
- మూసీ నీటి పంటలతో క్యాన్సర్ ముప్పు
- పిల్లలకు, యూత్‌కే రిస్క్ ఎక్కువ
- ఎన్జీఆర్ఐ, జేఎన్టీయూ అధ్యయనంలో వెల్లడి
- గౌరెల్లి, తిమ్మయ్యగూడ, కుత్బుల్లాపూర్,
- పసమాములలో శాంపిళ్లు సేకరణ
- మూసీ నీళ్లలో, ఆ పంటల్లో సీసం ఎక్కువని నిర్ధారణ
- భూగర్భజలాలు, సాగు భూముల్లోనూ కాలుష్యం
- నత్తనడకన మూసీ ప్రక్షాళన.. శుద్ధి తక్కువ, మురుగు ఎక్కువ
హైదరాబాద్, వెలుగు : మూసీ నది నీళ్లతో పండిన పంటలతో క్యాన్సర్ మోపైతదని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా పిల్లలు, యుక్త వయసుకు వచ్చిన వారికే ఆ ముప్పు ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఎన్జీఆర్ఐ), జేఎన్టీయూ సైంటిస్టులు కలిసి చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
‘‘పట్టణాల్లోని వ్యర్థ జలాల పునర్వినియోగంతో నీటి వనరులు, వ్యవసాయం, పర్యావరణ సమతుల్యతపై ప్రభావం: మూసీ పరివాహక ప్రాంతాల్లో కేస్ స్టడీ’’ పేరిట వీరు నిర్వహించిన పరిశోధన వివరాలు ఇటీవల ‘హైడ్రో రీసెర్చ్’ అనే జర్నల్‌లో పబ్లిష్ అయ్యాయి. మూసీ నీళ్లు, ఆ నీళ్లతో పండే పంటల్లో కేన్సర్‌కు కారణమయ్యే లెడ్ (సీసం మూలకం), ఇతర భార లోహాలు అధిక స్థాయిల్లో ఉన్నాయని సైంటిస్టులు గుర్తించారు. దీర్ఘకాలం పాటు పొలాల్లో ఇవి పేరుకుపోతే ఆరోగ్యానికి చేటు చేస్తాయని వారు హెచ్చరించారు. సాగు భూమి, పంటలే కాదు.. భూగర్భజలాల్లోకి కూడా ఈ హానికారక రసాయనాలు చేరుతున్నాయని తెలిపారు.
100 ఎకరాలు.. 4 ఊర్లు.. 4 ఏండ్లు
మూసీ నది పారే గౌరెల్లి, తిమ్మయ్యగూడ, కుత్బుల్లాపూర్, పసుమాముల గ్రామాలను సైంటిస్టులు స్టడీ కోసం ఎంచుకున్నారు. 1991 నుంచి మూసీ వ్యర్థ జలాలతోనే అక్కడ పంటలు పండిస్తుండటంతో ఆయా ప్రాంతాల్లోని వంద ఎకరాల సాగు భూమిపై, పంటలపై, మూసీ నీళ్లపై స్టడీ చేశారు. 2014, 2016, 2017, 2020 సంవత్సరాల్లో నది నీళ్లు, భూగర్భ జలాలు, నేల, పంటల(వడ్లు, పశుగ్రాసం) శాంపిళ్లను సేకరించారు. పంటల కాలం మొదలవడానికి ముందు మే నెలలో ఒకసారి.. సీజన్ మొదలయ్యాక అక్టోబర్‌లో మరోసారి శాంపిల్స్ తీసుకున్నారు. వాటిలో జింక్, క్రోమియం, లెడ్, మాంగనీస్, నికెల్, కాపర్ మూలకాలతో సహా నీటిలో బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్(బీవోడీ), కెమికల్ ఆక్సిజన్ డిమాండ్(సీవోడీ) పరిమాణాన్ని విశ్లేషించారు.
