నల్గొండ జిల్లాలో పంటలకు అపార నష్టం..కోత దశలో పంటలను దెబ్బతీసిన మొంథా తుఫాన్

నల్గొండ జిల్లాలో పంటలకు అపార నష్టం..కోత దశలో పంటలను దెబ్బతీసిన మొంథా తుఫాన్

నల్గొండ, వెలుగు:  మొంథా తుఫాన్ నల్గొండ, సూర్యాపేట జిల్లాలో అన్నదాతలకు తీవ్ర నష్టం మిగిల్చింది. భారీ వర్షాలతో పంట కోతకొచ్చే దశలో ఉన్న వేలాది ఎకరాల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా వరి, పత్తి పంటలు అధికంగా దెబ్బతినడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. రెండు జిల్లాల పరిధిలోని వందల ఎకరాల్లో వరి పంట కోతకు సిద్ధంగా ఉంది. 

ఈ దశలో కురిసిన భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలుల ధాటికి వరి పైర్లు నేలకొరిగాయి. ఇప్పటికే కోసిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించినా అక్కడా ధాన్యం రాశులను వర్షం నీరు ముంచెత్తింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు తీసుకోకపోవడం, తేమ శాతం సమస్య కారణంగా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోపక్క పత్తి చేలల్లో తెంపడానికి సిద్ధంగా ఉన్న పత్తి కాయలు, ఇప్పటికే తెంపిన పత్తి వర్షానికి తడిసిపోయింది.

 పత్తి పూర్తిగా తడిసిపోవడంతో బరువు తగ్గి, రంగు మారి, మార్కెట్‌లో  సరైన ధర లభించే పరిస్థితి లేకుండా పోయింది. ఎకరాకు వేల రూపాయల పెట్టుబడి పెట్టిన రైతులకు తీవ్ర ఆర్థికనష్టం వాటిల్లింది. మొంథా తుఫాన్ రూపంలో వచ్చిన ఈ అకాల వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయని, పంట చేతికొచ్చిందని సంతోషించే లోపే ప్రకృతి బీభత్సానికి సర్వస్వం కోల్పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భారీగా పంట నష్టం 

తుఫాన్ ప్రభావంతో నల్గొండ, సూర్యాపేట జిల్లాలో వరి, పత్తి పంటలకు వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో సాగయిన 10.50 లక్షల ఎకరాల్లో వరికి మొ౦థా తుఫాన్ ప్రభావంతో భారీగా పంట నష్టం వాటిల్లింది. నల్గొండ జిల్లాలో 310 గ్రామాల్లో 35,487 ఎకరాల్లో, సూర్యాపేట జిల్లాలో  235 గ్రామాల్లో 17,510  మంది రైతులకు సంబంధించిన 54,006 ఎకరాల్లో  వరి పంట నష్టం వాటిల్లినట్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. 

ఇక  రెండు జిల్లాలో 6.05 ఎకరాల్లో సాగు చేయగా ఇందులో నల్గొండ జిల్లాలో 25,919 ఎకరాలలో సూర్యాపేట 3,597 మంది రైతులకు చెందిన 10,933 ఎకరాల పత్తి దెబ్బ తిన్నది. 105 ఎకరాలలో మిర్చి పంట నష్టం వాటిల్లింది. తుఫాన్ ప్రభావంతో మొత్తం 30,359 మంది రైతులు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాధమిక  అంచనా వేశారు.  

దెబ్బతిన్న రోడ్లు, ట్రాన్స్ ఫార్మర్లు  

సూర్యాపేట జిల్లాలో వర్షాలతో రోడ్లు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. సూర్యాపేట - దంతాలపల్లి రహదారి వర్షాలకు కొట్టుకుపోవడంతో సూర్యాపేట - దంతాలపల్లి రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లాలో వర్షాలకు రూ.1.10 కోట్ల రోడ్లు నష్టం వాటిల్లింది. ఇందులో గుండ్ల సింగారం బ్రిడ్జి డ్యామేజ్ కావడంతో రూ.30 లక్షలు, హుజూర్ నగర్ లో రూ.50 లక్షలు, దొండపాడు రోడ్ల డ్యామేజ్ రూ.5 లక్షలు నష్టం వాటిల్లింది. ఇక సూర్యాపేట జిల్లాలో సుమారు 72 ఎల్టిలో పోల్సు, హెటి 22 పోల్స్, ఐదు ట్రాన్స్ పార్మర్స్ డ్యామేజీ కాగా  సుమారు రూ. 30 లక్షలు నష్టం అంచనా వేశారు.  

యాదాద్రిలో 706 ఎకరాల్లో పంట నష్టం

యాదాద్రి, వెలుగు: తుఫాను కారణంగా యాదాద్రి జిల్లాలో వరి పంటకు ఎక్కువగా నష్టం వాటిల్లింది.  వాన కారణంగా జిల్లాలో మొత్తం 706.3 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అగ్రికల్చర్​ ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. తుఫాను కారణంగా 706.3 ఎకరాల్లో నష్టపోయినట్టు అగ్రికల్చర్​ ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లాలోని 8 మండలాల్లోని 54 గ్రామాలకు చెందిన 430 మంది రైతులు పంట నష్టపోయినట్టు రిపోర్ట్​ రూపొందించారు.

 ఇందులో పత్తి 30 ఎకరాలు, వరి 676.3 ఎకరాలు నష్టపోయినట్టు తెలిపారు. రెండు పశువులు మరణించగా 13 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. యాదాద్రి బుధవారం నుంచి గురువారం వరకు ఆత్మకూరు(ఎం)లో  19 సెంటీమీటర్ల వాన కురవగా.. అడ్డగూడూరు 18.7, ఆలేరులో 14.5, మోత్కూరులో 13.1, గుండాల, మోటకొండూరులో  12, యాదగిరిగుట్టలో 8.8, మిగిలిన మండలాల్లో 3 నుంచి 7 సెంటీమీటర్ల వర్షం పడింది.