యాసంగికి సన్నద్ధం..!..నల్గొండ జిల్లాలో 6.57 లక్షలు ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో , 5.19 లక్షల ఎకరాల్లో సాగు అంచనా

యాసంగికి సన్నద్ధం..!..నల్గొండ జిల్లాలో 6.57 లక్షలు ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో , 5.19 లక్షల ఎకరాల్లో సాగు అంచనా
  •     రెండు జిల్లాలో వరి వైపే మొగ్గు 
  •     నల్గొండ జిల్లాలో 1.20 క్వింటాళ్లు,  సూర్యాపేట జిల్లాలో 99  వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం  
  •     ప్రభుత్వానికి రిపోర్ట్ అందించిన అధికారులు

నల్గొండ, వెలుగు:  నల్గొండ, సూర్యాపేట జిల్లాలో యాసంగిలో ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు కానున్నాయో వాటికి అవసరమైన విత్తనాలు, ఎరువుల అంశాలకు సంబంధించి ప్రణాళికను వ్యవసాయ శాఖ అధికారులు ఖరారు చేశారు. నల్గొండ జిల్లాలో 6.57లక్షలు, సూర్యాపేట జిల్లాలో 5.19లక్షల ఎకరాల్లో సాగు అంచనా వేయగా ఇందులో అత్యధికంగా వరి ఉండనుంది. 

ఇప్పటికే పత్తి తీత పనులతో పాటు వరి కోతలు ప్రారంభమయ్యాయి. మరో నెల రోజుల్లో యాసంగి సీజన్‌‌‌‌ పనులను రైతులు ప్రారంభించనుండడంతో అందుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాల్సిందిగా జిల్లా వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది.

నల్గొండ జిల్లాలో 6.57 లక్షల ఎకరాలు 

నల్గొండ జిల్లాలో 6,57,229 ఎకరాల్లో యాసంగి సాగు అవుతుందని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా వరి 5,64,679 ఎకరాల్లో సాగు కానుందని ఆఫీసర్లు అంచనా వేశారు.  గత యాసంగి సీజన్ లో 5,53,559 ఎకరాల్లో వరి సాగు చేశారు. వేరు శనగ 22,180 ఎకరాలు, జొన్న 1400 ఎకరాలు, పెసర 1100 ఎకరాలు, మొక్క జొన్న 825 ఎకరాలు, ఇతర పంటలు 850 ఎకరాల్లో సాగు కానుంది. ఈ పంటల సాగుకు మొత్తంగా 1,20,850  క్వింటాల విత్తనాలు అవసరం అవుతాయని అధికారులు లెక్కలు వేశారు. ఇక ఎరువులు 1,62,199 మెట్రిక్‌‌‌‌ టన్నులు కావాల్సి ఉంది.

సూర్యాపేట జిల్లాలో 5.19 లక్షల ఎకరాలు

సూర్యాపేట జిల్లాలో ఈ యాసంగిలో దాదాపు 5,19,220 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు అవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.  గతేడాది వరి 4,98,068 ఎకరాల్లో సాగు కాగా.. ఈ సారి 4,96,100 ఎకరాల్లోనే వరి సాగు కానున్నట్లు అధికారులు భావిస్తున్నారు. మొక్కజొన్న 1360 ఎకరాల్లో, పెసర 175 ఎకరాలు, వేరుశనగ 455 ఎకరాలు, చెరుకు 110 ఎకరాలు, మిర్చి 150 ఎకరాల్లో సాగు కానుంది. 

ఈ పంటల సాగుకు మొత్తంగా 99,650.8 క్వింటాల విత్తనాలు అవసరం అవుతాయని అధికారులు లెక్కలు వేశారు. ఇందులో వరి విత్తనాలే 99,220 క్వింటాలు ఉండనున్నాయి. ఇక ఎరువులు 1,58,216 మెట్రిక్‌‌‌‌ టన్నులు కావాల్సి ఉంది. అయితే కేవలం 15,130.722 మెట్రిక్‌‌‌‌ టన్నులే జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. 

యాదాద్రిలో 3.12 లక్షల ఎకరాల్లో వరి సాగు

యాదాద్రి, వెలుగు:  యాదాద్రి జిల్లాలో 6 లక్షల ఎకరాలకు పైగా భూమి సాగుకు అనువుగా ఉంది. యాసంగి సీజన్​లో వరి 3,12,500  ఎకరాల్లో సాగు అవుతుందని యాక్షన్​ ప్లాన్ రూపొందించారు. గతేడాది యాసంగి సీజన్లో అంచనాలకు మించి 2,86,257 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. యాసంగి సీజన్​లో వరి సాగు పెరుగుతుందని అగ్రికల్చర్​ డిపార్ట్​మెంట్​ ఆఫీసర్లు భావించారు. 

ఈ అంచనాతోనే యాసంగి 2025-–26లో మరో 26 వేల ఎకరాల్లో వరి సాగు పెరుగుతుందని భావించిన ఆఫీసర్లు 3,12,500  ఎకరాల్లో సాగు అవుతుందని ప్లాన్​లో పేర్కొన్నారు. కోతుల బెడద కారణంగా ఆరుతడి పంటల జోలికి పోవడం లేదు. దీంతో ఈసారి జొన్నలు 850 ఎకరాల్లో మొక్కజొన్నలు 185, ఇతర పంటలన్నీ కలిపి 26,465 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. మొత్తంగా ఈ సీజన్​లో 3,40,000 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని ఆఫీసర్లు అంచనాలు రూపొందించారు.

ఎరువులకు కొరత లేకుండా చూస్తాం

జిల్లాలో నీటి వనరులు బోరు బావులతో పాటు మూడు ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టులకు నీళ్లు అందుతున్నాయి.  ఈ నేపథ్యంలో జిల్లాలో వరి సాగుకే రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ యాసంగిలోనూ వరి ఎక్కువగా సాగయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. విత్తనాలతో పాటు ఎరువులకు ఏ లోటు లేకుండా చూస్తాం.- శ్రీధర్‌‌‌‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి