ఇవాళ్టి నుంచే స్కూళ్లు, కాలేజీలు..సార్లు లేరు, క్లీన్ చేసోటోళ్లూ లేరు

ఇవాళ్టి నుంచే స్కూళ్లు, కాలేజీలు..సార్లు లేరు, క్లీన్ చేసోటోళ్లూ లేరు
  • ఎస్జీటీలతో చెప్పిస్తామంటున్నా.. వారికి ఎక్స్​పీరియెన్స్​ లేక ఇబ్బందులు
  • కరోనా టైంలో స్కూళ్ల క్లీనింగ్, శానిటేషన్​ ఎట్లాగనే ఆందోళన
  • కాలేజీల్లో గెస్ట్, పార్ట్​టైం లెక్కరర్లనూ పిలవలే

హైదరాబాద్, వెలుగు: పూర్తి స్థాయిలో టీచర్లు, లెక్చరర్లు లేకుండానే.. శానిటేషన్​ స్టాఫ్​ను రెన్యువల్​ చెయ్యకుండానే.. రాష్ట్రంలో సోమవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్​ అవుతున్నాయి. గవర్నమెంట్​ హైస్కూళ్లలో పాఠాలు చెప్పిన విద్యా వలంటీర్లను, కాలేజీల్లో గెస్ట్​లెక్చరర్లను రెన్యువల్​ చెయ్యకపోవడంతో స్టూడెంట్లకు టీచింగ్​ ఎలాగన్న సందేహాలు వస్తున్నాయి. దీనికితోడు కరోనా టైంలో అత్యవసరమైన క్లీనింగ్, శానిటేషన్​ పనులు చేసే స్టాఫ్​ లేకుంటే స్కూళ్లలో పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పంచాయతీల స్టాఫ్​తో క్లీనింగ్​చేయించాలని సర్కారు చెప్తోంటే.. తాము చేయలేమని పంచాయతీ శానిటేషన్​ వర్కర్లు స్పష్టం చేస్తున్నారు. అటు ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు కూడా జీతాల భారం, ఖర్చులు తగ్గించుకునేందుకు.. ఏదో కొద్దిమంది టీచర్లనే రప్పించుకుని స్టూడెంట్లకు క్లాసులు చెప్పించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల స్టూడెంట్లకు ఇబ్బంది తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కరోనా లాక్​డౌన్ తో మార్చి16 నుంచి స్కూళ్లు, కాలేజీలన్నీ మూతపడ్డాయి. టెన్త్ పరీక్షల నిర్వహణకు  ఇబ్బందికాగా.. ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా స్టూడెంట్స్​కు గ్రేడింగ్స్​ ఇచ్చారు. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు అందరినీ ప్రమోట్ చేశారు. ఇంటర్​ సెకండియర్ లో ఫెయిలైన వారికి మినిమమ్ మార్కులేసి పాస్ చేశారు. తర్వాత 2020––21 ఎడ్యుకేషన్​ ఇయర్​కు సంబంధించి.. సెప్టెంబర్ 1 నుంచి డిజిటల్, ఆన్​లైన్​ క్లాసులు మొదలుపెట్టారు. కరోనా కంట్రోల్లోకి వస్తుండటంతో ఫిబ్రవరి 1 నుంచి 9, 10 తరగతులు, ఆపై కాలేజీలను రీఓపెన్​ చేయాలని సర్కారు నిర్ణయించింది. మొత్తంగా పదిన్నర నెలల తర్వాత బడులు, కాలేజీల్లో బెల్​ మోగనుంది. ప్రభుత్వ, ప్రైవేటు కలిపి రాష్ట్రవ్యాప్తంగా 14,252 హైస్కూళ్లు, 2,464 జూనియర్ కాలేజీలు, 1,150 డిగ్రీ కాలేజీలు, మరో 1,500 పీజీ, ఇతర ప్రొఫెషనల్ కాలేజీలు సోమవారం నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సుమారు 35 లక్షల మందికిపైగా స్టూడెంట్స్ స్కూళ్లు, కాలేజీల బాట పట్టనున్నారు. ఇందులో 9, 10 తరగతుల స్టూడెంట్సే10 లక్షలకుపైగా ఉంటారు.

అందరు సార్లు లేకుండానే..