పడిపోయిన ఆక్సిజన్ లెవెల్స్
మూసీ నీళ్లలో 2014, 2016, 2017లో బీవోడీ స్థాయిలు యునైటెడ్ స్టేట్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (యూఎస్‌ఈపీఏ) నిర్ణయించిన పారామీటర్స్ కన్నా ఎక్కువగా ఉన్నాయని స్టడీలో సైంటిస్టులు తేల్చారు. మరోవైపు డిజాల్వ్డ్ ఆక్సిజన్ (డీవో) స్థాయిలు తక్కువగా ఉన్నాయని.. ఫాస్ఫరస్, నైట్రోజన్‌తో బతికే ఆల్గే(నాచు) ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణమై ఉంటుందని గుర్తించారు. భూగర్భ జలాల్లోనూ డీవో స్థాయిలు తగ్గాయని గుర్తించారు. మరోవైపు సీవోడీ స్థాయిలు కూడా యూఎస్‌ఈపీఏ నిర్దేశించిన పరిమితి కన్నా ఎక్కువగా ఉన్నాయని, పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలే దానికి కారణమని తేల్చారు. మూసీలో లెడ్ స్థాయిలు డబ్ల్యూహెచ్‌వో నిర్దేశించిన లిమిట్ కన్నా ఎక్కువగా ఉన్నట్టు స్టడీలో తేలింది. నదిలో బ్యాటరీలను డంప్ చేయడంవల్లే లెడ్ స్థాయిలు పెరగి ఉండొచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. దీర్ఘకాలంలో ఈ నీటినే వాడితే భూగర్భజలాలు, పంట నేలల్లో లెడ్ భారీగా పేరుకుపోతుందంటున్నారు. పంటల ఎదుగుదల తగ్గడంతో పాటు తినే ఆహారంలోకి సీసం ఆనవాళ్లు చేరుతాయని అంటున్నారు. భూగర్భజలాల్లో లవణ శాతం పెరుగుతున్నదని నిర్ధారించారు. కార్బన్, నైట్రోజన్ లెవెల్స్ కూడా పరిమితికి మించి ఉన్నాయంటున్నారు.
తిండి.. చర్మం ద్వారా ఒంట్లోకి
మూసీ నీళ్లతో పండించిన పంటలు, కూరగాయలు తినడం వల్ల లెడ్ వంటి భార లోహాలు నేరుగా మన శరీరంలోకి ప్రవేశిస్తాయని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ నీళ్లను వాడితే చర్మం ద్వారా కూడా బాడీలోకి కాలుష్య కారకాలు వెళతాయని అంటున్నారు. పెద్దవాళ్లకు ముప్పు తక్కువే అయినా.. చిన్నపిల్లలు, యుక్త వయసు వారికి రిస్క్ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఈ కెమికల్స్‌కు వారు త్వరగా రియాక్ట్ అవ్వడమే అందుకు కారణమన్నారు. రిస్క్ స్థాయి ‘లో టు మోడరేట్(తక్కువ నుంచి మధ్యస్తం వరకు)’ ఉండొచ్చన్నారు.
మూసీ ప్రక్షాళన ఎప్పుడో..
మూసీలోని మురుగు నీరు మొత్తాన్ని ఈ ఏడాది జులై నాటికల్లా శుద్ధి చేస్తామంటూ మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రకటించారు. పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. మూసీలో ఎక్కడికక్కడ మురుగునీరే పారుతున్నది. హైదరాబాద్ సిటీలో రోజూ 1300 ఎంఎల్ డీల మురుగు నీరు ఉత్పత్తి అవుతుండగా.. 600 ఎంఎల్డీల నీటినే శుద్ధి చేసి మూసీలోకి వదులుతున్నారు. డ్రైనేజీ నీళ్లతో పాటు పరిశ్రమల నుంచీ వ్యర్థ జలాలు భారీగా మూసీలో కలుస్తున్నాయి. శుద్ధి చేసేందుకు 31సీవరేజీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించినా.. ఇప్పటివరకు అవి ఏర్పాటు కాలేదు.