- కామారెడ్డి జిల్లాలో బడి బాటలో ఇప్పటికే 2,501 స్టూడెంట్స్ చేరిక
- మూత పడిన స్కూల్స్ తిరిగి తెరిపించేందుకు విద్యాశాఖ ఆఫీసర్ల చర్యలు
- 8 ఏండ్లకు తెరుచుకున్న తిమ్మక్‌పల్లి(జి) లో ప్రైమరీ స్కూల్
కామారెడ్డి , వెలుగు : కామారెడ్డి జిల్లాలో జిరో ఎన్ రోల్ మెంట్ ఉండి గతంలో మూతపడిన స్కూల్స్ తెరిపించే పనిలో విద్యాశాఖ ఆఫీసర్లు నిమగ్నమయ్యారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి ప్రతి పంచాయతీలో బడి ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. జీరో ఎన్‌రోల్‌మెంట్‌తో కామారెడ్డి జిల్లాలోని గ్రామాలు, తండాల్లో 45 ప్రైమరీ స్కూల్స్ మూతపడ్డాయి. అయితే ఇప్పటికే జిల్లాలో మూతపడిన కామారెడ్డి మండలం తిమ్మక్ పల్లి (జి) ప్రైమరీ స్కూల్ ను తెరిపించారు.
మరిన్ని స్కూల్స్ ఓపెన్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే తిమ్మక్ పల్లి గ్రామంలో స్కూల్ రీఓపెన్ కావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న గర్గుల్ గ్రామంలో ఉన్న స్కూల్ కు స్టూడెంట్స్ నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చేదన్నారు. వర్షాకాలం తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవని పేర్కొన్నారు.
బడిబాటతో పెరుగుతున్న అడ్మిషన్లు
ప్రభుత్వ బడులను బలోపేతం చేయటంపై సర్కారు ఇప్పటికే చర్యలు చేపట్టింది. బడి బాట ద్వారా స్టూడెంట్స్‌ను స్కూల్స్‌లో ఎక్కువ సంఖ్యలో చేర్పించేలా ప్రయత్నిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటికే బడి బాట పోగ్రాంలో 2,501 మంది స్టూడెంట్స్ చేరారు. జిల్లాలో 990 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ప్రైమరీ 684, యూపీఎస్ 124 , హైస్కూల్స్ 182 ఉండగా.. వీటిలో 73,959 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు.
జీరో ఎన్‌రోల్‌మెంట్‌తో మూత పడి
జిల్లాలో ప్రైమరీ స్కూళ్లు మూతపడగా.. ఇక్కడ ఉండే అతి తక్కువ మంది స్టూడెంట్స్ సమీప గ్రామాల్లోని స్కూల్స్‌కు వెళుతున్నారు. కొందరు ప్రైవేట్ స్కూల్స్‌లో చదువుతున్నారు. ప్రైవేట్ స్కూల్స్‌లో తమ పిల్లల్ని చేర్పించే స్థోమత లేని తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ప్రతి పంచాయతీలో బడి ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి విద్యా శాఖ ఆఫీసర్లను ఆదేశించడంతో గతంలో మూతపడిన స్కూల్స్‌ను కూడా తిరిగి తెరిపించేందుకు విద్యా శాఖ ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు జిల్లాలో స్కూల్స్ లేని పంచాయతీల్లో కొత్తగా 3 స్కూల్స్ ప్రారంభం కానున్నాయి.
ఎక్కడెక్కడ ఏర్పాటంటే..
సదాశివనగర్ మండలం దగ్గి, ఎల్లారెడ్డి మండలం మల్కాపల్లి, జుక్కల్ మండలం మధురతండాలో ప్రైమరీ స్కూల్ ఏర్పాటు కానున్నాయి. బడి బాట పోగ్రాం ద్వారా స్టూడెంట్స్‌ను సర్కారు బడుల వైపు ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రుల వద్దకు వెళ్లి సర్కారు బడుల్లో చదవటం ద్వారా కలిగే ప్రయోజనాలు, వసతుల గురించి వివరిస్తున్నారు.
జిల్లాలో ఇప్పటికే 50 వేల మంది స్టూడెంట్స్‌కు యూనిఫాం అందించారు. మిగతా వారికి 2, 3 రోజుల్లో అందజేస్తారు. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా మౌలిక వసతులు కల్పించేందుకు పనులు చేపట్టారు. తాగునీటి సౌకర్యం, టాయిలెట్స్, చిన్న పాటి రిపేర్లు చేస్తున్నారు.
సర్కారు బడుల్లో ఎక్కువ మంది చేరేలా చూస్తున్నాం
బడిబాట ద్వారా సర్కారు స్కూల్స్‌లో ఎక్కువ మంది స్టూడెంట్స్ చేరేలా చూస్తున్నాం. గతంలో జీరో ఎన్రోల్మెంట్ ఉన్న స్కూల్స్‌లో స్టూడెంట్స్ వచ్చి అడ్మిషన్లు తీసుకుంటే వాటిని తిరిగి ఓపెన్ చేయిస్తాం. మెరుగైన విద్య బోధన అందిస్తాం.
-
రాజు డీఈవో కామారెడ్డి