ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కుంటుపడుతున్న చదువులు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కుంటుపడుతున్న చదువులు

నిజామాబాద్, వెలుగు: టీచర్ల లాంగ్​ లీవ్స్, డిప్యుటేషన్లతో ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో పాఠశాల విద్య కుంటుపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్​స్కూళ్లలో ఇంగ్లీష్​మీడియం బోధన  ప్రవేశపెట్టి  విద్యా ప్రమాణాలను పెంచుతామని చెప్తున్నప్పటికీ, బోధించే వారు లేక ఆశించిన ఫలితాలు రావడం లేదు. చాలా స్కూళ్లలో  టీచర్లు లేక  డ్రాపవుట్ల సంఖ్య పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో 83 మంది టీచర్లు  లాంగ్​లీవ్​లో ఉండగా.. ఆయా స్కూళ్లలో ఉన్నవారు కొందరు  పైరవీలు చేసుకుని డిప్యుటేషన్​పై వెళ్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.  

ఇంగ్లీష్​ మీడియం బోధనపై ఎఫెక్ట్​..

2021 - 22 అకడమిక్ ఇయర్​ నుంచి గవర్నమెంట్స్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బోధనను ప్రవేశపెట్టడంతో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. కానీ ఆ స్థాయిలో టీచర్లు లేక విద్యాభ్యాసం కుంటుపడుతోంది.  లాంగ్​లీవ్స్ తో  పాటు రాజకీయ వత్తిళ్లు, విద్యాశాఖ అధికారులు టీచర్లను డిప్యుటేషన్లపై పంపుతూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో చాలా మంది స్టూడెంట్లు డ్రాపవుట్లుగా మారుతున్నారు. ఆయా గ్రామాళ్లో పనిచేస్తున్న డిప్యుటేషన్​టీచర్లను వెనక్కి పంపాలని సర్పంచ్ లు ఎంఈవోలకు వినతిపత్రాలు ఇస్తున్నారు. 

83 మంది టీచర్లపై కంప్లైంట్స్​

నిజామాబాద్​ జిల్లాలో 1,156 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 5,500 మంది టీచర్లు ఉన్నారు.  పలు  స్కూళ్లలో డిప్యుటేషన్లపై 15 శాతం టీచర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. నిజామాబాద్‌‌, కామారెడ్డి జిల్లాల్లో 83 మంది   టీచర్లు  లాంగ్​లీవ్ ​పెట్టి విదేశాలకు వెళ్లారని ఆరోపణలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్న టీచర్లపై జిల్లా విద్యాశాఖకు ఇప్పటికే పలు మార్లు కంప్లైంట్స్​ వెళ్లాయి.  కొందరు టీచర్లు బెంగళూరు, హైదరాబాద్‌‌లోని సాప్ట్​వేర్ కంపెనీల్లో పని చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 

అధికారుల నిర్లక్ష్యం

టీచర్లు దీర్ఘకాలిక సెలవులపై విదేశాల్లో పనిచేస్తున్నారు. ఈ విషయంపై  కంప్లైంట్లు ఉన్నా   విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కొవిడ్​ కారణంగా  అతలాకుతలమైన ప్రైవేట్, కార్పొరేట్​స్కూళ్ల మేనేజ్​మెంట్లు  స్టూడెంట్ల సంఖ్యను పెంచుకునేందుకు తక్కువ ఫీజుల పేరుతో  ప్రభుత్వ స్కూళ్ల  స్టూడెంట్లను తీసుకెళ్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.  

డిప్యుటేషన్లతో సమస్యలు..

నిజామాబాద్‌‌ జిల్లాలో రోడ్డు పక్కనే ఉన్న స్కూళ్లకు డిప్యుటేషన్​ హడావుడి నెలకొంది.  బోర్గం (పి) వంటి  స్కూల్​కు డిప్యుటేషన్​పై వస్తున్న  టీచర్లతో మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్లు మూతపడాల్సి వస్తోంది. నవీపేట్ బాలుర పాఠశాలకు చెందిన ఇద్దరు టీచర్లు రోడ్డు పక్కనే ఉన్న డిప్యుటేషన్​పై  వెళ్లారు. దీనితో, తిరిగి పిలవడానికి ఇంగ్లీష్​ బయాలజీ టీచర్లు లేరు. దర్పల్లికి చెందిన ఓ టీచర్​బోర్గాంకు డిప్యుటేషన్​పై వచ్చారు. 

కామారెడ్డి జిల్లాలో..

జుక్కల్ మండలం నాగల్​ గావ్​ అప్పర్​ప్రైమరీ స్కూల్​లో 143 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ స్కూల్​లో 8 మంది టీచర్ల అవసరం ఉండగా.. 6 మంది తోనే నెట్టుకొస్తున్నారు. ఇటీవల తెలుగు పండిట్ అబ్దుల్ రెహమాన్ లాంగ్ లీవ్ పెట్టి లండన్ వెళ్లారు. రెహమాన్ విదేశాలకు వెళ్లేందుకు ఆర్జేడీ పర్మిషన్​కూడా ఇచ్చిందని హెడ్ మాస్టర్ తెలిపారు. మరో టీచర్​అర్చనను మండల ఎంఈవో కౌలాస్ స్కూల్​కు డిప్యుటేషన్​పై పంపారు. ప్రస్తుతం ఈ స్కూల్​నలుగురు టీచర్లతోనే నడుస్తోంది. జుక్కల్ మండలంలోని  పెద్దగుళ్ల స్కూల్ టీచర్​ తరుణ లాంగ్​లీవ్​పై వెళ్తున్నారు. మహ్మదాబాద్‌‌ స్కూల్​లో స్కూల్‌‌ అసిస్టెంట్‌‌గా పనిచేస్తున్న నవీన్‌‌కుమార్‌‌ను డిప్యుటేషన్ పై  పెద్దగుళ్​ స్కూల్​కు పంపారు.  ఇలా పెద్దకొడప్‌‌గల్‌‌, పిట్లం, నిజాం సాగర్‌‌ మండల ఎంఈవోలు డిప్యుటేషన్​ఆర్డర్స్​ ఇవ్వడంతో స్కూళ్లలో ఇబ్బంది ఎదురవుతోంది.  

లాంగ్​ లీవ్స్​ రద్దు చేయాలి

 లాంగ్​ లీవ్​ లో ఉన్న టీచర్ల లీవ్​ లను రద్దు చేయాలి. డిప్యూటేషన్‌‌పై ఉండి దీర్ఘకాలంగా కొనసాగుతున్న  టీచర్లను బదిలీపై రప్పించాలి. టీచర్ల కొరత వల్ల చదువు సాగడంలేదు.  83 మంది టీచర్లు దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్నారు. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులు టీచర్లు లేక నష్టపోతున్రు. 
- భానుచందర్,  తెలంగాణ విద్యార్థి పరిషత్​ ప్రతినిధి 

రద్దు చేసేందుకు చర్యలు

లాంగ్​లీవ్స్​రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఈ సెలవుల వల్ల టీచర్ల షార్టేజ్ స్టూడెంట్లను వేధిస్తోంది. 83 మంది టీచర్లు సెలవులు జెన్యూన్​గా పెట్టారా?  లేదా? అనే విషయంపై విచారణ చేస్తున్నాం. సరైన కారణాలు చూపని వారిపై చర్యలు ఉంటాయి.  అవసరంలేని డిప్యుటేషన్లు రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం.  
- దుర్గాప్రసాద్, డీఈవో