అదృష్టం-దురదృష్టం: వాళ్లు సీట్లు మార్చుకున్నారు.. వీళ్లేమో..

అదృష్టం-దురదృష్టం: వాళ్లు సీట్లు మార్చుకున్నారు.. వీళ్లేమో..

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో అత్యంత ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న సంగతి విదితమే. ఈ విషాదకర ఘటనలో 275 మంది మృత్యువాత పడగా.. 1,100 మందికి పైగా గాయపడ్డారు. ఇదిలావుంటే ఈ ప్రమాదంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న తండ్రీ కూతురు చివరి క్షణంలో ప్రాణాలతో బయటపడ్డారు. బాలిక విండో సీట్ కావాలని పట్టుబడటమే వారి ప్రాణాలు కాపాడింది. 

తండ్రి, అతని ఎనిమిదేళ్ల కుమార్తెతో కలిసి ఖరగ్‌పూర్‌లో రైలు ఎక్కారు. అయితే బాలిక విండో సీట్ కావాలని పట్టుబడటంతో.. వారు అదే రైలులో ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికులను ఒప్పించి సీట్లు మార్చుకున్నారు. అదే వారి ప్రాణాలు నిలిపింది. తండ్రీకూతురు ప్రయాణిస్తున్న కోచ్ పెద్దగా దెబ్బతినకపోగా.. వారు రిజర్వ్ చేసుకున్న కోచ్ మాత్రం ముద్దముద్దగా మారిపోయింది.

"మా వద్ద విండో సీటు టికెట్ లేదు. కానీ మా పాప విండో సీట్ కావాలని పట్టుబడటంతో టీసీని అడిగాం. అతను.. వీలైతే ఇతర ప్రయాణీకులతో మా సీట్లు మార్చుకోమని సూచించారు. అప్పుడు మేము మరొక కోచ్ వద్దకు వెళ్లి ఇద్దరు వ్యక్తులను అడిగాం. వారు అందుకు అంగీకరించారు. అప్పుడు మేము వారి సీట్లలో కూర్చున్నాం.. వారు మేము రిజర్వేషన్ చేసుకున్న బోగీలో కూర్చున్నారు. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాం. కానీ మాతో సీట్లు మార్చుకోవడానికి అంగీకరించిన ఇద్దరు ప్రయాణికులు ఎలా ఉన్నారన్నది తెలియదు. వారు క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాము.." అని ఆ తండ్రి తెలిపాడు. కాగా, ఈ ఘటనలో బాలికకు స్వల్ప గాయాలయ్యాయి.