మమతా బెనర్జీ మాతోనే ఉంది​ : రాహుల్​ గాంధీ

మమతా బెనర్జీ మాతోనే ఉంది​ : రాహుల్​ గాంధీ

బహరాంపూర్(బెంగాల్): సీట్ల పంపకాలపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)తో చర్చలు జరుగుతున్నాయని కాంగ్రెస్ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీ తెలిపారు. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా గురువారం రాత్రి పశ్చిమ బెంగాల్ లోని బహరాంపూర్ లో పార్టీ ‘డిజిటల్ మీడియా వారియర్స్’తో రాహుల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటును కూడా కాంగ్రెస్ కు ఇచ్చేందుకు మమతా బెనర్జీ ఆసక్తి చూపకపోయినప్పటికీ, ఆమెకు ఎందుకంతా ప్రాధాన్యం ఇస్తున్నారని కార్యకర్తలు ప్రశ్నించారు. దీనికి రాహుల్ జవాబిస్తూ.. ‘‘ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చినట్టు మమతా బెనర్జీ ఎక్కడా చెప్పలేదు. కూటమిలో ఉన్నామనే ఆమె చెబుతున్నారు. సీట్ల పంపకాలపై రెండు వైపుల నుంచి చర్చలు జరుగుతున్నాయి. అవి త్వరలోనే కొలిక్కి వస్తాయి” అని తెలిపారు.  

అలాంటోళ్లు పార్టీలో ఉంటే వెళ్లిపోండి.. 

పార్టీ ఫిరాయింపులపై రాహుల్ స్పందించారు. హిమంత బిశ్వ శర్మ, మిలింద్ దేవ్ రా లాంటి నాయకులు ఇంకెవరైనా కాంగ్రెస్ లో ఉంటే.. పార్టీని విడిచి వెళ్లాలని సూచించారు. 2014 లోక్ సభ ఎన్నికలకు ముందు హిమంత బిశ్వ శర్మ బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీ నుంచి అస్సాం సీఎంగా ఉన్నారు. అలాగే పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద్, సునీల్ జాఖర్, హార్దిక్ పటేల్, ఆర్పీఎన్ సింగ్ తదితరులు కాంగ్రెస్ ను వీడారు. తాజాగా మిలింద్ దేవ్ రా శివసేనలో చేరారు. ఈ నేపథ్యంలో రాహుల్ ఈ కామెంట్లు చేశారు. కాగా, రాహుల్ యాత్ర శుక్రవారం బెంగాల్​లోని ముర్షీదాబాద్ నుంచి ప్రారంభమైంది. టెన్త్ పరీక్షల పేరుతో అధికారులు యాత్రను అడ్డుకున్నారని, పర్మిషన్ నిరాకరించారని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి మండిపడ్డారు.