బడుల్లో కేవలం 9, 10 క్లాసులే మొదలవుతున్నాయి. సబ్జెక్టు టీచర్లు లేని హైస్కూళ్లలో ఇబ్బందులు ఎదురవనున్నాయి. గతేడాది పనిచేసిన 12,600 మంది విద్యా వలంటీర్ల(వీవీల)ను ఈసారి రెన్యూవల్ చేయలేదు. వారిలో చాలా వరకు నైన్త్, టెన్త్​ స్టూడెంట్లకు క్లాసులు చెప్తున్నవారే. దీంతో హైస్కూళ్లలో సబ్జెక్టు టీచర్ల కొరత రానుంది. ప్రత్యామ్నాయంగా ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో పనిచేస్తున్న ఎస్జీటీలతో క్లాసులు చెప్పిస్తామని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చెప్తున్నా.. ఇప్పటివరకు అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. ‘‘ప్రస్తుతం ఏడో తరగతి వరకు క్లాసులు నడవడం లేదు. వాటి టీచర్లకు వేలల్లో జీతాలిస్తున్నం. వీరిని ఊరికే కూర్చోబెట్టి, వీవీలను తీసుకోవడం ఎందుకు? కాబట్టి ఎస్జీటీలతో క్లాసులు చెప్పించాలనుకుంటున్నం” అని స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అయితే ఈ ఎస్జీటీలెవరికీ పెద్ద క్లాసుల సబ్జెక్టు పాఠాలు చెప్పిన అనుభవం లేని పరిస్థితి. దీంతో టీచింగ్​కు ఇబ్బంది అవుతుందన్న విమర్శలు వస్తున్నాయి. టీచర్​ సంఘాలు కూడా దీన్ని తప్పుపడుతున్నాయి. ఇక సర్కారీ బడుల్లో 2,500 మంది పార్ట్ టైం ఇన్​స్ట్రక్టర్లనూ రెన్యూవల్ చేయలేదు. మరోవైపు సర్కారీ జూనియర్, డిగ్రీ కాలేజీలు, మోడల్​స్కూళ్లు, గురుకులాల్లో పనిచేసే సుమారు ఐదు వేల మంది గెస్ట్, హవర్లీ బెస్డ్ టీచర్లు, లెక్చరర్లను రెన్యూవల్​ చెయ్యలేదు. అక్కడా టీచింగ్​కు ఇబ్బంది కానుంది.

ప్రైవేటులోనూ ఇబ్బందులే..

ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లోనూ టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్స్​కు ఇబ్బందులు తప్పడం లేదు. కేవలం 9, 10 తరగతులకే ఫిజికల్ బోధన ఉండటంతో.. కొద్దిమంది టీచర్లనే వినియోగించుకోవాలని మేనేజ్​మెంట్లు నిర్ణయించాయి. రాష్ట్రంలో దాదాపు లక్ష మందికిపైగా ప్రైవేటు హైస్కూల్ టీచర్లుంటే.. అందులో సగం మందిని కూడా బడులకు రావాలని పిలవలేదని టీచర్లు చెప్తున్నారు.  టీచర్లకు జీతాలు ఇవ్వకుండా ఉండటం కోసం స్కూళ్లకు పిలవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. జూనియర్, డిగ్రీ, ఇతర కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. వాటిలో కేవలం 30శాతం మంది లెక్చరర్ల సేవలనే వినియోగించుకోవాలని భావిస్తున్నారు. దీంతో పూర్తిస్థాయి టీచింగ్ జరగడం ఇబ్బందికరంగా మారుతుందని ఎక్స్​పర్టులు అంటున్నారు.

బడులు క్లీన్ చేసుడు ఎట్ల? స్కూళ్ల టైమింగ్స్

  • జిల్లాల్లో పొద్దున 9:30 గంట‌ల నుంచి సాయంత్రం 4:45 గంట‌ల వ‌ర‌కు
  • హైదరాబాద్​లో పొద్దున 8:45 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు
  • జూనియర్ కాలేజీలకు రాష్ట్రవ్యాప్తంగా పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు

రీ ఓపెన్ జాగ్రత్తలు, గైడ్లైన్స్..

  •     స్టూడెంట్లు, ఫ్యాకల్టీ, ఇతర స్టాఫ్​ అంతా కంపల్సరీగా మాస్కులు పెట్టుకోవాలి
  •     రెండు గజాల దూరం రూల్​ను పాటించాలి
  •     అందరూ కర్చీఫ్ (దస్తీ) తెచ్చుకోవాలి
  •     కేటాయించిన సీట్లో మాత్రమే కూర్చోవాలి.
  •     ఇతర స్టూడెంట్లతో పెన్ను, పెన్సిల్, ఇతర వస్తువులేవీ షేర్ చేసుకోవద్దు
  •     ఎవరి వాటర్ బాటిల్ వారే తెచ్చుకోవాలి.. దీన్ని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు
  •     స్కూల్​ ఆవరణలో, మిడ్​డే మీల్స్​ టైంలో, టాయిలెట్ల దగ్గర కనీస దూరం పాటించాలి
  •     పేరెంట్స్ అంగీకార పత్రం ఉంటేనే స్కూల్​లోకి అనుమతిస్తారు.
  •     హైస్కూళ్లలో క్లాసుకు 20 మంది,  ఇంటర్​లో 30 మంది, డిగ్రీలో స్టూడెంట్ల సంఖ్యలో సగం మంది మాత్రమే ఉండాలి.