
న్యూఢిల్లీ: ప్రముఖ శాటిలైట్ చానెల్ ఎన్డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌తోపాటు వీరి సంస్థ ఆర్‌ఆర్‌పీఆర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సెబీ కఠిన చర్యలు ప్రకటించింది. వీరిని క్యాపిటల్ మార్కెట్ల నుంచి రెండేళ్లపాటు బహిష్కరించింది. ఈ రెండేళ్లు ముగిసే దాకా ఏ కంపెనీ బోర్డులో లేదా మేనేజ్‌మెంట్‌లో ఎలాంటి పదవీ చేపట్టకూడదని ఆదేశించింది. లిస్టెడ్ కంపెనీల్లో ఏడాది వరకు పదవులు తీసుకోకుండా నిషేధం విధించింది. మూడు లోన్ అగ్రిమెంట్ల గురించి మైనారిటీ వాటాదారులకు తెలియజేయకుండా నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ ఈ చర్య తీసుకుంది. వీటిలో ఒక లోన్‌ను ఐసీఐసీఐ నుంచి, మిగతా రెండు లోన్లను విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ (వీసీపీఎల్) నుంచి తీసుకున్నారు. వీసీపీఎల్‌ను రియలన్స్ నుంచి నహాతా గ్రూప్ దక్కించుకుంది. ఎన్డీటీవీలో పరోక్షంగా 52 శాతం వాటా రావడంతో ఓపెన్ ఆఫర్ ప్రకటించాలని సెబీ గత ఏడాది వీసీపీఎల్‌ను ఆదేశించింది. ఎన్డీటీవీకి ఇచ్చిన రూ.350 కోట్ల కన్వర్టబుల్ లోన్ ద్వారా వీసీపీఎల్‌కు ఈ 52 శాతం వాటా వచ్చింది.