ఆర్టీసీ బస్సుల్లో సీట్లు లేక మహిళల పరేషాన్​

ఆర్టీసీ బస్సుల్లో సీట్లు లేక మహిళల పరేషాన్​
  •     గంటల కొద్దీ స్టాండింగ్ జర్నీతో అవస్థలు 
  •     కూర్చున్న చోటు నుంచి లేవని జెంట్స సీటు అడిగితే గొడవలు
  •     లేడీస్​ నిల్చుంటే కండక్టర్లపై యాక్షన్ తీసుకుంటామన్న మేనేజ్​మెంట్​

మంచిర్యాల, వెలుగు: ‘స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం... వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం’ ఈ స్లోగన్​ ఆర్టీసీ బస్సుల్లో రాతలకే పరిమితమవుతోంది. బస్సుల్లో లేడీస్​కి కేటాయించిన సీట్లను జెంట్స్​ఆక్రమించుకోవడం, మహిళలు అవస్థలు పడుతూ నిల్చోవడం తరచూ చూస్తుంటాం. ఒకవేళ ఎవరినైనా సీటు ఇయ్యమని అడిగితే గొడవలు కూడా జరుగుతుంటాయి. కండక్టర్లు కూడా మాకెందుకు అన్నట్టు చూస్తూ తమ సీట్లో తాము కూర్చుంటారు. ఇక మీదట ఇలా జరగడానికి వీల్లేదంటోంది ఆర్టీసీ మేనేజ్​మెంట్​. లేడీస్​కి రిజర్వ్​ చేసిన సీట్లలో జెంట్స్​ కూర్చుంటే ఖాళీ చేయించి మహిళలను కూర్చోబెట్టాల్సిన బాధ్యత కండక్టర్లకు అప్పగించింది. ఒకవేళ కండక్టర్లు పట్టించుకోకుంటే యాక్షన్​ తీసుకుంటామని వార్నింగ్​ కూడా ఇచ్చింది. మొత్తానికి లేడీస్​ సీట్ల గొడవ తమ మెడకు చుట్టుకుందని కండక్టర్లు అంటున్నారు. ప్యాసింజర్లు మహిళలకు సీట్లిస్తే తమకు ఇబ్బంది ఉండదంటున్నారు.  

కదలనే కదలరు... 

ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్ ​వెనుక నుంచి రైట్​సైడ్​ సీట్లు లేడీస్​కు కేటాయించి ఉంటాయి. అది తెలిసే విధంగా సీట్ల వెనుక ‘స్ర్తీలు’ అని రాసి ఉంటుంది. కానీ వీటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ముందుగా ఎవరు బస్సెక్కి కూర్చుంటే వాళ్లదే సీటు అన్నట్టు వ్యవరిస్తుంటారు. రష్​ ఎక్కువగా ఉన్నట్లయితే బయటినుంచే విండో తెరిచి కర్చిఫ్​ గాని, టవల్​ గాని సీట్లో వేసి ఆపుకుంటారు. అందులో ఎవరైనా కూర్చుంటే గొడవలు జరిగిన సందర్భాలెన్నో ఉన్నాయి. బస్సులో సీట్లు నిండిపోతే లేడీస్,​   పిల్లలను ఎత్తుకొని గంటలకొద్దీ నిల్చున్నా సరే ఒక్కరు కూడా కదలరు.  

స్టాండింగ్​ జర్నీ అవస్థలెన్నో...

మంచిర్యాలలో ఉండే ఒక లేడీ టీచర్​ చెన్నూర్​ మండలంలోని ఓ స్కూల్​కు డెయిలీ బస్సులో అప్​ అండ్​ డౌన్​ చేస్తోంది. ముప్పావు గంట నుంచి గంట వరకు ఈ ప్రయాణం ఉంటుంది. పొద్దున్నే హడావిడిగా ఇంట్లో పనులు చేసుకొని బస్టాండ్​కు వస్తే సీట్లు దొరకవు. పొద్దంతా స్కూల్​లో నిల్చుండి పిల్లలకు క్లాస్​లు చెప్పి అలసిపోతుంది. సాయంత్రం వచ్చేటప్పుడు కూడా నిలబడే రావాలి. ఈమెలాగే రోజూ వందల మంది టీచర్లు, స్టూడెంట్లు, ఎంప్లాయీస్​ నలబై..యాబై కిలోమీటర్లు బస్సుల్లో నిలబడే జర్నీ చేస్తుంటారు. వివిధ పనుల కోసం పల్లెల నుంచి టౌన్లకు రోజూ ఎంతోమంది మహిళలు వచ్చిపోతుంటారు. కానీ, వీరిలో చాలామందికి కూర్చునేందుకు సీట్లు దొరకడం లేదు. లేడీస్​ సీట్లలో కూర్చుంటున్న జెంట్స్ వీరు వస్తే లేవడం లేదు. పిల్లల తల్లులు బస్సెక్కి నిల్చున్నా జాలి చూపరు. అలాగే సీనియర్​ సిటిజన్స్, ఫిజికల్​హ్యాండీకాప్డ్​ సీట్లలోనూ పాగా వేస్తున్నారు. నిల్చున్న వాళ్లను తాకడానికి ట్రై చేసే ఆకతాయిలు ఎప్పుడూ ఉండనే ఉంటారు. ఈ కష్టాల మధ్య లేడీస్ ​స్టాండింగ్​జర్నీ చేస్తూ నెట్టుకొస్తున్నారు.  

