బార్లు ముద్దు..  బడులు వద్దా?

బార్లు ముద్దు..  బడులు వద్దా?
  • పర్మిషన్ ఇస్తే బడులను బార్లుగానైనా మార్చుకొని బతుకుతం
  • అప్పుడు సర్కార్​కూ ఆమ్దానీ వస్తది
  • బడ్జెట్​ ప్రైవేట్  స్కూల్స్​ మేనేజ్​మెంట్లు, టీచర్ల ఆవేదన
  •  రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు
  • స్కూళ్లు ఓపెన్​ చేయాలని డిమాండ్​
  • లేకపోతే 30 నుంచి నిరాహార దీక్షలు చేపడ్తామని హెచ్చరిక


హైదరాబాద్/నెట్ వర్క్, వెలుగు: ‘‘పర్మిషన్ ఇస్తే బడులను బార్లుగా మార్చుకొని బతుకుతం. అప్పుడు ప్రభుత్వానికి కూడా ఆమ్దానీ వస్తది. స్కూళ్లు నడవడం, పిల్లలు చదువుకోవడం గవర్నమెంట్​కు ఇష్టం లేనట్టుంది. కనీసం బడ్జెట్​ ప్రైవేట్​ స్కూళ్లను బార్లుగా కన్వర్ట్ చేసుకోడానికి అయినా అనుమతించాలి” అంటూ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముందు ప్లకార్డులు పట్టుకుని బడ్జెట్ (చిన్న)  ప్రైవేట్ స్కూల్స్​ మేనేజ్​మెంట్లు నిరసనలు చేపట్టాయి. ‘సేవ్​ ఎడ్యుకేషన్​.. సేవ్​ టీచర్స్’​ అంటూ నిదాదాలు చేశాయి. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లను మూసేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రికగ్నైజ్‌‌ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) ఆధ్వర్యంలో ధర్నాలు జరిగాయి. ఇందులో బడ్జెట్ ప్రైవేట్​ స్కూల్స్​ యజమానులు, టీచర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలెక్టరేట్ల ముందు ఆందోళనలకు దిగారు.  వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని స్కూళ్లను ఓపెన్ చేసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని, లేకపోతే బడులను బార్లుగా మార్చుకోడానికైనా అనుమతి ఇవ్వాలని వాళ్లు డిమాండ్ చేశారు. స్కూళ్ల మూసివేతతో ప్రైవేట్ స్కూళ్ల మేనేజ్మెంట్లు, టీచర్లు రోడ్డునపడ్డారని, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయానికి అందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్కూళ్లు తెరవకపోతే ఈ నెల 30 నుంచి నిరాహార దీక్షలు చేపడుతామన్నారు. ‘‘గురు దక్షిణ ఫర్ టీచర్స్, బ్రిడ్జ్ ది లెర్నింగ్ లాస్, సేవ్ బడ్జెట్ ప్రైవేట్​ స్కూల్స్, కిడ్స్ ఆర్ ఇన్ ఎడ్యుకేషన్ క్రైసిస్’’​ వంటి ప్లకార్డులు పట్టుకుని రోడ్లపై కూర్చుని నినాదాలు చేశారు. హైదరాబాద్ కలెక్టరేట్, రంగారెడ్డి కలెక్టరేట్, గన్ పార్క్ వద్ద వందల మంది ట్రస్మా సభ్యులు ఆందోళనకు దిగారు. 


ఎన్ని ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోరా?

హైదరాబాద్​తో పాటు రాష్ట్రంలోని దాదాపు అన్ని బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్లు అద్దె బిల్డింగ్స్​లోనే ఉన్నాయి. ఏడాది కాలంగా వాటి రెంట్లు, వాటర్ బిల్లులు, కరెంట్ బిల్లులు కట్టలేక మేనేజ్మెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం నెలరోజులు మాత్రమే స్కూళ్లు తెరిచి మళ్లీ మూసేయడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూళ్లు నడపాలా? లేక మూసేసుకోవాలా? అని స్కూల్స్​ మేనేజ్మెంట్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. బార్లమీద ఉన్న శ్రద్ధలో కొంచెమైనా స్కూళ్ల మీద లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. లాక్​డౌన్​ టైంలో తమతోపాటు టీచర్లు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని, స్కూళ్లను తెరిచినట్లే తెరిచి మళ్లీ మూసేయడం ఏమిటని మేనేజ్మెంట్లు మండిపడుతున్నాయి. లాక్ డౌన్ నుంచి ఇప్పటివరకు బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్లు ఆర్థికంగా చితికిపోయాయని, దాదాపు 3వేలు మూతబడ్డాయని ట్రస్మా అడ్వయిజర్ మధుసూదన్ అన్నారు. స్కూళ్లు క్లోజ్ చేయడం వల్ల టీచర్లు రోడ్డున పడ్డారని, దీనమైన స్థితిలో ఉన్నారని 
ఆవేదన వ్యక్తం చేశారు.  
 
