ఇయ్యాల్టి నుంచి సంక్రాంతి సెలవులు

ఇయ్యాల్టి నుంచి సంక్రాంతి సెలవులు
  • ఈ నెలాఖరు కల్లా థర్డ్ వేవ్ పీక్ స్టేజ్ కు వెళ్తదన్న ఆరోగ్య శాఖ 
  • దీంతో ఆన్ లైన్ క్లాసులపై విద్యాశాఖ కసరత్తు 
  • ఇప్పటికే ఇంటర్ లో మొదలైన టీవీ పాఠాలు 
  • ఆన్ లైన్ బాటలోనే నడవనున్న వర్సిటీలు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ నెలాఖరు కల్లా థర్డ్ వేవ్ పీక్ స్టేజ్ కు వెళ్తుందని, ఈ వేవ్ ఆరు వారాల పాటు ఉంటుందని ఆరోగ్య శాఖ రెండ్రోజుల కింద ప్రకటించింది. ఈ నేపథ్యంలో సంక్రాంతి సెలవుల తర్వాత తిరిగి విద్యాసంస్థల ప్రారంభంపై సందేహం నెలకొంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల11 నుంచి బడులకు, 13 నుంచి కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఇవ్వాల్సి ఉండగా... 8 నుంచే విద్యాసంస్థలకు సర్కార్ సెలవులు ప్రకటించింది. తిరిగి 17న ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా కేసులు ఎక్కువవుతుండడంతో ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. సెలవుల తర్వాత ఫిజికల్ క్లాసులకు సర్కార్ అనుమతిచ్చేది డౌటేనని ఆఫీసర్లే చెబుతున్నారు. స్టూడెంట్లకు పాఠాలు చెప్పేందుకు ఆల్టర్నెట్ ఏర్పాట్లు చేస్తున్నారు. మళ్లీ ఆన్​లైన్, టీవీ పాఠాలను స్టూడెంట్లకు అందించేందుకు చర్యలు మొదలుపెట్టారు.  

గాడిన పడుతున్న టైమ్ లో... 
కరోనా ప్రభావం స్టూడెంట్లపై తీవ్రంగా పడింది. 2020–21 అకడమిక్ ఇయర్ లో కేవలం నెల రోజులే ఫిజికల్ క్లాసులు నడవగా, మిగిలిన క్లాసులన్నీ ఆన్​లైన్​లోనే జరిగాయి. దీంతో విద్యావ్యవస్థ గాడీ తప్పి, స్టూడెంట్లలో చాలా మార్పులొచ్చాయి. స్టూడెంట్లు సబ్జెక్టులు మరిచిపోయారని, వారి బిహేవియర్ మారిపోయిందని చాలా సర్వేల్లో తేలింది. వారిని మళ్లీ లైన్​లోకి తీసుకురావాలంటే ఫిజికల్ క్లాసులే ప్రత్యామ్నాయమని సర్వేలు సూచించాయి. ఈ క్రమంలో 2021–22 అకడమిక్ ఇయర్ లో జులైలో ఆన్​లైన్, టీవీ పాఠాలు మొదలు కాగా కేసులు తగ్గడంతో సెప్టెంబర్ నుంచి ఫిజికల్ క్లాసులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడిప్పుడే విద్యావ్యవస్థ గాడిన పడుతుందనే టైమ్ లో మళ్లీ కేసులు ఎక్కువయ్యాయి. దీంతో మళ్లీ బడులు బంద్ అయ్యే పరిస్థితి రావడంతో స్టూడెంట్లు, పేరెంట్స్​లో అయోమయం నెలకొంది. 

రికార్డెడ్ పాఠాలు రెడీ... 
రాష్ట్రంలో 40,898 స్కూళ్లుండగా, వాటిలో 60 లక్షల మంది చదువుతున్నారు. వీరిలో 22 లక్షల మంది సర్కారు బడుల్లో,  మిగిలినోళ్లు గురుకులాలు, ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో ఉన్నారు. ప్రస్తుతం సర్కార్ బడులకు చెందిన స్టూడెంట్లకు ఫిజికల్ క్లాసులే కొనసాగుతున్నాయి. సుమారు 300 వరకు ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో మాత్రమే ఆన్​లైన్ పాఠాలు కొనసాగుతుండగా, మిగిలిన బడుల్లో ఆఫ్​లైన్ పాఠాలే నడుస్తున్నాయి. అయితే ఒకవేళ ఈ నెల17 నుంచి ఫిజికల్ క్లాసులు ప్రారంభం కాకుంటే, మళ్లీ టీవీ పాఠాలు నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు యోచిస్తున్నారు. ఇప్పటికే రికార్డ్ చేసిన పాఠాలుండటంతో, వాటిని ప్లే చేసేందుకు సర్కారు అనుమతి కోసం ప్రపోజల్స్ సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. సర్కార్ పర్మిషన్ ఇస్తే వెంటనే టీవీ పాఠాలు చెప్పేందుకు రెడీగా ఉన్నామని స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రైవేట్ మేనేజ్మెంట్లు కూడా ఆన్ లైన్ పాఠాలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.  

కాలేజీల్లోనూ ఆన్ లైన్ క్లాసులు... 
ఇప్పటికే  ఇంటర్ లో టీవీ పాఠాలు మొదలయ్యాయి. సంక్రాంతి సెలవులు ప్రకటించిన రోజే ఇంటర్ కమిషనరేట్ టీశాట్, దూరదర్శన్ షెడ్యూల్​ను రిలీజ్ చేసింది. టీశాట్​లో సెకండియర్​కు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, ఫస్టియర్ స్టూడెంట్లకు సాయంత్రం 5 నుంచి రాత్రి 8:30 గంటల వరకు క్లాసెస్ ఉంటాయని 15 రోజుల షెడ్యూల్ ఇచ్చింది. ఒకవేళ సెలవులు కొనసాగిస్తే, ఈ క్లాసులు కంటిన్యూ చేస్తామని అధికారులు చెబుతున్నారు. మరోపక్క ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు మళ్లీ ఆన్​లైన్ పాఠాలు చెప్పే పనిలో ఉన్నాయి. డిగ్రీ, పీజీతో పాటు ఇంజనీరింగ్ తరగతులకూ ఆన్​లైన్ క్లాసులు కొనసాగించాలని ఇప్పటికే ప్రాథమికంగా అధికారులు నిర్ణయించారు. త్వరలోనే వీసీలతో మీటింగ్​పెట్టి నిర్ణయం తీసుకుంటామని ఉన్నత విద్యామండలి ఆఫీసర్లు చెప్పారు.