5 కన్నా ఎక్కువ కేసులొస్తే బడి బంద్‌

5 కన్నా ఎక్కువ కేసులొస్తే బడి బంద్‌
  •     30లోపు అన్ని బడుల్లో కరెంట్, నీటి కనెక్షన్ పెట్టించాలె 
  •     అప్పటికల్లా స్కూళ్లు క్లీన్ చేయించాలని ఆదేశం
  •     ఫస్ట్‌ నుంచి ఫిజికల్‌ క్లాసులే.. నో ఆన్‌లైన్‌: మంత్రి సబిత
  •     అటెండెన్స్‌ తప్పనిసరి చేయబోమని స్పష్టం

హైదరాబాద్, వెలుగు: స్కూళ్లు, కాలేజీల్లో ఫిజికల్ క్లాసులు స్టార్టయ్యాక ఏదైనా బడిలో 5 కన్నా ఎక్కువ కరోనా కేసులు నమోదైతే వెంటనే ఆ స్కూల్‌ను తాత్కాలికంగా మూసేయాలని విద్య, వైద్య శాఖాధికారులు నిర్ణయించారు. స్టూడెంట్లలో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే దగ్గరలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లి టెస్టు చేయించాలని చెప్పారు. ఎక్కువ మందికి కరోనా వస్తే ఆ స్కూల్‌లోని స్టూడెంట్లు, సిబ్బందికి కరోనా ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ టెస్టులు చేయించాలన్నారు. ఎక్కువ కేసులు నమోదైన స్కూలు, హాస్టల్‌కు సంబంధించిన వివరాలను కలెక్టర్‌తో పాటు స్కూల్ ఎడ్యుకేషన్, పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్‌కు పంపించాలన్నారు. 

ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్​ డైరెక్టర్ శ్రీ దేవసేన, డీఎంఈ శ్రీనివాస్‌రావు మంగళవారం వేర్వేరుగా ఉత్తర్వులిచ్చారు. మరోవైపు స్కూళ్లు, కాలేజీల్లో వచ్చే నెల ఫస్ట్ నుంచి ఆఫ్ లైన్‌లోనే క్లాసులు కొనసాగించాలని సర్కారు నిర్ణయించింది. ఆన్​లైన్ పాఠాలకు స్వస్తి చెప్పునుంది. అయితే అటెండెన్స్‌ను మాత్రం తప్పనిసరి చేయబోమని చెప్పింది. పేరెంట్స్ అంతా ఆఫ్​లైన్ క్లాసులే కోరుకుంటున్నారని, ఆన్ లైన్ క్లాసులను ఎవరూ అడగట్లేదని మంత్రి సబితారెడ్డి స్పష్టం చేశారు. అందుకే ఆఫ్​లైన్ క్లాసులే నడపాలని నిర్ణయించామన్నారు. 

సివిల్‌ సప్లై నుంచి రైస్‌ ప్యాకెట్లు తెచ్చుకోండి

స్కూళ్లు, హాస్టళ్లలోని రూమ్‌లు, బెంచీలు, కిటికీలు, టాయిలెట్లు, టాప్స్, వాటర్ ట్యాంకులను స్థానిక సంస్థల ప్రతినిధులతో మాట్లాడి క్లీన్ చేయించాలని డీఈవోలను శ్రీదేవసేన ఆదేశించారు. వీటి పర్యవేక్షణపై ఈ నెల 30 వరకు రోజూ రిపోర్టు పంపించాలన్నారు. నీటి కనెక్షన్ లేని స్కూళ్లలో మిషన్ భగీరథ ద్వారా కనెక్షన్ ఇప్పించాలని, కరెంట్ లేనిచోట కనెక్షన్ ఇప్పించాలని చెప్పారు. భగీరథ కనెక్టివిటీ ఎన్ని స్కూళ్లలో ఉంది, ఎన్నింటిలో లేదో బుధవారం కల్లా పంపించాలన్నారు. స్టూడెంట్లకు టెక్ట్స్ బుక్స్‌ను ఈ నెల 30లోగా అందించాలని చెప్పారు. మిడ్‌ డే మీల్స్‌ కోసం సివిల్ సప్లై నుంచి రైస్ స్టాక్‌ను హెడ్మాస్టర్లు తెచ్చుకోవాలని ఆదేశించారు. 

కరోనా రూల్స్‌ అమలు చేయాలె

కరోనా రూల్స్‌ పాటించేలా చర్యలు తీసుకోవాలని డీఈవోలను శ్రీదేవసేన ఆదేశించారు. క్లాస్‌ రూమ్‌లను రెగ్యులర్‌గా శానిటైజ్ చేయించాలని.. స్కూల్స్, కాలేజీల చుట్టుపక్కల పిచ్చిమొక్కలుంటే పంచాయతీ రాజ్, మున్సిపల్ అధికారుల సాయంతో తొలగించాలన్నారు. స్కూల్ నిర్వహణ పూర్తిగా హెడ్మాస్టర్లదేనని స్పష్టం చేశారు. స్టూడెంట్లు, స్టాఫ్ తప్పకుండా మాస్కు పెట్టుకొని రావాలని ఆదేశించారు.