సమస్యల నడుమ స్కూళ్లు రీ ఓపెన్..​ బెల్ కొట్టిన హెచ్​ఎంలు.. చీపురు పట్టిన స్టూడెంట్లు

సమస్యల నడుమ స్కూళ్లు రీ ఓపెన్..​ బెల్ కొట్టిన హెచ్​ఎంలు..  చీపురు పట్టిన స్టూడెంట్లు
  • పలుచోట్ల కూలిన  గదులు.. లేచిన రేకులు..
  • విరిగిన తలుపులు.. పగిలిన బోర్డులు
  • సమస్యలతో స్వాగతం పలికిన సర్కారు బళ్లు 
  • గుక్కెడు నీళ్లకూ తిప్పలు పడ్డ స్టూడెంట్లు

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం స్కూళ్లు తెరుచుకున్నాయి. సర్కారు బడులు స్టూడెంట్లకు సమస్యలతో స్వాగతం పలికాయి. పెచ్చులూడుతున్న గోడలు, ఫ్లోరింగ్.. గాలివానకు లేచిపోయిన రేకులు, విరిగిన తలుపులు, కిటికీలు.. ఊడి కింద పడ్డ బ్లాక్​ బోర్డులు, రెక్కలు లేని ఫ్యాన్లు దర్శనమిచ్చాయి. మూత్రశాలలు, మరుగుదొడ్లు, ఆవరణలు చెత్తాచెదారంతో నిండిపోయాయి.  స్టూడెంట్లే చీపుర్లు పట్టి క్లాస్​రూములను శుభ్రం చేసుకున్నారు. అటెండర్లు లేకపోవడంతో హెచ్​ఎంలు, టీచర్లే బడి గంట కొట్టారు. చాలా స్కూళ్లలో స్టూడెంట్లు తాగునీటికి ఇబ్బంది పడ్డారు. సరిపోను గదులు లేక చెట్లకిందనే పాఠాలు విన్నారు.

రెండు నెలల వేసవి సెలవుల తర్వాత రాష్ట్రంలో సోమవారం తెరుచుకున్న సర్కారు బడులు స్టూడెంట్లకు సమస్యలతో స్వాగతం పలికాయి. పెచ్చులూడుతున్న గోడలు.. లేచిన ఫ్లోరింగ్​.. విరిగిన తలుపులు, కిటికీలు.. ఊడి కింద పడ్డ బ్లాక్​ బోర్డులు.. రెక్కలు లేని ఫ్యాన్లతో అధ్వానంగా దర్శనమిచ్చాయి. ఇటీవల గాలిదుమారానికి కొన్ని స్కూళ్లలో రేకులు లేచిపోతే, ఇంకొన్ని చోట్ల చెట్లు విరిగిపడి గదులు కూలిపోయాయి. చాలా చోట్ల నీట్​గా రెడీ అయ్యి స్కూలుకు పోయిన స్టూడెంట్లు, దుమ్ము, ధూళితో నిండిన గదుల్లో కూర్చోలేకపోయారు.  బయట ఎండలు దంచుతోంటే కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక పిల్లలు ఇబ్బందిపడ్డారు. సర్కారు స్కూళ్ల వైపు స్టూడెంట్లను ఆకర్షించేందుకు ఈ నెల 3 నుంచి సర్కారు రాష్ట్రవ్యాప్తంగా బడి బాట నిర్వహించింది. ఇందులో భాగంగా జూన్ 12న స్కూళ్లను తోరణాలు, ముగ్గులతో అలంకరించి, ప్రజాప్రతినిధులను ఆహ్వానించి, ప్రారంభోత్సవాన్ని పండుగలా జరపాలని ఉపాధ్యాయులను ఉన్నతాధికారులు ఆదేశించారు. కానీ ఎక్కడా ఆ పరిస్థితి కనిపించలేదు.   -  నెట్​వర్క్, వెలుగు

అటెండర్లుగా మారిన టీచర్లు..

రాష్ట్రవ్యాప్తంగా 26,065 సర్కారు బడులు సోమవారం తెరుచుకున్నాయి. ‘మన ఊరు.. మనబడి’ స్కీం కింద  రూ.7,290 కోట్లతో అన్ని స్కూళ్లలో  సకల వసతులు కల్పించి అద్భుతంగా తీర్చిదిద్దుతామని సర్కారు ప్రకటించినా ఆచరణలో చేతులెత్తేసింది. మొదటి విడత  రూ.3,497 కోట్లు కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం ఏడాది కాలంలో ఇచ్చింది కేవలం రూ. 300 కోట్లు మాత్రమే.  దీంతో తొలిదశలో ఎంపిక చేసిన 9,123 బడుల్లో  మండలానికి రెండు స్కూళ్ల చొప్పున 1,200 స్కూళ్లలో మాత్రమే ఇప్పటివరకు మౌలిక వసతులు కల్పించారు. మిగిలిన బడుల్లో కనీస రిపేర్లు కూడా చేయకపోవడంతో అధ్వాన స్థితికి చేరుకున్నాయి. స్కూళ్లలో పనిచేసే28,200 మంది స్కావెంజర్లను మూడేండ్ల కిందే జీతాలివ్వలేక​ తొలగించిన ప్రభుత్వం,శానిటేషన్​బాధ్యతను లోకల్​బాడీలకు అప్పగించింది. కానీ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్యపనులే తలకు మించిన భారమైన మున్సిపల్​, పంచాయతీ వర్కర్లు స్కూళ్ల వైపు తొంగిచూడలేదు. దీంతో రెండు నెలల తర్వాత సోమవారం తెరుచుకున్న బడుల్లో గదులు, వరండాలు దుమ్ము కొట్టుకపోయాయి. మూత్రశాలలు, మరుగుదొడ్లు, ఆవరణలు చెత్తచెదారంతో నిండిపోయాయి. తప్పనిసరి పరిస్థితుల్లో స్టూడెంట్లే చీపుర్లు పట్టి తమ క్లాస్​రూములను శుభ్రం చేసుకోగా, అటెండర్లు లేకపోవడంతో హెచ్​ఎంలు, టీచర్లే బెల్​ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. 

 నామ్​కే వాస్తే గా బడి బాట.. 

 పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని సర్కారు బడుల్లో ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమం  ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ నెల 17 వరకు వివిధ కార్యక్రమాలతో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన షెడ్యూల్​ప్రకటించారు. జూన్ 1న స్కూల్ లెవెల్​లో బడిబాట సన్నాహక సమావేశం నిర్వహించి, 3 నుంచి 9 వరకు అన్ని చోట్ల స్పెషల్​ అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. 12 నుంచి 17 వరకూ ప్రతి రోజూ బడుల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి స్టూడెంట్లను, వారి పేరెంట్స్​ను ఆకర్షించాలని ఆదేశించారు. ముఖ్యంగా 12న బడి ప్రారంభం రోజుకాబట్టి ముగ్గులతో అలంకరించి, ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. కానీ  చాలా చోట్ల ఇప్పటివరకు బడివైపు చూడని హెచ్​ఎంలు, టీచర్లు సోమవారమే తాళాలు తెరవడం గమనార్హం. దీనిని బట్టి బడి బాట కార్యక్రమాన్ని అటు విద్యాధికారులుగానీ, ఇటు ఉపాధ్యాయులుగానీ ఏ మాత్రం సీరియస్​గా తీసుకోలేదని స్పష్టమవుతోంది.