‌‌‌ను వద్దకు వెళ్తే సమస్య నుంచి బయటపడొచ్చు.  స్కీజోఫ్రీనియా ఎప్పటికీ నయం కాదన్న భ్రమ కూడా సరైనది కాదు. ఈ వ్యాధిని నయం చేసేందుకు రకరకాల చికిత్సా పద్ధతులు ఉన్నాయి. మంచి డాక్టర్‌‌‌‌ను కలిసి చికిత్స పొందితే  మళ్లీ అందరిలా జీవితాన్ని గడపొచ్చు.