ఆ బాధ్యత కండక్టర్లదే... 

బస్సుల్లో లేడీస్​ సీట్లను జెంట్స్​ఆక్రమించుకుంటే ఆ సీట్లను ఖాళీ చేసి మహిళలను కూర్చోబెట్టాల్సిన బాధ్యతను ఆర్టీసీ మేనేజ్​మెంట్​ కండక్టర్లకు అప్పగించింది. సీట్లు ఖాళీగా ఉన్నప్పుడు ఎవరైనా కూర్చోవచ్చు కానీ జెంట్స్​కూర్చొని లేడీస్​ నిల్చుంటే మాత్రం కండక్టర్లు స్పందించాలని ఆదేశించింది. కొంతమంది కండక్టర్లు స్టార్టింగ్​పాయింట్​వద్ద లేడీస్ సీట్లలో మహిళలనే కూర్చునే విధంగా చూస్తున్నారు. కానీ బస్​ కదిలిన తర్వాత మధ్యలో లేడీస్​ఎక్కితే సీట్లు దొరకడం లేదు. వారికి కేటాయించిన సీట్లలో కూర్చున్న వాళ్లను లేవాలని అడిగితే  ‘ఎందుకు లేవాలె... మేము ముందు కూర్చున్నాం. మేము టికెట్​ తీసుకున్నాం కదా’ అంటూ గొడవకు దిగుతున్నారని కండక్టర్లు చెప్తున్నారు. మరోవైపు ఎవరైనా లేడీస్​ తమకు సీట్లు లేవని కంప్లయింట్ ​వస్తే కండక్టర్లపై యాక్షన్​ తీసుకుంటామని మేనేజ్​మెంట్​ వార్నింగ్​ ఇవ్వడంతో ఏం చేసేదని వాపోతున్నారు. 

కష్టమవుతోంది 

బస్సుల్లో ఉండే లేడీస్ సీట్లలో జెంట్స్​కూర్చుంటున్నారు.  పిల్లలు, ముసలివాళ్లు నిల్చున్నా పట్టించుకోవడం లేదు.  కండక్టర్లకు చెప్పినా స్పందించడం లేదు. గొంటల కొద్దీ స్టాండింగ్​ జర్నీ కష్టమవుతోంది.  
- సునీత, ప్యాసింజర్​

గొడవకు దిగుతున్నరు.. 

లేడీస్​కు కేటాయించిన సీట్లలో వాళ్లను కూర్చోమని చెప్తున్నాం. స్టార్టింగ్​ పాయింట్​లో జెంట్స్​ కూర్చుంటే వాళ్లను లేపి లేడీస్​ను కూర్చోబెడు తున్నాం. తర్వాత స్టేజీలో ఎక్కేవాళ్లు, దిగేవాళ్లను చూసుకోవడం, టికెట్లు కొట్టడమే సరిపోతుంది. ఒకవేళ లేడీస్​ సీట్లలోంచి ఎవరినైనా లేవాలని చెప్తే వినిపించుకోవట్లే.  
- మల్లేశం, కండక్టర్​ 

ప్యాసింజర్లు సహకరించాలె..

బస్సుల్లో సీట్లు ఖాళీగా ఉన్నప్పుడు ఎవరైనా కూర్చోవచ్చు. లేడీస్​ నిల్చున్నప్పుడు మాత్రం తప్పకుండా లేచి సీటు ఇచ్చి గౌరవించాలె. లేడీస్, ముసలివాళ్లు, పిల్లలకు సీట్లు లేనప్పుడు వారిని కూర్చోబెట్టాలి. ఈ విషయంలో మేల్​ ప్యాసింజర్లు అర్థం చేసుకొని సహకరించాలె. ఆర్టీసీ మేనేజ్​మెంట్​కు కంప్లయింట్​ చేస్తే కండక్టర్లపై యాక్షన్​ తీసుకుంటామనడం సరికాదు.  
‌‌‌‌- గోలి శంకర్, ఈయూ డిపో సెక్రెటరీ