స్కూళ్లు నడవడం ఇష్టం లేదా?


వచ్చే నెలంతా ఎగ్జామ్స్ ఉంటాయి. వేరే రాష్ట్రాల పిల్లలు స్కూల్ కు వెళ్తుంటే, ఇక్కడనేమో ఇంట్లో కూర్చుంటున్నారు. ఆ రాష్ట్రాల పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ముందుంటారు. మరి తెలంగాణ పిల్లల పరిస్థితి ఏంటి? మేం మా స్కూళ్లను బార్ అండ్ రెస్టారెంట్లుగా మార్చుకుంటం.. పర్మిషన్ ఇవ్వండి. గవర్నమెంట్ కి స్కూళ్లు నడవడం ఇష్టం లేనట్టుంది. 
- అగస్టీన్​, బడ్జెట్ ప్రైవేట్​ స్కూల్​ టీచర్, హైదరాబాద్​


రిటైర్మెంట్​ ఏజ్​ పెంపుపై నిరసనలు రావొద్దనే బంద్​ పెట్టిన్రు


ప్రభుత్వానికి ఆదాయం వచ్చే సంస్థలన్నీ నడిపిస్తున్నరు.  ఖర్చు పెట్టే  సంస్థల్ని మూసేసి స్టూడెంట్లను చదువుకు దూరం చేస్తున్నరు.  రిటైర్మెంట్ ఏజ్​ను 61 ఏండ్లకు పెంచడంతో స్టూడెంట్​ యూనియన్లు, నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందనే స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లు బంద్  చేశారు. హాస్టళ్లను ఖాళీ చేయించి స్టూడెంట్లను తరిమికొట్టారు. ఎక్కడా నిరసన కార్యక్రమాలు జరగకుండా ప్రభుత్వం వేసిన పక్కా ప్లాన్ ఇది.         - ఎస్.శ్రీనివాస్ రెడ్డి, చీఫ్​ అడ్వయిజర్​, ట్రస్మా

వెంటనే ఓపెన్ చేయాలి
బార్లు, వైన్స్​, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, థియేటర్లు నడుస్తున్నాయి​.. కేవలం విద్యాసంస్థలనే ఎందుకు మూసేశారు? పక్క రాష్ట్రం ఏపీలో  కేజీ నుంచి పీజీ వరకు అన్ని విద్యాసంస్థలు నడుస్తున్నాయి. అక్కడ అకడమిక్ ఇయర్‌‌‌‌‌‌‌‌ను  మే వరకు పొడిగించారు. మన దగ్గర  పిల్లలు అన్యాయానికి గురవుతున్నారు. ప్రభుత్వం స్కూళ్లను రీఓపెన్ చేయకపోతే మార్చి 30 నుంచి నిరాహార దీక్షకు కూర్చుంటాం.        - ఎస్. మధుసూదన్ , అడ్వయిజర్​, ట్రస్మా
 
సర్కార్​ నుంచి సపోర్టు లేదు


అడ్మిషన్లు, ఫీజుల కలెక్షన్ లేక జీతాలు ఇవ్వలేకపోతున్నాం. మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. ఎంతో ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వం ఎలాంటి మాఫీలు అమలు చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేనేజ్మెంట్లు జీతాలు ఇవ్వలేకపోతున్నాయి.            - దీపికా రెడ్డి, హెచ్ ఎం, సెయింట్ మార్క్స్ ప్రొగెస్సివ్ స్కూల్, సికింద్రాబాద్