మోగిన బడి గంటలు.. హైదరాబాద్​ జిల్లాలో ఫస్ట్​ డే 36.73% అటెండెన్స్

మోగిన బడి గంటలు.. హైదరాబాద్​ జిల్లాలో ఫస్ట్​ డే 36.73% అటెండెన్స్

 హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్​స్కూళ్లు బుధవారం ఓపెన్​అయ్యాయి. స్కూళ్లతోపాటు, స్కూల్స్​పరిసరాలు సందడిగా కనిపించాయి. 48 రోజుల వేసవి సెలవుల పిల్లలు తిరిగి బడిబాట పట్టారు. ఉదయం 7 గంటల నుంచే బ్యాగులు తగిలించుకుని తల్లిదండ్రులతో స్కూళ్లకు చేరుకున్నారు. మొదటిరోజున స్టూడెంట్లకు గ్రాండ్​వెలకమ్​చెప్పేందుకు అధికారులు ముందస్తుగా స్కూళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

గేటు వద్దే టీచర్లు పిల్లలకు బుక్స్, పెన్స్, చాక్లెట్లు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో పలువులు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. స్టూడెంట్లకు బుక్స్, యూనిఫాం పంపిణీ చేశారు. హైదరాబాద్​జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో బుధవారం 36.73 శాతం అటెండెన్స్ నమోదైంది. 1,05,281 స్టూడెంట్లకు గాను, 38,675 మంది మాత్రమే వచ్చారు. 

మెగా డీఎస్సీతో స్కూళ్ల అభివృద్ధి: మంత్రి పొన్నం

బీఆర్ఎస్​పాలనలో రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కాంగ్రెస్​ప్రభుత్వం విద్యకు మొదటి ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. మెగా డీఎస్సీతో ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తామన్నారు. బుధవారం స్కూళ్ల పున:ప్రారంభంలో భాగంగా అబిడ్స్​ఆలియా మోడల్ స్కూల్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

స్టూడెంట్లకు టెస్ట్, నోట్ బుక్స్, యూనిఫాం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ కార్యక్రమంతో తెలంగాణలోని 26,872 ప్రభుత్వ బడులను రూ.1,100 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. సీఎం రేవంత్​రెడ్డి, తాను, ఇతర మంత్రులు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ స్కూళ్లలో చదువుకున్నవారిమేనని తెలిపారు. ప్రతిఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

 డ్రాప్ ఔట్స్ లేకుండా యూనిఫాం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని చెప్పారు. మెగా డీఎస్సీతో టీచర్ల ఖాళీలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, హైదరాబాద్​అడిషనల్​కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి, గన్ ఫౌండ్రి కార్పొరేటర్ సురేఖ ఓంప్రకాశ్, డీఈఓ రోహిణి, ఆర్డీఓ మహిపాల్, డిప్యూటీ డీఈఓ వెంకటేశ్వర్లు, హెచ్ఎం డాక్టర్ విశ్వనాథం గుప్తా పాల్గొన్నారు.

ఫరూక్ నగర్ మండలం మొగలిగిద్ద గ్రామంలోని గవర్నమెంట్​స్కూల్ పునఃప్రారంభ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ అనిత హరనాథ్ రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొని స్టూడెంట్లకు బుక్స్, యూనిఫాం అందజేశారు. జామై ఉస్మానియా ప్రభుత్వ బడిలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్​మోతె శ్రీలతారెడ్డి, అడ్డగుట్ట ఆజాద్ చంద్రశేఖర్ నగర్ లోని స్కూల్​లో ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ స్టూడెంట్లకు యూనిఫాం, నోట్ బుక్స్ పంపిణీ చేశారు.

 ధారూర్ మండలం కెరెల్లి గ్రామంలో నిర్వహించిన బడిబాటలో స్పీకర్​గడ్డం ప్రసాద్​కుమార్, జడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి,  ఎస్పీడీ మల్లయ్య, కలెక్టర్ నారాయణరెడ్డి, డీఈఓ రేణుకాదేవి, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ సుజాత పాల్గొన్నారు. బషీరాబాద్ మండలం మైల్వార్ జడ్పీహెచ్ఎస్ లో నిర్వహించిన బడిబాటలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.  మేడ్చల్ మండలం నూతనకల్ జడ్పీహెచ్ఎస్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ గౌతమ్ పాల్గొని పిల్లలకు యూనిఫాం, బుక్స్​అందజేశారు.