
- రిజిస్ట్రేషన్ లేకుండా ఇన్వెస్ట్‌మెంట్ సలహాలు ఇచ్చేవారిపై కొరడా ఝుళిపిస్తున్న సెబీ
- తమ టెలిగ్రామ్, ప్రీమియం ఛానల్స్‌లోని పోస్టులను డిలీట్ చేస్తున్న మార్కెట్ గురూలు
బిజినెస్ డెస్క్, వెలుగు: సెబీ కొరడా ఝుళిపించడంతో ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లూయెన్సర్ల (ఫిన్‌ఫ్లుయెన్సర్ల) లో భయం మొదలైంది. ఆప్షన్స్ ట్రేడర్ పీఆర్ సుందర్ రిజిస్ట్రేషన్ లేకుండా ఇన్వెస్ట్‌మెంట్ సలహాలు ఇవ్వడంతో సెబీ ఆయన నుంచి రూ.6 కోట్లు కక్కించింది. దీంతో మిగిలిన సెల్ఫ్ మేడ్ మార్కెట్ గురూల వెన్నులో కూడా వణుకు మొదలైంది. తమ కోర్సులు, వర్క్‌షాప్‌లు, సోషల్ మీడియాలోని తమ ప్రీమియం గ్రూప్‌లను డిలీట్ చేసేస్తున్నారు. చాలా మంది ఫేక్ గురూలు టెలిగ్రాంలో పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ఛానెల్స్‌ను మెయింటైన్ చేస్తున్నారు. సబ్‌స్క్రయిబర్ల నుంచి డబ్బులు తీసుకొని, ఏ షేర్లలో ఇన్వెస్ట్ చేయాలని, ఏ ఆప్షన్స్ కొనాలి, ఎక్కడ అమ్మాలనే సలహాలను ఇస్తున్నారు. వీటిపై సెబీ కొరడా ఝుళిపిస్తోంది.
అంతేకాకుండా స్టాక్ టిప్స్ షేర్ చేసే కోర్సులు, వర్క్‌షాప్స్‌ను కూడా ఫేక్ గురూలు క్లోజ్ చేసేస్తున్నారు. స్టాక్ మార్కెట్ వర్క్‌షాప్‌లు, కోర్సులపై ప్రభుత్వ రెగ్యులేషన్స్ ఏం లేవు. కానీ, ఇన్వెస్ట్‌మెంట్ సలహాలను ఇచ్చే వ్యక్తి సెబీ (ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్) రెగ్యులేషన్స్ 2013 కింద ఇన్వెస్ట్‌మెంట్ అడ్వయిజర్‌గా రిజిస్టర్ చేసుకోవాలి. ఓ కోర్సుకు సంబంధించి ఫిన్‌విట్‌లో అప్‌డేట్స్ పెట్టిన ట్రేడర్–ట్రైనర్ తన పోస్ట్‌ను డిలీట్ చేశారు. ఈ నెల 25 నుంచి స్టార్ట్ కాబోయే ‘లెర్నింగ్ గ్రూప్’కి సంబంధించి ఆయన డిక్లరేషన్‌ను ప్లాట్‌ఫామ్ నుంచి తీసేశారు. కానీ, ఈ కోర్సుకి సంబంధించి ఇస్తున్న ఆఫర్ల మెసేజ్‌ను మాత్రం తొలగించడం మర్చిపోయారు. ‘ఫేక్ గురూలు ఇప్పుడు మీరు టెలిగ్రాం, ప్రీమియం ఛానల్స్‌లోని మెసేజ్‌లను డిలీట్ చేయడం వలన ఎటువంటి ఉపయోగం లేదు. ఈసారి మీరంతా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. శుభ్ రాత్రి’ అని ఫిన్‌విట్ ట్విట్టర్‌లో పేర్కొంది. ఈవినింగ్ టైమ్‌లో మార్కెట్ గైడెన్స్, టిప్స్ ఇస్తూ హడావిడి చేసే టెలిగ్రాం ఛానల్స్ తమ యాడ్స్ తగ్గించేశాయి.
సెబీతో పీఆర్ సుందర్ సెటిల్‌మెంట్ ఇలా..
ఫిన్‌ఫ్లుయెన్సర్ పీఆర్ సుందర్, ఆయన కంపెనీ మాన్సన్ కన్సల్టింగ్, కో ప్రమోటర్ మంగయర్కరాసి సుందర్‌పై సెబీ రూ.46,80,000 ఫైన్ వేసింది. అంతేకాకుండా అడ్వైజరీ చేస్తూ సంపాదించిన లాభాలు, వాటిపై వడ్డీలు మొత్తం రూ.6 కోట్లు తీసుకుంది. ఏడాది పాటు మార్కెట్‌లో పార్టిసిపేట్ చేయకుండా శిక్ష విధించింది. సెబీ విడుదల చేసిన సెటిల్‌మెంట్ ఆర్డర్ ప్రకారం,వీరు రూ.15,60,000 చొప్పున ఫైన్ కింద చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ లేకుండానే పీఆర్ సుందర్ ఇన్వెస్ట్‌మెంట్ సలహాలను ఇస్తున్నారని సెబీకి టిప్స్ అందాయి. మొదట వీరికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 2013 నుంచి చేసిన బ్లాగ్ పోస్టులు, టెలిగ్రాం ఛానల్స్, పేమెంట్ ఛానల్స్ ద్వారా సలహాలు ఇవ్వడంపై ఈ చర్యలు తీసుకుంది.