
- ఇండస్ఇండ్ బ్యాంక్ అధికారులపై సెబీ దర్యాప్తు
న్యూఢిల్లీ: ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిపారనే ఆరోపణలపై ఇండస్ఇండ్ బ్యాంక్‌కు చెందిన ఆరుగురు అధికారులను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) దర్యాఫ్తు చేస్తోంది. ఈ అధికారులు బ్యాంక్‌లో అకౌంటింగ్ లోపాల గురించి తెలిసినప్పటికీ, ఆ సమాచారం పబ్లిక్‌గా వెల్లడి కాకముందే స్టాక్ ఆప్షన్స్ అమ్మారా? అని తెలుసుకోవడానికి ఈ దర్యాఫ్తు జరుపుతోందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. సెబీ ఈ ఆరుగురు అధికారుల ట్రేడ్స్ టైమింగ్‌ను పరిశీలిస్తోందని, ఈ విక్రయాలు రెగ్యులేషన్స్‌ను లేదా ఇండస్ఇండ్ బ్యాంక్ ఇంటర్నల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించాయా అని నిర్ధారించనుందని తెలిపారు. ఈ దర్యాఫ్తు ప్రాథమిక దశలో ఉంది.
సెబీ ఇంకా వ్యక్తులకు లేదా బ్యాంక్‌కు షో-కాజ్ నోటీసులు (రెగ్యులేటర్ నుంచి రెస్పాన్స్ కోసం ఫార్మల్ రిక్వెస్ట్) పంపలేదు. ఈ నెల ప్రారంభంలో వచ్చిన రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం, ఇద్దరు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్స్ అకౌంటింగ్ లోపాల గురించి తెలిసినప్పటికీ, అవి పబ్లిక్‌గా వెల్లడి కాకముందే బ్యాంక్ షేర్లలో ట్రేడ్ చేశారని ఆడిట్ కంపెనీ గ్రాంట్ థార్న్టన్ ఫోరెన్సిక్ రివ్యూలో తేలింది.సెబీ ఈ రిపోర్ట్ కాపీని బ్యాంక్ నుంచి కోరిందని సంబంధిత వ్యక్తులు వెల్లడించారు. కాగా, సంవత్సరాలుగా ఇంటర్నల్ డెరివేటివ్ ట్రేడ్స్‌లో తప్పుడు అకౌంటింగ్ వల్ల బ్యాంక్‌కు సుమారు రూ. 2 వేల కోట్ల నష్టం వచ్చింది. గత నెలలో బ్యాంక్ సీఈఓ సుమంత్ కథ్పాలియా, డిప్యూటీ అరుణ్ ఖురానా తమ పదవుల నుంచి తప్పుకున్నారు.